రాష్ట్రీయం

విద్యుత్ చార్జీలు పెంచే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 15: రాష్ట్రంలో అందరికీ అందుబాటు ధరల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులను నూరుశాతం సంతృప్తిపరచటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలను పెంచకూడదని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. బుధవారం విజయవాడ విద్యుత్‌సౌధలో జరిగిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విజయానంద్ మాట్లాడారు. విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. ఫలితంగా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధితో పాటు అమరావతిలో పెట్టుబడులకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జూన్ 2014నాటికి రాష్ట్రంలో ఇంధన లోటు 10.6 శాతంగా ఉందన్నారు. ఆరునెలల్లోనే సున్నా స్థాయికి తీసుకు రాగలిగామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగానే మిగులు విద్యుత్ సాధ్యపడిందన్నారు. దేశంలో మరే రాష్ట్రం సాధించని విధంగా విద్యుత్‌రంగంలో రాష్ట్రం 81 అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. సరఫరా, పంపిణీ నష్టాలు కూడా 9.72 శాతానికి తగ్గించామని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇదో రికార్డని చెప్పారు. త్వరలోనే లైన్ నష్టాలను 6 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇంధన పొదుపులోనూ ఏపీ ట్రెండ్‌సెటర్‌గా నిలిచిందన్నారు. దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చిన తొలి జిల్లాగా తూర్పుగోదావరి నిలిచిందని, చిత్తూరు జిల్లా రెండో స్థానంలో నిలిచిందని పునరుద్ఘాటించారు. రాష్టవ్య్రాప్తంగా 31వేల సాధారణ పంపుసెట్ల స్థానంలో ఫైవ్‌స్టార్ రేటెడ్ ఇంధన సామర్థ్య పంపు సెట్లను అమర్చామన్నారు. రైతులకు ప్రభుత్వం బీఎల్‌డీసీ సౌర పంపుసెట్లను అందజేయనుందని, వీటి ద్వారా రైతులకు ఉచిత విద్యుత్తుతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకోవటం ద్వారా ఏడాదికి రూ 5వేల మేర ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుందని తెలిపారు. విజయవాడలోని ఎన్‌టీటీపీఎస్‌లో స్టేజ్-5లో 800 మెగావాట్ల కేంద్రం, నెల్లూరు కృష్ణపట్నం స్టేజ్-2లో 800 మెగావాట్ల కేంద్రం వచ్చే ఏడాది జూన్‌కల్లా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక పోలవరం జలవిద్యుత్ కేంద్రం 2020-21లో వినియోగంలోకి వస్తుందన్నారు. అందరికీ విద్యుత్ కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తామన్నారు. గడచిన కొద్ది సంవత్సరాల్లోనే జెన్‌కో సామర్థ్యం 2255 మెగావాట్లకు పెంచగలిగామన్నారు. ఏక ఏపీ ట్రాన్స్‌కో 26వేల 86 సర్క్యూట్ కిలోమీటర్ల సరఫరా లైన్లతో పాటు నాలుగేళ్లలో 308 అదనపు హైటెన్షన్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయ్ పథకం అమలులో కేంద్రం ఏపీ ఈపీడీసీఎల్‌కు మొదటి ర్యాంక్, ఏపీ ఎస్పీడీసీఎల్‌కు మూడో ర్యాంక్ గుర్తింపు ఇచ్చిందన్నారు. సౌరవిద్యుత్ స్థాపిత సామర్థ్యం 2వేల 515 మెగావాట్లకు, పవన విద్యుత్ సామర్ధ్యం 3995 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు (వెయ్యి మెగావాట్లు) కర్నూలులో ఏర్పాటైందని 28వేల సౌర పంపుసెట్లు అమర్చామని వివరించారు. విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు, ఇతర ప్రయోజనాలను 25శాతం మేరకు పెంచిన ముఖ్యమంత్రికి విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో జెఎండీలు దినేశ్ పరుచూరి, ఉమాపతి, ఇతర డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.