రాష్ట్రీయం

మహోన్నత నేతకు మహానివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: మాజీ ప్రధాని భారత రత్న అటల్‌బిహారి వాజపేయి మహాభినిష్క్రమణపై బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర , జాతీయ నాయకులు వేర్వేరు ప్రకటనల్లో వాజపేయి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వేరొక ప్రకటనలో మహోన్నత నేతకు మహానివాళి అర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేలక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జీకిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు వాజపేయి రాజకీయ భీష్ముడని అన్నారు. బీజేపీ కార్యాలయంలో సంతాపసభ నిర్వహించారు. వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంతా పాల్గొని వాజపేయికి ఘననివాళులు అర్పించారు. భారతీయుల ఆత్మ అటల్‌బిహారి వాజపేయి అని జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వాజపేయి లేని లోటును ఎవరూ పూరించలేరని డాక్టర్ కే లక్ష్మణ్ నివాళులు అర్పించారు. అటల్‌జీ పోక్రాన్ అణుపరీక్షలతో భారత్‌ను ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపారని ఎన్ రామచందర్‌రావు అన్నారు. బండారు దత్తాత్రేయ ఒక ప్రకటన చేస్తూ అపార రాజకీయ మేధావి, అజాత శత్రువు వాజపేయి అని పేర్కొన్నారు. జాతి జనుల్లో సానుకూల జాతీయవాద భావాలను రేకెత్తించి దేశప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తూ వారు సాగించిన పాలనను ఈ దేశం ఎన్నటికీ మరువదని అన్నారు. అదృష్టవశాత్తు వాజపేయితో , ఆయన ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని , తన రాజకీయ ప్రవేశానికి వాజపేయి ప్రేరణ అని దత్తాత్రేయ పేర్కొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో నేను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా సేవలందించానని, పునర్నిర్మాణ ఆవిష్కార సభకు వాజపేయి ముఖ్యఅతిథిగా విచ్చేశారని, భోజన సమయంలో తనను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారని అన్నారు. ప్రకృతి విలయతాండవం సృష్టిస్తే మీరు ప్రకృతి మీద విజయాన్ని సాధించారు అని వాజపేయి అభినందించారని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. నగరాల్లో మురికివాడల నిర్మూలనకు మల్లీన బస్తి ఆవాస్ యోజన పేరుతో ఒక పథకాన్ని ప్రతిపాదించినపుడు కొన్ని మార్పులుచేయమని సూచించారని తర్వాత తాను దానిని వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోచనగా మార్చినట్టు చెప్పగానే చాలా సంతోషపడ్డారని అన్నారు. ఆ విధంగా వాజపేయి అందరి అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారని చెప్పారు. కనుకనే భిన్నధృవాలున్న అనేక పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని అన్ని సంవత్సరాలు పాటు నడిపించగలిగారని అన్నారు.

పవన్‌కళ్యాణ్ నివాళులు
వాజపేయి మరణం భారతదేశానికి తీరని లోటని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. వాజపేయి మృతికి యావత్ జాతితో పాటు తాను కూడా దుఖిస్తున్నాని అన్నారు. ఆయన వ్యక్తి కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు. భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ఆవిష్కరించడానికి ఆయన చూపింది వజ్రసంకల్పమని అన్నారు. దేశ రక్షణకు అది కవచంగా మారిందని పేర్కొన్నారు. నిస్వార్థరాజకీయానికి ఆయన నిలువెత్తు సాక్ష్యమని, వాజపేయి రాజకీయ జీవిత ప్రయాణంలో కాంతులీనే కోణాలు ఎన్నో ఉన్నాయని, బహుభాషా కోవిదుడైన వాజపేయి ప్రసంగాలు ఎంతసేపైనా వినాలనిపిస్తుందని పవన్‌కళ్యాణ్ అన్నారు.

ఢిల్లీకి వెళ్తున్న నేతలు
వాజపేయి అంతిమసంస్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుండి బీజేపీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. వీరంతా శుక్రవారం ఉదయం బీజేపీ జాతీయ కార్యాలయంలో వాజపేయికి అంతిమ నివాళులు అర్పిస్తారు.