రాష్ట్రీయం

భారత రాజకీయ భీష్ముడు వాజపేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడి ని కోల్పోయిందని, ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. వాజ్‌పేయి ఉదార వాది అని, మానవతావాది అని, కవి, సిద్ధాంత కర్త, మంచి వక్త, నిరాడంబరుడని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకూ పని చేశారని, తాను నమ్మిన ఆదర్శాలను నిజ జీవితంలో ఆచరించి చూపించారని తెలిపారు. ఆయనను భారత రాజకీయ భీష్ముడిగా అభివర్ణించారు. వాజ్‌పేయితో తనకు అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఎంపీగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రి గా, బహుముఖ పాత్ర పోషించారన్నారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని, పార్లమెంట్‌లో అద్భుతమైన తన ప్రసంగాలతో సమకాలికులకు మార్గదర్శకం చేశారన్నారు. పార్లమెంటేరియన్‌గా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉందని, 10 సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. జనసంఘ్ అధ్యక్షునిగా, జనతా పార్టీ నాయకునిగా, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారన్నారు. ప్రధానిగా విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ప్రభుత్వం ఓడిపోయినా, ఏమాత్రం చలించని మేరునగ ధీరుడని అభివర్ణించారు. ఐదేళ్లు ప్రధానిగా దేశ ప్రజలపై చిరకాల ముద్ర వేశారన్నారు. అన్ని తరాల వారితో కలిసి పని చేసిన ఘనత వాజ్‌పేయికి దక్కుతుందని, ఐదు తరాలకు వారధి అని తెలిపారు. 1984లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన బీజేపీని, ఈ రోజు 270 సీట్లకు ఎదిగేలా చేయడంతో వాజ్‌పేయి పాత్ర కీలకమన్నారు. వాజపేయి తన మంత్రి వర్గంలో ఏడెనిమిది మంత్రి పదవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బయట నుంచి తాను ఎన్డీయేకు మద్దతు ఇచ్చామే తప్ప, మంత్రి పదవులు తీసుకోలేదని గుర్తు చేసుకున్నారు. అబ్దుల్ కలామ్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలో కూడా తాను స్వయంగా చొరవ తీసుకుని వాజ్‌పేయితో మాట్లాడటంలో, కలాంను ఒప్పించడంలో తాను క్రియాశీలకంగా వ్యవహరించానన్నారు. ప్రధానిగా అన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున వౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారని, గత 32 ఏళ్లల్లో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ఐదేళ్ల పాలనలోనివేనని తెలిపారు. నదుల అనుసంధానికి, స్వర్ణ చతుర్భుజితో రహదారుల అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.

ఏపీ అభివృద్ధికి వాజ్‌పేయి తోడ్పాటు
తడ నుంచి ఇచ్ఛాపురం వరకూ జాతీయ రహదారి అభివృద్ధి, వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నిధులు రావడంలో, పుడ్ ఫర్ వర్కు కింద రాష్ట్రానికి 50 వేల టన్నుల బియం కేటాయింపులో, మైక్రో ఇరిగేషన్ అభివృద్ధిలో, హైదరాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధికి, శంషాబాద్ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వాజ్‌పేయి సహకారం మరువలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్‌పై టాస్క్ ఫోర్సు చైర్మన్‌గా తనను నియమించనప్పుడు దేశంలో 3 మిలియన్‌ల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ చేపట్టాలని టాస్క్ఫోర్సు నివేదికలో పేర్కొన్నామన్నారు. ఏపీలో మైక్రో ఇరిగేషన్‌ను 33 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా తనకు వాజ్‌పేయితో అత్యంత సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన పరిపాలనా, రాజకీయ అనుభవాలు వాజ్‌పేయి శకంగా భారత రాజకీయాల్లో నిలిచిపోతుందంటూ వాజ్‌పేయి మృతికి నివాళులు అర్పించారు.