రాష్ట్రీయం

ఉగ్ర గోదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: అఖండ గోదారి ఉగ్రరూపం దాల్చింది..వరద తాకిడితో ఉప్పొంగుతోంది.. ఊళ్లను తాకుతూ భయకంపితం చేస్తోంది. పాపికొండలను ఒరుసుకుంటూ కొండవాగుల సరిహద్దులను చెరిపేస్తూ, ఏర్లను, సెలయేర్లను పెనవేసుకుంటూ ఉప నదులతో ఉగ్రరూపం దాల్చింది. ఉపనది శబరి వరదపోటుతో నురగల సుడులు తిరుగుతూ పరీవాహనాన్ని బెంబేలెత్తిస్తోంది. అఖండ గోదావరి నది రాజమహేంద్రవరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దిశగా ఉరకలు వేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 11.75 అడుగులకు చేరితే గోదావరి నదికి ఒకటవ ప్రమాద హెచ్చరిక, 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 17.75 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆపై ప్రమాద స్థాయిగా పరిణగిస్తారు. భద్రాచలం వద్ద 43 అడుగులకు వరద మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే డేంజర్ స్థాయిగా పరిగణిస్తారు. భద్రాచలం వద్ద 24 గంటల వ్యవధిలో ధవళేశ్వరం వద్ద ప్రవాహ నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్రవారం భద్రాచలం వద్ద 47.80 అడుగులకు చేరి రెండో ప్రమాద హెచ్చరిక దిశగా నిలకడగా ఉద్ధృతి కొనసాగుతోంది. భద్రాచలం దిగువన వున్న ధవళేశ్వరం వద్ద అంతకంతకూ ప్రవాహ ఉద్ధృతి పెరుగుతూ శుక్రవారం 3 గంటలకు 12.70 అడుగులకు చేరి ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 11 లక్షల 8 వేల 460 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ఉన్న మొత్తం 175 గేట్లను 13.50 అడుగులకు పైగా ఎత్తివేశారు. వచ్చిన జలాలు వచ్చినట్టుగా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు ప్రవాహ మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు 12.70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికకు సమీపంలో నీటిమట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి ప్రవాహం పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద 18.06 మీటర్లు, పేరూరు 12.40, దుమ్ముగూడెం 13.15, కూనవరం వద్ద 18.20, కుంట 12.97, కొయిదా 22.20, పోలవరం వద్ద 13.02, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 16.62 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది.
అఖండ గోదావరి రాజమండ్రి సమీపంలో నదీ గర్భంలో లంకల్లో జీవిస్తున్న మత్య్సకార కుటుంబాలు అధికారులు బలవంతంగా తరలించారు. వందలాది మత్య్సకార కుటుంబాలను రాజమండ్రికి బోట్లపై తీసుకొచ్చి పునరావాసం కల్పించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్‌కుమార్ గాంధీ నగరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు పునరావాసం కల్పించారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలోని కోనసీమలో గోదావరి నదీ పాయల పరీవాహ లంక గ్రామాల ప్రజలను, బ్యారేజి ఎగువ అఖండ గోదావరి నదీ పరీవాహంలోని కూనవరం, విఆర్ పురం, చింతూరు, దేవీపట్నం మండలాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీరు చేరిన క్రమంలో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు బోట్లను, లాంచీలను సిద్ధం చేశారు. దేవీపట్నం వద్ద లాంచీలను ఏర్పాటు చేసి అవసరం మేరకు ఇరవై గ్రామాల ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కూడా వరద నీరు వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మొదటిసారిగా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవాహం కొనసాగుతోంది. 2014లో, 2016లోనూ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహించింది.

గోదావరికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఈ సీజన్‌లో మొట్ట మొదటి సారిగా గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. గత ఏడాది ఏ ప్రమాద హెచ్చరిక లేకుండా ప్రవహించిన గోదావరి నదికి ఈ ఏడాది మాత్రం 11.75 అడుగులు మించి రెండో ప్రమాద హెచ్చరికల స్థాయిలో ప్రవహించింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 13.75 అడుగులకు నీటిమట్టం నమోదుకావడంతో గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద శుక్రవారం రాత్రి 13.75 అడుగుల నీటిమట్టం నమోదైంది. 13 లక్షల 15వేల 725 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి బ్యారేజీ నుంచి విడుదలయ్యాయి. బ్యారేజీ మొత్తం 175 గేట్లను ప్రవాహాం తాకకుండా ఎత్తి వేసి వరద ఉద్ధృతిని క్రమబద్ధీకరిస్తున్నారు. భద్రాచలం వద్ద రాత్రి 8 గంటలకు 47.00 అడుగుల నీటి మట్టం నమోదయ్యింది. ఈ మేరకు కాటన్ బ్యారేజి వద్ద రాత్రి రెండో ప్రమాద హెచ్చరికలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గోదావరి పరీవాహక మండలాల్లో పాఠశాలలకు శనివారం నుంచి శెలవు ప్రకటించారు. అధికార యంత్రాంగం అప్రమత్త చర్యలు చేపట్టారు.