రాష్ట్రీయం

మృత్యుశకటం.... కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 11: ఆర్టీసీ చరిత్రలోనే ఓ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వాహనమే మృత్యుశకటంగా మారింది. తెలంగాణలోని కొడిమ్యాల మండలం శనివారంపేట ఘాట్‌రోడ్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో 57 మంది దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు అంజన్న దర్శనానంతరం ఉదయం 11 గంటలకు ఘాట్ రోడ్డు వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 57మంది ప్రయాణికులు మృతి చెందారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. 30మంది అక్కడికక్కడే చనిపోయారు. చికిత్స పొందుతూ 27 మంది మృతి చెందారు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. జగిత్యాల డిపోకు చెందిన ఏపీ-28జడ్ 2319 నంబర్ బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌ల మీదుగా కొండగట్టుకు చేరుకుంది. 99 మంది ప్రయాణికులతో బస్సు జగిత్యాలకు వస్తుండగా కొండగట్టు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి బోల్తాపడింది. బస్సు మూడు పల్టీలు కొట్టింది. సమాచారం అందిన వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ శరత్, జిల్లా ఎస్పీ సింధూశర్మ క్షతగాత్రులను జగిత్యాల జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరిపిన అనంతరం తీవ్రగాయాల పాలైన కొందరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని జగిత్యాల జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కరీంనగర్‌లో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుల వివరాలు
ప్రమాదంలో కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామానికి చెందిన నామాల వౌనిక (24), గండి లక్ష్మి (60), గోలి అమ్మాయి (44), బోల్లారం బాబు (54), లైశెట్టి చంద్రయ్య (45), ఇండికల ఎంకవ్వ (50), చింద్రికాల సుమ (30), కుంభాల సునంద (45), గుడిసె రాజవ్వ (50), రాంసాగర్ గ్రామానికి చెందిన బైరి రుత్విక్ (3), తిరుమణి ముత్తయ్య (40), రాగాల ఆనందం (55), తిరుమణి ముత్తయ్య (40),హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన పోలు లక్ష్మి (50), చర్ల లక్ష్మి (45), లాంభ కోటవ్వ (65), మల్యాల అనిల్ (30), మెదునూరి మదనవ్వ (75), చెర్ల హైమా (30), వేముల భాగ్యవ్వ (50) మరణించారు. అలాగే డబ్బుతిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన డబ్బు అమ్మాయి (50), రాజవ్వ (56), గాజుల చినవ్వ (60), పిడుగు రాజవ్వ (30), ఉడినాల లస్మవ్వ (55), కాశీరాం (65), బొంగిరి మల్లయ్య (55), గోలుకొండ లచ్చవ్వ (50), గోలుకొండ దేవవ్వ (63), తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పిప్పరి వెంకటరత్నం (56), సండ్రాల్లపల్లికి చెందిన కంకణాల ఎల్లవ్వ (70), మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బద్దం లస్మవ్వ (65), కోనాపూర్‌కు చెందిన ఉత్తం నందిని, ఉత్తం భూలక్ష్మి (40), తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సీకూర మల్లవ్వ (38), దాసరి సుశీల (50), వేములవాడ మండలం కోరెంకు చెందిన కొండ అరుణ్‌సాయి (5), రేకుర్తి గ్రామానికి చెందిన బాలసాని రాజేశ్వరి (40), పెద్దపల్లికి చెందిన బొంగోని భూమక్క (50)లతోపాటు ఆర్టీసీ బస్ డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్య అధికారులు ధ్రువీకరించారు. మరో ఆరుగురు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

రాష్టప్రతి, ప్రధాని,సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదంలో 57మంది దుర్మరణం చెందిన ఘటనపై భారత రాష్టప్రతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొండగట్టు ఘటనపై ట్విటర్‌లో రాష్టప్రతి రాంనాథ్‌కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ పోస్టుచేస్తూ మృతులను కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఇదే ప్రాంతానికి చెందిన మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కొడిమ్యాల మండలం ఘాట్ రోడ్డుపై ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అపద్ధర్మ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జగిత్యాల కలక్టర్‌ను గవర్నర్ ఆదేశించగా, ఘటనా స్థలానికి స్వయంగా వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు ఈటల, కేటీఆర్, మహేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొండగట్టు బస్సు ప్రమాదం ఘటన పట్ల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేసారు.

గుండెలు పిండేస్తున్న శవాల మూటలు
మల్యాల: కొండగట్టు ఘాట్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలం శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బుతిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన వారే పదుల సంఖ్యలో మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో ప్రజల రోదనలు మిన్నంటాయి. జగిత్యాల ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం మృతుల శవాలను కుప్పలుగా పేర్చి పెట్టడంతో ఆసుపత్రికి తరలివచ్చిన ప్రజల రోదనలు మిన్నంటాయి. ఆయా గ్రామాలకు చెందిన మృతులను ట్రాక్టర్లలో పేర్చి తీసుకుపోవడం.. ఆసుపత్రి పరిసరాల్లో మృతుల బంధువులు గుండెలు పిండేలా రోదనలు చేయడం ప్రజలను కలిచి వేసింది. రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మాయిపల్లి, శనివారంపేట గ్రామాల ప్రజలు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా సహాయ చర్యలు చేపడుతూ మృతుల బంధువులను ఓదార్చుతూ దహన సంస్కారాలకు తీసుకెళ్లారు.