రాష్ట్రీయం

కేంద్రంపై రాజీ లేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: రాష్ట్ర విభజన హామీలు నెరవేరే వరకు కేంద్రంపై రాజీలేని సంఘటిత పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్య్రాప్తంగా ప్రత్యేక హోదా ఉద్యమాల సందర్భంగా నమోదైన క్రిమినల్ కేసులను పరిశీలించి ఎత్తివేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభలో ‘విభజన హామీల అమలు’పై సోమవారం లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం వైఖరిపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. నాడు యూపీఏ హేతుబద్ధత లేని విభజనతో రాష్ట్రానికి అన్యాయంచేస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్ర ప్రజలను నిలువునా వంచించారని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన అప్పులు మాత్రమే కట్టబెట్టి కట్టుబట్టలతో విభజన చేశారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ ఉద్ధరిస్తుందనుకుని మద్దతిస్తే మోసం చేసిందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర బ్లూ ప్రింట్ నమూనా మా వద్ద ఉంది.. ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నగరాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని పార్లమెంటు మట్టి, యమునా జలాలను అమరావతికి తీసుకువచ్చిన ప్రధాని మోదీ మాట తప్పి అవినీతి పరులతో అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేకహోదా ప్రకటించి అవసరాలు తీరాక ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్‌లను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తంగా 16 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఈఏపి (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు) కింద రాయితీగా 90, 10 శాతం ఇస్తూ ఏపీ నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. గుజరాత్‌లో విగ్రహాలకు, భూ సేకరణకు రూ 2500 కోట్లు ఖర్చుపెట్టి విభజన తరువాత రాజధానికి నిధులివ్వమంటే కేవలం రూ 15 వందల కోట్లు మాత్రమే విదిలించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి స్థాయికి మాట తప్పటం సమంజసం కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ సేకరణతో సవరించిన అంచనాలు పంపినా ఇప్పటి వరకు స్పందనలేదని, ఇంకా రూ. 2450 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరుల నుంచి రైతులకు రుణమాఫీ చేస్తే రెవెన్యూలోటులో కోత విధించారని ఆరోపించారు. చట్టాలను గౌరవించరు.. మీరేమైనా ఉచితంగా ఇస్తున్నారా.. మేమూ పన్నులు కడుతున్నాం..యూసీలు పంపితే తీసుకోరు..కుంభమేళాకు వేలకోట్లు ఖర్చుచేస్తారు..రాజధానికి నిధులెందుకివ్వరని ప్రశ్నించారు. అడిగినా, అడక్కపోయినా ఇవ్వరనేది తేలిన తరువాతే ఎన్డీఏ నుంచి వైదొలగామని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. దుగ్గరాజపట్నం పోర్టు ఫీజిబులిటీలేదని నిలిపివేశారు.. వీసీఐసీ కారిడార్‌కు ఏడీబీ నుంచి రుణం తీసుకున్నాం.. పెట్రోకెమికల్ యూనివర్శిటీకి అనుమతులివ్వరు.. అసలు కేంద్రం ఉద్దేశ్యమేంటని నిలదీశారు. షెడ్యూల్డ్ సంస్థల ఆస్తుల బదలాయింపు ఇప్పటివరకు జరగలేదు.. రెండు రాష్ట్రాలతో సంప్రతింపులు జరిపి సమావేశాలు నిర్వహించాల్సిందిపోయి చిచ్చు రగిలిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఓ రకంగా, ప్రధాని మోదీ మరోరకంగా తనను నిందించే స్థాయి లేదన్నారు. కాలం కలిసొచ్చి మోదీ ప్రధాని అయ్యారు.. గుజరాత్ అప్పుల్లోనే ఉంది.. అభివృద్ధి నమూనా కనిపించటంలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంజూరు చేయలేదన్నారు. నాలుగేళ్లుగా ఢిల్లీచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవక పోవటం దారుణమన్నారు. సమస్య పరిష్కారంచేసే పరిస్థితుల్లో మోదీ, అమిత్‌షా లేరన్నారు. అక్రమాస్తుల కేసులో కూరుకుపోయిన, అవినీతి నేత వైసీపీ అధినేత జగన్‌తో అంటకాగటంతో పాటు విజయ్‌మాల్యా లాంటి వారిని దేశం దాటించిన ఆరోపణలు మోదీని వెంటాడుతున్నాయన్నారు. రాజకీయ ఎత్తుగడలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన నిధులను వెనక్కుతీసుకున్న ఏకైక ప్రధాని మోదీ అని విమర్శించారు. ఎస్పీవీకి, అవినీతికి లింకేమిటని ప్రశ్నించారు. ఎవరి చెవిలో పూలు పెట్టేందుకు ఈ ప్రచారం చేస్తున్నారో అంతుచిక్కటం లేదన్నారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే భావనతోనే 2010లో బాబ్లీపై అందోళన చేపడితే 8 ఏళ్ల తరువాత కక్షకట్టి దురుద్దేశ్యపూర్వకంగా నోటీసులు పంపటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘నాకు సానుభూతి అవసరంలేదు..సమైక్య రాష్ట్రంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా..9 ఏళ్లు ప్రతిపక్షనేతగా ప్రజలు గౌరవించారు..తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింద’న్నారు. ధర్మాబాద్ వారెంట్లపై చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ‘నేను తప్పుచేయలేదు.. ఎవరూ ఏమీ చేయలేరు.. గతంలో 21 కేసులు బనాయించి తోకముడిచారు.. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఆంధ్రప్రజలు శాశ్వతంగా బీజేపీని క్షమించర’న్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి 75 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పి ప్రస్తుతం నోరు మెదపకపోవటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ ఏనాడూ పార్లమెంటులో ప్రస్తావించకపోగా కేసుల మాఫీకై కేంద్రం ముందు మోకరిల్లుతోందని విమర్శించారు.

శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు