రాష్ట్రీయం

ఏపీకి ‘ఇంధన’ అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ఇంధన రంగంలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో ఏపీ చేపట్టిన చర్యలు మరో 10 అవార్డులను చేజిక్కించుకునేలా చేశాయి. ఈ-మెజర్‌మెంట్ బుక్‌కు సంబంధించి ఏపీ ట్రాన్స్‌కోకు 2018 స్కోచ్ అవార్డు
దక్కింది. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలకు రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌కు ఒక అవార్డు, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించినందుకు నెడ్‌క్యాప్‌కు 8 స్కోచ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో బుధవారం వన్ నేషన్, వన్ ప్లాట్‌ఫాం అన్న నినాదంతో స్కోచ్ నిర్వహించిన 53వ సమ్మిట్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ట్రాన్స్‌కో తరపున నెడ్‌క్యాప్ వైస్‌చైర్మన్ కమలాకర బాబు, ఎపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖర రెడ్డి అవార్డులను అందుకున్నారు. ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని అవార్డు కమిటీ సభ్యులు అభినందించారు. విద్యుత్ రంగంలో ప్రజాహిత విధానాలు, సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ మంచి ఫలితాలను ఇస్తోందని జ్యూరీ సభ్యులు బన్సల్, శర్మ, చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సందేశాన్ని చంద్రశేఖర రెడ్డి చదివి వినిపించారు. ఇంధన సామర్థ్యంలో ఏపీని ఉత్తమ రాష్ట్రంగా నిలిపేందుకు అన్ని విభాగాలను భాగస్వాములను చేసిందన్నారు. సరఫరా, పంపిణీ నష్టాలను 9.72 శాతానికి తగ్గించామన్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం 2515 మెగావాట్లకు, పవన విద్యుత్ సామర్థ్యం 3995 మెగావాట్లకు చేరిందని తన సందేశంలో తెలిపారు. సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద 1471 కోట్ల రూపాయలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్కు బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అందరికీ విద్యుత్ కార్యక్రమం కింద 3185 కోట్ల రూపాయలతో నెట్‌వర్కును బలోపేతం చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

చిత్రం..న్యూఢిల్లీలో పీఎంవో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్
గుల్షన్ రాయ్ నుంచి అవార్డు అందుకుంటున్న ఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖర్ రెడ్డి (కుడివైపు)