రాష్ట్రీయం

సెంటిమెంటే చంపేసిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహే0ద్రవరం: గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం ప్రజల సెంటిమెంట్ అని కమిషన్ తేల్చడం పట్ల మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇవి సాధారణ పుష్కరాలు కావని, మహా పుష్కరాలని, ప్రజలు లక్షల్లో తరలివచ్చి, పుష్కర స్నానాలు ఆచరించాలని ప్రచారం చేసిన ప్రభుత్వం, దానికి తగినట్టుగా ఏర్పాట్లుచేయడంలో విఫలమైతే దాన్ని మృతుల సెంటిమెంటుకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికారంతో ఏదైనా చేయొచ్చని ప్రభుత్వం ఈ నివేదిక ద్వారా మరోసారి రుజువుచేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర శాసన సభలో బుధవారం ప్రవేశ పెట్టిన సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్ నివేదిక మరోసారి బాధిత కుటుంబాలను హతాశులను చేసింది. కట్టలు తెంచుకున్న భక్తుల సెంటిమెంట్‌కు కారణం మీడియా అత్యుత్సాహంతో విస్తృత ప్రచారం చేయడమేనని నివేదికలో పేర్కొనడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
గోదావరి మహా పుష్కరాలు మొదటి రోజు 2015 జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయక భక్తులు అశువులుబాశారు. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. పలుమార్లు పొడిగింపులతో ఎట్టకేలకు కమిషన్ విచారణ పూర్తయ్యింది.
పుష్కర తొక్కిసలాట నివేదికలో ప్రధానమైన అంశాలను పక్కనబెట్టినట్టు స్పష్టమవుతోంది. సీసీ పుటేజీ మాయం, నేషనల్ జియోగ్రఫీ చానల్ చిత్రీకరించిన విజువల్స్‌ను ఎడిట్ చేసి కమిషన్ ముందు పెట్టడం తదితర అంశాలు సమస్యను పక్కదారి పట్టించడానికి దారి తీసిందనే ఆరోపణలకు బలం చేకూరింది.
ఇక ఈ ఘటనకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడమే కారణమని పేర్కొనడం దారుణమని పలువురి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పుష్కరాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పదే పదే మీడియాకు విజ్ఞప్తి చేయడం, పుష్కరాలకు ముందు అన్ని ప్రాంతాల నుంచి శోభాయాత్రగా గోదావరి నదికి చేరుకోవాలని తదితర ప్రక్రియల ద్వారా జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని కోరడం, జాతీయ, అంతర్జాతీయ మీడియాను కవరేజికి తీసుకురావడం, నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌ను రప్పించి విస్తృత కవరేజీ చేయించడం తదితరాలన్నీ ప్రభుత్వం చేసిన ప్రచారం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిజాలను తొక్కిపెట్టిన నివేదిక
జస్టిస్ సోమయాజులు వాస్తవాలు ప్రకటించకుండా, నిజాలను తొక్కిపెట్టి, ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడ్డానికి ఈ నివేదిక ఇచ్చారని భారత న్యాయవాదుల సంఘం సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు. అనేక ముఖ్యమైన విషయాలను నివేదికలో ప్రస్తావించలేదన్నారు. సీపీ పుటేజీ 72 గంటల పాటు ఉంచాలి, ఎందుకు మాయం చేశారని, కమిషన్ ముందు పుటేజీ స్టోరేజి చేయలేదని చెప్పారని, వీఐపీ ఘాట్ వుండగా పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి కార్యక్రమం ఎందుకు పెట్టారని, పుష్కర ఘాట్ వద్ద కాన్వాయ్ పెట్టకూడదని, భక్తులను గోదావరి రైల్వే స్టేషన్ నుంచి ఇతర ఘాట్లకు ఎందుకు మళ్ళించలేకపోయారని ముప్పాళ్ళ ప్రశ్నించారు. మీడియాను తప్పంటున్న కమిషన్ ప్రభుత్వం రూ. కోట్ల నిధులతో ఎందుకు ప్రచారం చేసిందని, దీనిని ప్రశ్నించరా అని నిలదీశారు. ప్రభుత్వమే ముహూర్తం నిర్ణయించిందన్నారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతుందన్నారు.
సెంటిమెంటు ముఖ్యమంత్రికి
వర్తించదా: సీపీఎం
ప్రజలంతా పుష్కర ముహూర్తానికే స్నానం ఆచరించాలని ఆరాటపడినందువల్లే ఈ దుర్ఘటన జరిగిందని నివేదికలో పేర్కొన్నారని, మరి అదే ముహూర్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా స్నానం ఆచరించారనే విషయాన్ని గుర్తించాలని సీపీఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ పేర్కొన్నారు.
అదే సమయానికి స్నానం చేయాలనుకోవడం ప్రజల మూఢ నమ్మకం అనుకుంటే, అది ముఖ్యమంత్రికీ వర్తిస్తుందన్నారు. తప్పంతా మీడియాది అనడం సరికాదని, తప్పంతా ప్రచారం చేసిన ప్రభుత్వానిదేనని ఆరోపించారు.