రాష్ట్రీయం

గ్రామీణ బ్యాంకుల్లో నెంబర్ వన్.. ఏపీజీవీబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ సహకారం, భారతీయ స్టేట్ బ్యాంకు ప్రోత్సాహంతో కొనసాగుతున్న గ్రామీణ బ్యాంకుల్లో ఏపీజీవీబీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ మల్లాది సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని రీజినల్ బ్రాంచ్‌లో ఖాతాదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ (ఆర్‌ఆర్‌బీ) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఏపీజీవీబీ మొదటి స్థానంలో ఉండటంలో ఖాతాదారులు, డిపాజిటర్లు, బ్యాంకు సిబ్బంది కారణమన్నారు. గ్రామీణ బ్యాంకులో డిపాజిట్లు చేస్తే ఆ నిధులు ఈ ప్రాంతానికి చెందిన వారికే వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. జాతీయత కలిగిన బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే ఆ నిధులను దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మంది ఖాతాదారులతో 768 శాఖలు విస్తరించినట్లు స్పష్టం చేసారు. 28,650 కోట్ల వ్యాపారంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఇందులో 14,334 కోట్లు డిపాజిట్లు ఉండగా, 14,317 కోట్లు అడ్వాన్స్‌గా ఉన్నాయని తెలిపారు. 530 కోట్ల గరిష్ట లాభంతో ఏపీజీవీబీ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు నిరర్ధక ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ నెల 10 తేదీ నుండి 210 రోజులకుపైగా డిపాజిట్ చేసిన వారికి 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ రూపంలో చెల్లిస్తున్నట్లు వివరించారు. డిపాజిట్లకు ఏలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు, ఖాతాదారులు పూర్తి భరోసాతో డిపాజిట్లు చేసుకోవాలని సూచించారు. పంట రుణాలు, ఎస్‌హెచ్‌జీ రుణాలకు దీటుగా గృహ నిర్మాణాలు, మార్టిగేజ్, వ్యాపార సంస్థల నిర్వహణకు మెరుగైన రుణ సౌకర్యం కల్పిస్తూ బ్యాంకు సేవలను విస్తరించామన్నారు. రుణాలు తీసుకున్న వారికి మహిళలకు 8.60 శాతం వడ్డీ తీసుకుంటే ఇతరులకు 8.65 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని శాఖల్లో డబ్బు నిల్వలకు ఏలాంటి కొదువ లేదని, ఖాతాదారులకు అవసరమైన డబ్బులను వెంటనే సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్‌తో అనుసంధానించుకుని పని చేస్తున్న ఏపీజీవీబీకి ఏటీఎంలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, తమ ఖాదారులు దేశంలో ఎక్కడి ఏటీఎంలోనైనా డబ్బులు పొందే వెసులుబాటు ఉందన్నారు. రాష్ట్రంలో కేవలం రెండు మాత్రమే ఏపీజీవీబీ ఏటీఎం కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డిలో సకల వసతులతో కూడిన స్వంత భవనాన్ని నిర్మాణం కొనసాగుతుందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఖాతాదారులు పూర్తి దీమాతో ఏపీజీవీబీలో చేరాలని పిలుపునిచ్చారు. కేంద్రం 50 శాతం, రాష్ట్రం 15 శాతం, భారతీయ స్టేట్ బ్యాంకు 35 శాతం పెట్టుబడులతో కొనసాగుతున్న ఏపీజీవీబీకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డిపాజిట్లు రావడం లేదన్న విషయాన్ని ఆర్‌బీఐకీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వ డిపాజిట్లు వస్తే బ్యాంకు లావాదేవీలు మరింతగా విస్తృతమై మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. ఆర్‌బీఐ డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా విన్నవించి, గ్రామీణ బ్యాంకులకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నట్లు ప్రకటించాలని కోరామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సంగారెడ్డి రీజినల్ మేనేజర్ మల్లంపాటి రవి, వరంగల్ బ్రాంచ్ సీనియర్ అధికారి సుబ్రమణ్యశర్మ, ఆయా శాఖల మేనేజర్లు గోవింద్ నాగేశ్వర్, సామెల్ తదితరులు పాల్గొన్నారు.