రాష్ట్రీయం

మావో దళనేత వినోద్ లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 19: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కీలకదళంగా ఉన్న శబరి ఏరియా కమిటీ దళ డిప్యూటీ కమాండర్ మడివి దేవయ్య అలియాస్ వినోద్ తూర్పు గోదావరి జిల్లా పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఈమేరకు వినోద్‌ను కాకినాడ ఎస్పీ కార్యాలయంలో శనివారం విలేఖరుల వద్ద పోలీసులు ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీలోని ఏటపాక మండలం జగ్గారం శివారు విస్సాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల మడివి దేవయ్య అలియాస్ వినోద్ అలియాస్ దేవా అనే మావోయిస్టు గతంలో దళ సభ్యుడిగా అనేక కీలక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సరిహద్దులోని శబరి ఏరియా దళ కమిటీ సభ్యుడైన దేవయ్య 14 ఏళ్ళ వయస్సులో మావోయిస్టుల ప్రభావానికి ఆకర్షితుడై దళంలో చేరాడన్నారు. అప్పటి నుండి ఆదిలాబాద్ మంగి దళం సభ్యుడిగా ఏడాది పాటు వ్యవహరించి, అక్కడి నుండి వివిధ ప్రాంతాల్లో దళ సభ్యుడిగా పనిచేశారని చెప్పారు. 2012 నుండి ఇప్పటి వరకు శబరి దళ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు. దేవయ్య తొమ్మిది కేసుల్లో ముద్దాయిగా ఉన్నారన్నారు. దేవయ్య తన కుటుంబ సభ్యుల సమస్యలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇకపై ప్రశాంత జీవనాన్ని గడపాలనే యోచనతో లొంగిపోయాడని చెప్పారు. దేవయ్యపై ఉన్న 5 లక్షల రివార్డును అతడికే చెల్లిస్తామని, ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ పోలీసుల అదుపులో
శ్రీకాకుళం జిల్లా యువకుడు!
ఇచ్ఛాపురం, మార్చి 19: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని రత్తకన్న నాయుడు వీధికి చెందిన నంబూరు మోహనాచారి (20) అనే యువకుడిని శనివారం ఉదయం రెండు వాహనాల్లో వచ్చిన హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లడం సంచలనం సృష్టించింది. టిఫిన్ చేసి ఇంటి వరండాలో ఉన్న మోహనాచారిని ముఖాలకు రుమాళ్లు కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లారు. తల్లి లక్ష్మి, స్థానికులు కేకలు వేస్తూ అడ్డుకోగా తాము హైదరాబాద్ పోలీసులమని, ఒక కేసు విచారణకు సంబంధించి మోహనాచారిని తీసుకెళ్తున్నామన్నారు. తమ కారు నెంబరు ఎపి 31 టియు 2245ను నమోదు చేసుకోవాలని సూచించారు. తమకు అడ్డుపడితే వారిని కూడా తీసుకెళ్ళాల్సి వస్తుందని హెచ్చరించడంతో స్థానికులు వెనక్కు తగ్గారు. వెంటనే గ్రామ పెద్దలు, మోహనాచారి తండ్రి పట్టణ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసారు. ఈలోగా మోహనాచారిని తీసుకెళ్లిన హైదరాబాద్ పోలీసులు పట్టణ పోలీసులతో మాట్లాడి తామే తీసుకెళుతున్నామని ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ రాము గ్రామ పెద్దలకు, తండ్రి వైకుంఠరావుకు చెప్పి పంపారు. తమ కుమారుడిని ఎందుకు తీసుకెళ్లారో తెలియడం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే మోహనాచారిని ఏ కేసులో విచారణకు తీసుకెళ్తున్నదీ స్థానిక పోలీసులకు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు స్పష్టం చేయకపోవడంతో చర్చనీయాంశమైంది.