రాష్ట్రీయం

ఆదర్శం.... ప్రకృతి సేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రకృతి వ్యవసాయం విశ్వవ్యాప్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) విధానం వల్ల ఆహారభద్రతతో పాటు మానవ జీవన కాలపరిమితి పెరుగుతుందన్నారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై మంగళవారం ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్టు చెప్పారు. భారతదేశంలోనే ఈ విధానాన్ని అవలంబిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ అన్నారు. ఎనిమిది మిలియన్ హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ప్రకృతి సేద్య విధానంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోందని బాబు వివరించారు. ఏపీకి అనేక ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి.. రాష్ట్ర జీఎస్‌డీపీ 28 శాతం వ్యవసాయానిదే అన్నారు. అరవై రెండు శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే జీవనాధారమన్నారు. హరిత విప్లవంతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ధాన్యాగారంగా రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో పంటలు పండించే భూమి 8 మిలియన్ హెక్టార్లని ఇందులో బహుళ పంటల విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పారు. 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండి దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. పండ్లను కూడా అత్యధికంగా ఉత్పత్తి చేస్తామని, ఆక్వాకల్చర్‌లో నెంబర్ వన్ స్థానాన్ని సాధించామన్నారు. రాష్ట్రంలో 1.7 మిలియన్ హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగులో ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను అధిగమించటానికే ప్రకృతి వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్- జెడ్‌బీఎన్‌ఎఫ్)ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తదన్నారు. ఉత్పాదక వ్యయం తగ్గించామని, దిగుబడి పెరుగుతుందన్నారు. వాతావరణ ప్రతికూలతలను ప్రకృతి వ్యవసాయం తట్టుకోగలదన్నారు. జనాభాలో అధికశాతం మంది రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించి ఉత్పత్తిచేసిన ఆహార పదార్థాలను భుజించాల్సిన పరిస్థితి తప్పటం లేదన్నారు. ప్రకృతి వనరుల విధ్వంసం వల్లే భూసారం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దటంలో ఐటీ నిపుణులు కూడా వ్యవసాయరంగం వైపు మళ్లుతున్నారని తెలిపారు. భూ సారం పెరిగి జలవనరులను పరిరక్షించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. దీనివల్ల రైతు సంక్షేమం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రకృతి సేద్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. పైసా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంతో గోమూత్రంతో, ఆవుపేడ పూసిన విత్తనాలు ఉపయోగిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఇప్పుడు భూమి ఆరోగ్యవంతంగా ఉందన్నారు. ఎక్కువ ఖరీదు కూడా అవసరంలేదని, ఆర్గానిక్ కల్చర్ కంటే ప్రకృతి వ్యవసాయానికయ్యే ఖర్చు తక్కువ అన్నారు.
మామూలు వ్యవసాయం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే దయనీయ పరిస్థితులు ఉన్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రకృతి వ్యవసాయంపై మొగ్గుచూపే దిశగా జాగృతం చేసేందుకు మూడేళ్ల వ్యవధి పట్టిందన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు సాధించడం ద్వారా రైతుల్లో విశ్వసనీయత ఏర్పడిందన్నారు. తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 50 శాతం, మూడవ సంవత్సరం 80 శాతం లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ఐదేళ్లలో నూరుశాతం ప్రకృతి వ్యవసాయం దిశగా రైతాంగాన్ని చైతన్యపరచాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు.
మహిళా సాధికార బృందాలే మా బలం.. రెండు దశాబ్దాల క్రితం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం.. ఇప్పుడు 9 లక్షల బృందాలు ఉన్నాయి.. ప్రకృతి వ్యవసాయంపై వీరంతా రైతాంగానికి అవగాహన కలిగిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పదిరోజులు మకాంవేసి రైతులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. చిట్టచివరి రైతుకూ నాలెడ్జి ఫలాలు అందే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పండించిన పంటను పరీక్షించి అది ఏ నేలలో పండించారు? రసాయన ఎరువులు వేసి పండించారో లేదో తేల్చుకునే సాంకేతికాంశాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ట్రాకింగ్, ఐటీలో చాలా పటిష్టంగా ఉన్నామన్నారు. ఇంటర్నెట్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సమాహారం అయిన ఐఓటీతో భూగర్భజలాల మట్టాలను అంచనా వేసే వీలు కలుగుతోందన్నారు. రియల్‌టైం మేనేజిమెంట్‌తో భూ ఉపరితలంపై కురిసిన వర్షపునీటిని ఒడిసి పడుతున్నాం.. వాటిని భూగర్భజలాలుగా మార్చుతున్నామని తెలిపారు. అల్పపీడనాలు ఏర్పడి తుపానులుగా మారి అవి ఎక్కడ కేంద్రీకృతమయ్యాయో రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ పసిగడుతుందని న్యూయార్కులో ఉండి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామంలో వీధిలైట్ల వ్యవస్థను నిర్వహించే పరిస్థితి తెచ్చామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఇదే తరహాలో ప్రజల జీవనశైలి మరింత మెరుగుపరిచేందుకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ తీసుకొస్తున్నామని ప్రకటించారు.
2016లో 40వేల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే 2017కు 63వేల మంది భాగస్వాములయ్యారని ఈ ఏడాది ఐదులక్షల మంది ఐదు లక్షల ఎకరాల్లో సేద్యం చేస్తున్నారని తెలిపారు. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు ప్రకృతి సేద్యం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. అదే 2024కు 60 లక్షల మంది రైతులు పైసా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలు, సంస్థలు ఉన్నాయి.. ఆహార గొలుసుకట్టు సంస్థలు పనిచేస్తున్నాయి.. భావసారూప్యం ఉన్న పౌరులు, సంస్థలు ముందుకొచ్చి తమకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సేద్యంలో పెట్టుబడి పెడితే డాలర్ ఒక్కింటికీ 13 డాలర్ల లాభం వస్తుందని భరోసా ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో పెట్టుబడితో సహా 365 డాలర్ల తలసరి ఆదాయం వస్తుందని, జెడ్‌బీఎన్‌ఎఫ్ ఉత్పత్తులతో ఆహార భద్రత, పోషకాహారం లభిస్తుందన్నారు. రైతు క్షేమం.. సంక్షేమం రెండూ ముఖ్యమన్నారు. 2022 కల్లా ఏపీ సుస్థిర అభివృద్ధిని సాధించాలనేది తమ లక్ష్యమని బాబు చెప్పారు. విద్యుదుత్పాదనతో పాటు నిల్వ చేసేందుకు అవసరమైన అధునాతన పద్దతులను అనే్వషిస్తున్నామని తెలిపారు. మీరంతా ఆంధ్రప్రదేశ్‌కు రండి.. ప్రభుత్వ అతిథులుగా గౌరవిస్తాం.. ప్రకృతి వ్యవసాయంలో మా విధానం నచ్చితే అంతర్జాతీయ సమాజానికి అన్వయించే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయంపై ఐరాస వేదికపై ప్రసంగించే అరుదైన అవకాశం అదృష్టంగా భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.