క్రైమ్/లీగల్

‘లివిటిపుట్టు’ వెనుక భయంకర నిజాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అరుకు, అక్టోబర్ 1: విశాఖ ఏజెన్సీలో లివిటిపుట్టు గ్రామంలో గత ఆదివారం జరిగిన జంట హత్య కేసును చేధించేందుకు సిట్ అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో కొన్ని భయంకర నిజాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. కిడారిని హతమార్చడం వెనుక ఆయన రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందన్న దిశగా పోలీసులు విస్తృత దర్యాప్తు జరుపుతున్నారు. మరోపక్క ఈ జంట హత్యల ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. సర్వేశ్వరరావు, సోమను హతమార్చడానికి స్కెచ్ వేసింది వైసీపీ నేతలే అంటూ టీడీపీ విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ ఆరోపిస్తుంటే, కాదు..కాదు.. టీడీపీ అగ్రనేతే కుట్రపన్ని హతమార్చారంటూ వైసీపీ నాయకుడు కరుణాకరరెడ్డి ప్రత్యారోపణ చేస్తున్నారు. దీంతో ఈ జంట హత్యల వెనుక మావోల ప్రమేయం కన్నా, రాజకీయ జోక్యంపైనే సిట్ అధికారులు ఎక్కువగా దృష్టిపెట్టారు.
లివిటిపుట్టు ఘటన జరిగిన మూడో రోజునే లివిటిపుట్టు గ్రామంలో కొంతమంది ముఖ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, వదిలిపెట్టారు. అలాగే, అంత్రిగూడ గ్రామానికి చెందిన ఎనిమిది మందిని గత రెండు రోజులుగా అరుకులో విచారిస్తున్నారు. వీరిలో నలుగురిని ఇప్పటికే విచారించి వదిలిపెట్టారు. మరో నలుగురు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇప్పటి వరకూ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారంతా గతంలో వైసీపీలో ఉండేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. వీరిని విచారించి వదిలిపెట్టినా, వారిపై పోలీసుల నిఘా మాత్రం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా కిడారిని మావోయిస్ట్‌లు హతమార్చడానికి గూడ క్వారీయే కారణమని ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. కానీ, ఆ క్వారీ ఒక్కటే కారణం కాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే, కిడారి ఈ క్వారీని 2006 నుంచి నడుపుతున్నారు. అప్పటి నుంచి ఆయన ఆ గ్రామంలో ఉన్నవారిని, తదితరులను సమన్వయ పరుచుకుంటూ క్వారీని నడిపిస్తున్నారు. అయితే, నాలుగు, ఐదు నెలల నుంచి ఆ క్వారీ నిర్వహణను ఆ చుట్టుపక్కల గ్రామాల వారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కిడారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. సుమారు 12 ఏళ్ల నుంచి నడుస్తున్న క్వారీని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తే, రాజకీయ వైరమే కారణమని తెలుస్తోంది. కిడారి సర్వేశ్వరరావు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. అప్పటి నుంచి తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. కొంత కాలం కిందట సర్వేశ్వరరావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అదే సమయంలో ఆయన వర్గమంతా టీడీపీలో చేరిపోయింది. ఇదే ఇప్పుడు అరుకు నియోజకవర్గంలో చిచ్చు రగిల్చినట్టు తెలుస్తోంది. కిడారి ఎదుగుదలను జీర్ణించుకోలేనివారు అతని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో మావోయిస్ట్‌లతో చేతులు కలిపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శ, ప్రతివిమర్శలు చూస్తే ఈ హత్యల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడేలా ఉన్నాయి. మావోయిస్ట్‌లు కిడారిని హతమార్చే ముందు ‘వైసీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు వచ్చావు? ఎన్ని కోట్లు తీసుకున్నావు?’ అని ప్రశ్నించడం కూడా ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.
మావోల వౌనం వెనుక...!
సాధారణంగా మావోయిస్ట్‌లు ఏదైనా విధ్వంసానికి, లేదా హత్యలకు, దాడులకు పాల్పడితే, అందుకు తమదే బాధ్యత అంటూ సంబంధిత దళ ప్రతినిధుల నుంచి లేఖ విడుదలవుతుంది. కానీ ఘటన జరిగి వారం రోజులైనా మావోలు ఎటువంటి ప్రకటన చేయకపోవడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. లివిటిపుట్టు ఘటనను పోలీసులు రాజకీయ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అదే కనుక నిజమైతే, మావోయిస్ట్‌లు లేఖ విడుదల చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే, సాధారణంగా రాజకీయ కుట్రల్లో మావోయిస్ట్‌లు తలదూర్చరు. ఇది వారి సిద్ధాంతాలకు విరుద్ధం. ప్రజాకంటకంగా ఉన్న నేతలను మాత్రమే వారు టార్గెట్ చేస్తుంటారు. మరి కిడారిని ప్రజాకంటక నాయకునిగా వారు ఎక్కడా చిత్రీకరించలేదు. ఒకవేళ జంట హత్యలు రాజకీయ కుట్రలో భాగమే అని పోలీసులు నిర్థారిస్తే, మావోయిస్ట్‌లు సైద్ధాంతికంగా పక్కదారి పట్టినట్టవుతుంది.
దీంతో జంట హత్యలకు మావోయిస్ట్‌లు బలమైన కారణాన్ని చూపించాల్సి వస్తుంది. తామే ఈ జంట హత్యలకు పాల్పడ్డామని మావోలు ప్రకటిస్తే, నిజంగా ఈ హత్యల వెనుక రాజకీయ కుట్ర ఉన్నా, పోలీసులు దాన్ని బహిర్గతం చేయలేరు. దీంతో అటు మావోయిస్ట్‌లు, ఇటు పోలీసులు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా సిట్ జరుపుతున్న దర్యాప్తు రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మిస్టరీని చేధించి మీడియా ముందుంచుతామని పోలీసు వర్గాలు చెపుతున్నాయి.