రాష్ట్రీయం

కాపులను బీసీల్లో చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, డిసెంబర్ 1: కాపులను బీసీల్లో చేరుస్తూ 2016 బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలని మాజీ మంత్రి, కాపురిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండు చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో లేఖను పత్రికలకు విడుదలచేశారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులకు బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానంచేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన తర్వాత కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. కమిషన్ల పేరుతో 15 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూనే ఉన్నారని, ప్రస్తుతం నియమించిన కమిషన్ నివేదిక రావడానికి మరో జన్మ ఎత్తాల్సి ఉంటుందని ముద్రగడ పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాక పూర్వమే బలిజ, ఒంటరి, కాపు, తెలగా కులాలు బిసిలుగా ఉన్నారని, ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నప్పుడు వీరిని ఒసిలుగా చేశారని, దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధికారంలో ఉండగా మళ్లీ బిసిల్లో చేర్చారన్నారు. తర్వాత కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వీరిని బిసిలు చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాలన్నీ జీవోల ద్వారానే జరిగాయని పెద్దలు చెబుతుండడం వల్ల తమకు తెలిసిందన్నారు. గణాంకాలు, సర్వేలు, వెలుగు సర్వేలు, కుల జనాభాలు, ఆస్తిపాస్తుల వివరాలు సేకరించారని, తెల్లకార్డుల వివరాలు ప్రభుత్వం వద్దనే ఉంటాయని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నెల రోజులలో కాపులను బిసిలలో చేర్చవచ్చునన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయడానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే మద్దతిస్తామని వైసిపి శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఇప్పటికే ప్రకటించారన్నారు. ఆ తర్వాత కేంద్రానికి పంపించి తొమ్మిదవ షెడ్యూలులో చేర్చే కార్యక్రమం చేపట్టడానికి కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కార్యక్రమాలు సజావుగా సాగడానికి ఆటంకాలు లేవన్నారు. ఇన్ని అవకాశాలు ఉంటే ఏవేవో సాకులు చూపుతున్నారని, అసలు మీకు చిత్తశుద్ధి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలపై దృష్టిపెట్టాలని లేకుంటే జనవరి 31వ తేదీన తునిలో జరిగే సభలో కార్యాచరణ సిద్ధమవుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. తాముచేసే ఉద్యమం రాజ్యాధికారం కోసం కాదని, కాపుల్లోని అత్యంత పేదవారి కోసమని ముద్రగడ స్పష్టంచేశారు. గిరిజన, హరిజన, వెనుకబడిన తరగతులు అనుభవించే కోటా కాకుండా మిగిలిన దాంట్లోనే తమకు ఇవ్వమని అడుగుతున్నామని, ఎదుటివారి నోటి వద్ద అన్నం తీసేయమని చెప్పేంత మూర్ఖులం కాదన్నారు. తనపై దుష్ప్రచారాలు మానుకోవాలని, తాను ఎవరి అండతోనో టిడిపిలో చేరడానికి చేస్తున్న ప్రయత్నమని ఆయన చెప్పిస్తున్నారని, తనకు ఆ ఖర్మ పట్టలేదన్నారు. తాను రాజకీయ నిరుద్యోగినని, రాజకీయాలకు పనికిరానని ప్రజలు శాశ్వతంగా తీర్పు ఇచ్చారని ముద్రగడ పేర్కొన్నారు.

నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల 2కె వాక్
నరసరావుపేట, డిసెంబర్ 1: మున్సిపల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం పట్టణంలో ఉదయం 2కే వాక్‌ను ఐటీ, సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. పల్నాడు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల నుండి సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణం వరకు ఈ వాక్ కొనసాగింది. మధ్యలో శివుని బొమ్మ వద్ద మంత్రి రఘునాథరెడ్డి, స్పీకర్ కోడెల పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించారు. సుమారు ఐదువేల మంది విద్యార్థులు, పట్టణ ప్రజలు, అభిమానులు ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ సియంఈ గంగాధర్ కుమారుడు వై విశాల్ స్కేటింగ్ చేస్తూ వాక్‌లో పాల్గొన్నారు. విశాల్‌ను అతిథులు అభినందించారు. అనంతరం స్టేడియంలో జరిగిన సభలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ మున్సిపల్ శతాబ్ది ఉత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయన్నారు. నరసరావుపేట అభివృద్ధికి అధికారులందరూ సహకరిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలన్నారు. మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట మున్సిపల్ శతాబ్ది ఉత్సవాలు రావడం, దానిని నిర్వహిండం అరుదైన విషయమన్నారు. స్పీకర్ కోడెల చూపిన మార్గంలో మనందరం పయనించాలన్నారు. దేశం మొత్తం నరసరావుపేట, సత్తెనపల్లి వైపు చూస్తోందన్నారు. ఇది ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. నెలలోని ఒకటి లేదా రెండో శనివారం పాఠశాలల్లో శుభ్రతను పాటించే విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి పల్లె పిలుపునిచ్చారు. ఈ 2కే వాక్‌లో కోడెల శివరామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, కమిషనర్ భానూప్రతాప్, డిఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు తిరుమలలో ధార్మిక సదస్సు
తిరుమల, డిసెంబర్ 1: ప్రపంచంలోనే అత్యంత సనాతనమైన హైందవ ధర్మానికి, దశ, దిశ నిర్దేశించేందుకు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలతో ధార్మిక సదస్సు వైభవంగా జరుగనుంది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీ ఉదయం తిరుమల్లోని ఆస్థాన మండపంలో జరగనుంది. మూడోసారి జరుగుతున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9.30 నుంచి 9.40 గంటల వరకు పూజ్యస్వామీజీల శుభాగమనం, 9.40 గంటలకు టిటిటి వేదస్వస్తి, 9.45 నుంచి 10.05 గంటల వరకు టిటిడి ఇ ఒ డాక్టర్ డి సాంబశివరావు స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముందుగా సందేశాన్ని ఇస్తారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి మాణిక్యాలరావు సందేశంతో సదస్సు ప్రారంభమవుతుంది. అనంతరం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అధ్యక్షులు పివిఆర్‌కె ప్రసాద్ ధార్మిక సదస్సు నేపథ్యం, చర్చనీయాంశాలను సదస్సుకు వివరిస్తారు. అనంతరం ఉదయం 10.05 నుంచి 12.15 గంటల వరకు హైందవ ధర్మ పరిరక్షణకు పీఠాధిపతులు, మఠాధిపతులు ధార్మిక సందేశాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 గంటల వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ ఉదయం సభ ముగింపు సందేశం ఇస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 5.50 గంటల వరకు వివిధ ధార్మిక అంశాలను చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సాయంత్రం 5.50 నుంచి 6 గంటల వరకు దేవాదాయశాఖ కమిషనర్ వై వి అనురాధ సదస్సు ప్రతిస్పందననను వివరిస్తారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు పూజ్య స్వామీజీల తీర్మానాల ప్రతిపాదనలు ఆమోదంతో ధార్మిక సదస్సు ముగుస్తుంది.
మల్టీ కో ఆపరేటివ్ బ్యాంక్‌గా డిసిసిబి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 1: ఖమ్మం డిసిసిబిని మల్టీ కో ఆపరేటివ్ బ్యాంక్‌గా రిజిస్ట్రేషన్ చేసి ముంపు మండలాల ప్రజలకు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజలకు సహకారం అందించేందుకు సహకార బ్యాంక్‌లు ఏర్పాటు చేశారని, ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కలుపుకున్న 7 మండలాల ప్రజలకు ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. ముంపు పేరుతో ఏడు మండలాలను తెలంగాణ నుంచి విడగొట్టడంతో అక్కడి రైతులకు, ప్రజలకు ఏపి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించడంలేదని, దీంతో వారు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిన ఏడు మండలాలకు సంబంధించిన సొసైటీల తాలూకు 20 కోట్ల డిపాజిట్లు, 6 కోట్ల రుణాలు ప్రజలకు, రైతులకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే ఆయా జిల్లాల సహకార బ్యాంక్‌ల చైర్మన్లు లావాదేవీలను తీసుకొని రైతులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో ఖమ్మం డిసిసిబిని మల్టీ కోఆపరేటివ్ బ్యాంక్‌గా రిజిస్ట్రేషన్ చేయించి ఆ ఏడు మండలాల్లో బ్యాంక్ కార్యాకలాపాలను నడిపిస్తామన్నారు.
ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై ఫిర్యాదులు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 1: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ శాసన సభ్యుడు బాణోత్ మదన్‌లాల్‌పై వామపక్ష పార్టీలు మంగళవారం ఫిర్యాదులు చేశాయి. రెండురోజుల క్రితం కొణిజర్ల-2 ఎంపిటిసి నాగలక్ష్మి భర్త సత్యనారాయణను అధికార పార్టీకి మద్దతివ్వాలంటూ బెదిరించారని వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను రికార్డు చేసి వాటిని సిడిల రూపంలో తయారు చేసి కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లోనూ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వామపక్ష పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. శాసన మండలి ఎన్నికల్లో మద్దతివ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరించారని, ఫోన్ ద్వారా వచ్చిన ఈ విషయాన్ని రికార్డు చేసి అందించారు. మదన్‌లాల్‌పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుండగా ఆ సమయానికే ఈ వివాదం రావడం అధికార పార్టీకి ఇబ్బందిని కలిగిస్తోంది.
ఏసిబికి చిక్కిన కాంట్రాక్టు ఉద్యోగి
నంద్యాల, డిసెంబర్ 1: ఇంటి నిర్మాణం అనుమతి దరఖాస్తును పై అధికారులకు పంపేందుకు రూ.5 వేలు లంచం తీసుకున్న నంద్యాల మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగి కమాల్‌బాషాను ఎసిబి అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విజయపురి కాలనీకి చెందిన విక్టర్ భవన నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేస్తుకున్నాడు. దీన్ని పై అధికారులకు పంపేందుకు నంద్యాల పురపాలక సంఘం టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కమాల్‌బాషా రూ.5వేలు లంచం అడిగాడు. దీంతో విక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు మంగళవారం విక్టర్ కాంట్రాక్టు ఉద్యోగి కమాల్‌బాషాకు రూ.5 వేలు ఇస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎసిబి డిఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు.
కల్తీ నెయ్యి వ్యాపారులను శిక్షించాలి
తిరుమల, డిసెంబర్ 1: స్వచ్ఛమైన నెయ్యిని కల్తీచేసి విక్రయిస్తున్నవారిని ఉగ్రవాదులతో సమానంగా శిక్షించాలని రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. తిరుమలలో బుధవారం జరుగనున్న ధార్మిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ నెయ్యిని కల్తీచేసి విక్రయిస్తున్నవారు తీవ్రవాదులుకన్నా అత్యంత ప్రమాదకరమైనవారన్నారు. తీవ్ర వాదులకు విధించే శిక్షకన్నా వీరికి అత్యంత కఠినమైన శిక్షలను విధించాలన్నారు. ఇందుకోసం చట్టాల్లో మార్పులు చేసేందుకు సి ఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలాడే వీరు దేవుని ప్రసాదాలను కూడా కల్తీ చేసేందుకు ప్రయత్నించారన్నారు. టిటిడి లాంటి గొప్ప ధార్మిక సంస్థకు కల్తీనెయ్యిని సరఫరా చేసేందుకు గతంలో ప్రయత్నించారని అయితే టిటిడి వాటిని పరీక్షచేసి నిరాకరించిందన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని పలు దేవాలయాలకు టిటిడికి ఉన్న ల్యాబ్ సౌకర్యం లేనందున ఆయా ఆలయాలకు కల్తీనెయ్యి సరఫరా జరిగివుండవచ్చని అన్నారు. ఇకపై రాష్ట్రంలో ఇటువంటి కల్తీ వ్యాపారాలను ఉపేక్షించేది లేదని పటిష్టమైన చట్టాలను రూపొందించి కల్తీ వ్యాపారులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.