రాష్ట్రీయం

జనసేనదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 15: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుపై దృష్టిసారిస్తామన్నారు. సీపీఎస్ రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానంచేసి, కేంద్రానికి పంపిస్తామన్నారు. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించే అసంఘటిత రంగానికి చెందిన చిరువ్యాపారులు తదితరులకు భరోసా కల్పిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో కవాతు అనంతరం నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పెన్షన్ అనేది ఉద్యోగులకు వృద్ధాప్యంలో జీవనానికి భరోసానిస్తుందని, అలాంటి పెన్షన్ పథకాన్ని జూదంలా మార్చేయడం దారుణమన్నారు. అధికారంలోకి రాగానే ఐదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో భరోసాయిచ్చిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఆ హామీ గాలికొదిలేశారన్నారు. కనీసం అసంఘటిత రంగ కార్మికులకు కూడా భరోసా కల్పించలేకపోయారన్నారు.
ఎక్కడైనా తండ్రి వారసత్వం అంటే రూపురేఖలు, డిఎన్‌ఏ, ఆస్తిపాస్తులు మాత్రమే లభిస్తాయని, దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో తండ్రి నుండి ముఖ్యమంత్రి పదవి కూడా వారసత్వంగా కోరుకుంటున్నారని లోకేష్, జగన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాత, తండ్రి ముఖ్యమంత్రి అయినందుకే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నపుడు, ఓ సాధారణ గ్రామ మున్సబు మునిమనవడు, ఓ పోస్టుమేన్ మనుమడు, ఓ కానిస్టేబుల్ తనయుడైన తాను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో బేషరతుగా జనసేన మద్దతు తీసుకున్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం తాను సినిమా
నటుడినని, రాజకీయానుభవం లేదని వ్యాఖ్యానిస్తున్నారని, మరి కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీచేయని ఆయన కుమారుడు లోకేష్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి ఎలా కట్టబెట్టారని నిలదీశారు. తనకు దశాబ్ద కాలంగా రాజకీయానుభవం ఉందని, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న అనుభవం ఉందన్నారు. తన వద్ద వేల కోట్లు లేవని, తన తాతలు గనుల వ్యాపారం చేయలేదన్నారు. తన తండ్రి విలువలు నేర్పించారని, వాటితోనే ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేయడం అలవాటయ్యిందన్నారు. రాష్టమ్రంతా తిరిగి అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటున్నానని, పోలవరం నిర్వాసితులకు, కాకినాడ ఎస్‌ఈజడ్ బాధితులకు అండగా ఉంటానన్నారు.
కోర్టు చివాట్లు లేకుండా రాష్ట్రంలో తక్షణం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని డిమాండ్‌చేశారు. సర్పంచ్‌లు చేయాల్సిన పనులు కూడా చంద్రబాబునాయుడు చేస్తానంటే ఎలాఅని ఎద్దేవాచేశారు. అధికార టీడీపీకి పంచాయతీ ఎన్నికలు జరిపే ధైర్యం లేదని, ప్రతిపక్ష వైసీపీకి ఎన్నికలు అడిగే ధైర్యం లేదన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల పంచాయతీలకు దక్కాల్సిన రూ 3.6 లక్షల కోట్ల కేంద్ర నిధులు వెనక్కిపోతున్నాయన్నారు. నారా లోకేష్ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, పంచాయతీల గురించి తెలియని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడం సిగ్గు చేటన్నారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించకుండా పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలం బూరుగుపూడి సర్పంచ్ సూర్యచంద్ర చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని చెపితే, ఆ కానె్సప్ట్‌ను చంద్రబాబు అమెరికాకు అమ్మేసుకున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు గూండాగురి కమిటీలుగా తయారయ్యాయని పవన్ ఆరోపించారు. దోపిడి వ్యవస్థలుగా మారిపోయారని, వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. జనసేన భావజాలం నచ్చి ఎంతో నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం వంటి ఎంతో మంది పార్టీలోకి వస్తున్నారన్నారు. వేటకొడవళ్లు, గండ్రగొడ్డళ్లతో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే గోదావరి జిల్లాలు చూస్తూ ఊరుకోవన్నారు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ప్రజా ఉద్యమంతో నలిపేస్తామన్నారు. అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, ఒక చెగువేరా, ఒక చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తిగా పనిచేస్తున్నామన్నారు.

చట్టాలను సంరక్షించలేని సీ ఎం ఎందుకు..!
అధికార పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వనజాక్షి అనే తహసీల్దార్‌పై దౌర్జన్యం చేస్తే చర్యలు తీసుకోలేని సీఎం ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆ ఘటన జరిగినపుడే ఎమ్మెల్యేపై రౌడీషీటర్ తెరచి, కఠినచర్యలు తీసుకుంటే మరిన్ని ఘటనలు జరిగివుండేవి కాదన్నారు.
బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ అని భాష్యం చెప్పిన ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో బీజేపీ పెట్టిన పాచిపోయిన లడ్డూలను మైక్రో ఓవెన్‌లో వేడిచేసుకుని తినలేదా అని ఎద్దేవాచేశారు. బీజేపీకి, ప్రధానికి తాను ఏనాడూ వత్తాసు పలకలేదన్నారు. సొంత అన్నయ్యనే వదులుకుని వచ్చిన తాను మోదీని ప్రధానిగా మాత్రమే గౌరవిస్తానన్నారు. ప్రత్యేక హోదా గురించి కనీసం ఎపుడూ ముఖ్యమంత్రి ప్రధాని వద్దకు వెల్ధామని అడగలేదని, ఒక వేళ అలా వెళితే జనసేనకు పేరొస్తుందేమోననే భయం ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీ తీసుకెళితే అక్కడే తేల్చుకోవచ్చన్నారు.
పెట్టుబడులకు తాము వ్యతిరేకం కాదని, మానవీయ కోణంలో పెట్టుబడులు రావాలని కోరుతున్నామన్నారు. 2012లో విపక్షనేతగా కాకినాడ ఎస్‌ఈజడ్‌జడ్‌లో ఏరువాక చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కన్నీళ్లను పట్టించుకోవడంలేదన్నారు.
ఇతర కులాలకు నష్టం జరగకుండా అవసరమైతే బీసీల రిజర్వేషన్లు పెంచి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రిజర్వేషన్లకు 9వ షెడ్యూల్‌లో పెట్టాలని పవన్ స్పష్టం చేశారు. తనది అన్ని కులాలను గౌరవించే తత్వమని పేర్కొన్నారు.
షెడ్డు కూలి పలువురికి గాయాలు
జనసేన కవాతు కార్యక్రమంలో అభిమానుల అత్యుత్సాహం స్వల్ప ప్రమాదానికి కారణమైంది. పవన్‌కళ్యాణ్‌ను దగ్గరగా వీక్షించాలనే ఆతృతతో పలువురు సభావేదిక ఎదురుగా ఉన్న పాత ఇరిగేషన్ రేకుల షెడ్డుపైకి ఎక్కడంతో షెడ్డు ఒక్కసారిగా ఒరిగిపోయింది. దీనితో 10మంది వరకూ స్వల్పంగా గాయపడ్డారు.
చిత్రం..కవాతులో భాగంగా వాహనంపై జాతీయ జెండాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్