రాష్ట్రీయం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 17: కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపిన టాటాఏస్ వాహనాన్ని ఢీకొన్న లారీ అక్కడే నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరంతా కర్నూలు నగరవాసులు. దర్గాలో పిల్లల పుట్టెంట్రుకలు తీసేందుకు వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఆలూరు మండలం పెద్దహోత్తూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో షేక్‌ఖాజా, ఫాతిమా, షేక్‌హుసేన్, షేక్‌ఆసీఫ్, షేక్‌ఆస్రా, షేక్‌మోహన్ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం- కర్నూలు నగరంలోని మాతబిస్తిగడ్డ వీధికి చెందిన షేక్‌ఖాజా తన కుటుంబ సభ్యులతో కలిసి హొళగుంద మండలంలోని ఎల్లార్తి దర్గాలో పిల్లలకు పుట్టెంట్రుకలు తీసేందుకు టాటాఏస్ వాహనంలో మంగళవారం రాత్రి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మధ్యలో రెండుసార్లు మరమ్మతులకు గురైంది. బుధవారం తెల్లవారుజామున ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామ సమీపంలోకి రాగానే మరోసారి నిలిచిపోయింది. దీంతో కర్నూలులోని బంధువులకు ఫోన్ చేసి మరో వాహనం తీసుకురావాలని చెప్పారు. వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపి అందులో కొంతమంది నిద్రపోయారు. మరో ఆరుగురు రోడ్డు పక్కనే నిద్రించారు. తెల్లవారుజామున అదే మార్గంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి టాటాఏస్ వాహనాన్ని ఢీకొని రోడ్డుపక్కగా నిద్రిస్తున్న వారిపైనుంచి దూసుకెళ్లింది. దీంతో సంఘటనాస్థలంలోనే షేక్‌ఖాజ (24), ఫాతిమా (26), షేక్ ఉసేన్ (23), షేక్ ఆసీఫ్ (17), షేక్ హస్రా (9), షేక్‌మోహక్ (7) మృతి చెందారు. వాహనంలో నిద్రిస్తున్న 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సంఘటనాస్థలాన్ని కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టి సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ప్రమాదంపై ముఖ్యమంత్రి, జగన్ దిగ్భ్రాంతి
విజయవాడ: పెద్దహూతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. గాయాలపాలైన వారికి తక్షణం వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మృతుల్లో చంద్రన్న బీమా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తారని తెలిపారు. బీమా లేని వారికి మూడు లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తారు. పిల్లలకు 2 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. ప్రమాదంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్న ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.