రాష్ట్రీయం

దండకారణ్యంలో మావోల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: దండకారణ్యంలోకి మావోలు ప్రవేశించారా.. ఏఏ దళాలు ఎక్కడ నుంచి ఆరుబయలు ప్రదేశాలకు చేరుకుంటున్నాయి..వంటి ప్రశ్నలు తలెత్తడంతో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈక్రమంలో ఆదివారం ఇరు తెలుగు రాష్ట్రాల డీజీపీలు మావోల కదలికలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసు బాస్‌లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న అంశాలపై పోలీస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎదైనా పక్కా సమాచారం ఉంటేతప్ప డీజీపీ స్థాయిలో సమీక్షలు జరగవని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపి పక్షాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోతున్న దృష్ట్యా బందోబస్తు పర్యవేక్షణ ఎలా ఉండాలన్న అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు వ్యూహరచన చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి సోనియాగాంధీ సైతం రానున్నారు. అయితే ఇంకా పర్యటన తేదీలు ఖరారు కాలేదు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇక వివిథ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు సైతం ప్రచారానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో ప్రముఖ నేతలకు భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అధికార, విపక్ష పార్టీల నాయకులు కేంద్ర నేతల్ని కలుసుకునే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు పోలీసులు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించారు. పరిమిత సంఖ్యలో పేర్లు ఇవ్వాలని, ప్రచార వేదికకు సమీపాన సీనియర్ పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, నేతలు వచ్చేపోయే సమయంలో సభాప్రాంగణం వరకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇలావుండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోల చర్యలను అడ్డుకోవడానికి కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోఇస్టులు పత్రికా ప్రకటనలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోలు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడైనా మావోలు గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇటెలిజెన్స్ వర్గాలు సూచించడంతో పోలీస్ బలగాలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పోలీస్‌లు ఏమాత్రం ఆదమరిచినా మావోలు రెచ్చిపోతారని, ఎప్పుడైనా వారిని పోలీస్ బలగాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. దండకారణ్యానికి సరిహద్దులుగా ఉన్న భూపాల్‌పల్లి, ఛత్తీస్‌గఢ్, భద్రాది, కొత్తగూడెంతో పాటు ఏపీలో ఉన్న తూర్పు, పడమర ప్రాంత జిల్లాల్లో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి, అటవీ ప్రాంతల్లో ఉన్న రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. సైకిళ్లను సైతం తనిఖీ చేస్తూ చెక్‌పోస్టుల వద్ద పోలీస్ గస్తీలను పెంచుతున్నారు. పోలీస్ స్పెషల్ పార్టీ, ఆపరేషన్ బృందాలతో పాటు జిల్లాల ఎస్పీలు ప్రత్యేక సమన్వయంతో పనిచేయాలని, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పటిష్ట చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఏజెన్సీలో పర్యటించే తాజా మాజీ ఎమ్మెల్యేలు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒడిశాలో మావోల అలజడి కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. మావోయిస్టు అగ్ర నేతలు ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తలదాచుకున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.