రాష్ట్రీయం

జెట్ స్పీడ్‌లో పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 22: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కీలకదశకు చేరుకున్నామని, ఇకనుంచి పనులు పరుగులు తీయించి, వచ్చే మే నాటికి గ్రావిటీ ద్వారా నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సోమవారం ఆయన సందర్శించారు. స్పిల్‌వే ప్రాంతంలో 26వ బ్లాక్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రాజెక్టు పనుల్లో 59 శాతానికి పైగా ప్రగతి సాధించామని, జూన్ వరకు వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నందున సమయం వృథా చేయకుండా పనులను ఏకబిగిన ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనుల్లో నవయుగ, త్రివేణి సంస్థలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నాయన్నారు. సంస్థల అధిపతులు డబ్బుకోసం కాకుండా రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశ్యంతో పనుల్లో భాగస్వాములయ్యారన్నారు.
ప్రాజెక్టు నిర్మాణం వల్ల దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగు, తాగునీటి కొరత పరిష్కారమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి రాష్ట్రంలో దాదాపు 40 శాతానికి పైగా తక్కువ వర్షపాతం నమోదు అయినా పట్టిసీమ నిర్మాణం, ఇతర ముందుజాగ్రత్త చర్యల వల్ల దాదాపుగా అన్ని జిల్లాలు సాగు, తాగునీటి కొరత లేకుండా ముందుకెళ్లాయన్నారు.
మొత్తంగా రాష్ట్రాన్ని చూస్తే స్మార్ట్ వాటర్‌గ్రిడ్‌ను రూపొందించాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 61 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగా, 18 పూర్తయ్యాయని, మరో ఏడు ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 20 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని, మిగిలినవి టెండరు దశలో ఉన్నాయన్నారు. ఇప్పటికే స్మార్ట్ వాటర్‌గ్రిడ్‌లో భాగంగా రాష్ట్రంలో పడిన వర్షాన్ని భూగర్భజలంగా మార్చుకోవటం, ఆ తర్వాత భూగర్భానే్న పెద్ద జలాశయంగా వినియోగించుకోవటం ఉద్దేశ్యాలుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని సాధించినందున, పెన్నాసహా మిగిలిన నదులన్నింటిని అనుసంధానించి మహాసంగమం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఆ విధంగా పోలవరంతో మొత్తం రాష్ట్రానికి మేలు జరుగుతుండగా, మహాసంగమం, స్మార్ట్‌వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాల
ద్వారా ఏ జిల్లాలోనూ సాగు, తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశమే ఉండదన్నారు. దేశానికే ధాన్యాగారంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 32లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అమలుజరుగుతోందని, దీన్ని కోటి ఎకరాలకు పెంచటం ద్వారా రైతులకు నీటి భద్రత, తాగునీటి సౌకర్యం, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు.
పోలవరానికి సంబంధించి దాదాపుగా అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు సాగుతున్నాయని, ఇకనుంచి ఈ ఒత్తిడిని మరింత పెంచనున్నానని, వచ్చే మే నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించటమే లక్ష్యంగా అన్ని ఏజన్సీలు పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయితే ప్రాజెక్టు దాదాపుగా చేతికందివచ్చినట్లేనని, ఇప్పటికే 45 గేట్లు పోలవరం ప్రాజెక్టుకు అవసరంకాగా వాటిలో 27 గేట్లకు సీడబ్ల్యూసీ అనుమతి లభించిందని, మిగిలిన 18 గేట్లకు అనుమతులు ఆమోద దశలో ఉన్నాయన్నారు. డిసెంబర్ నాటికి గేట్ల పనులను పూర్తిచేస్తామని చంద్రబాబు చెప్పారు.
ఇక ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం వంటివి పారదర్శకంగా, చురుగ్గా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పునరావాస కాలనీల విషయంలో ఆధునిక టెక్నాలజీని మేళవించి నిర్వాసితుల అభిరుచులకు అనుగుణంగా- వాస్తు, ఇతర అంశాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయన్నారు. కాలనీల నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అయితే కొన్నిచోట్ల విమర్శలు వస్తున్నాయన్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు పనులన్నీ పారదర్శకంగానే ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశాలు ఇచ్చామని, కొంతమంది వివాదాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. తిత్లీ తుపాను సహాయం విషయంలోనూ తన ముందే కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్లాలని స్పష్టంగా ఉన్నందున వారి ఆటలు చెల్లలేదన్నారు.
తిత్లీ తుపానుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ పునరావాస కార్యక్రమాల్లో సోమవారం సాయంత్రానికి 35వేల కరెంటు పోల్స్‌ను నిలబెట్టే పని పూర్తవుతుందని, సుమారు పదివేల మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. ఈ నెల 29వ తేదీకల్లా సహాయక కార్యక్రమాలన్నింటిని పూర్తి చేయాలన్న లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. పరిహారానికి సంబంధించి కూడా ఎవరెవరి ఖాతాల్లో ఎంతమేరకు జమచేయాలి అన్ని అంశాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. పొలాల్లో విరిగిన చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే భుజాన వేసుకుందని, దీనికి స్థానిక రైతులకు పది రూపాయలు లాభం వచ్చేలా పవర్‌సా వంటివి అందించి, వారే వాటిని తొలగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..పోలవరం పనులు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని