రాష్ట్రీయం

దేశాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సి ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించగా, లౌకికవాద శక్తులు ఏకం కావాలని కుమార స్వామి అభిప్రాయపడ్డారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణలో భాగంగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని కలిసి సంచలనం సృష్టించిన చంద్రబాబు, బెంగళూరులోని మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమార స్వామితో గురువారం భేటీ అయ్యారు. పద్మనాభ నగర్‌లో దేవెగౌడ నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు కుమార స్వామి, దేవెగౌడ ఘనస్వాగతం పలికారు. వీరు దాదాపు 40 నిమిషాల సేపు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం వీరు ముగ్గురు కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలోని వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపైనే తమ పోరాటమని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రారంభమైన బీజేపీ వ్యతిరేక పోరాటానికి దేవెగౌడ ఆశీస్సులు, మద్దతు కోసం వచ్చానని వెల్లడించారు. యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయం నుంచి తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ప్రతిపక్షాలపై దాడులకు ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలూ ధ్వంసం చేసిన కేంద్రం, రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపునకు దిగిందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాగానే తమను వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. దేశంలోని అత్యున్నత సంస్థ అయిన ఆర్బీఐని కూడా నాశనం చేసిన ఘనత మోదీదేనని దెప్పిపొడిచారు. ఆర్బీఐ గవర్నర్ వ్యవహారమే దేశంలోని వ్యవస్థలపై బీజేపీ చేస్తున్న దాడికి నిదర్శనమన్నారు. రాఫెల్ కుంభకోణంపై ఇంతవరకూ మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు జరిగి నేటికి రెండేళ్లు పూర్తి అయినా, ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపించారు. రద్దు సరిగా చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. దేశంలో అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని అన్నారు. ధరలు పెరిగి సామాన్యుల జీవనం ఇబ్బందిగా మారిందని, మైనారిటీల్లో అభద్రతా భావం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరూ కలిసి ముందుకు వెళ్తామన్నారు. కూటమి ఏర్పాటుకు
ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని, అందరినీ ఒక వేదికపైకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బీఎప్సీ అధినేత మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో చర్చలు జరిపామన్నారు. ప్రధాని అభ్యర్థిని అందరితో చర్చించిన తరువాతే నిర్ణయిస్తామని ప్రకటించారు. ఇప్పటికే దేశంలోని ముఖ్యనేతలను కలుసుకున్నానని, శుక్రవారం తమిళనాడు వెళ్లి, అక్కడి ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను కూడా కలిసి తాజా పరిస్థితులపై వివరిస్తానని వెల్లడించారు.
రాబోయే 2019 ఎన్నికల్లో బీజేపీ రహిత దేశమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నాలుగున్నర ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని గుర్తుచేశారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు అందరూ కలవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. దీనికోసమే ప్రస్తుతం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను రక్షించేందుకు చంద్రబాబు లాంటి వ్యక్తి చొరవ తీసుకోవడం హర్షణీయమన్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చాలా బాధ్యత ఉందని, రాహుల్ గాంధీ అందరితో కలిసి ముందుకెళ్లడం సంతోషించదగ్గ విషయమన్నారు. సెక్యులర్ పార్టీలను బలోపేతం చేయడానికి, దేశాన్ని రక్షించడానికి అందరం కలిసి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు: కుమార స్వామి
ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుపెట్టిన తరువాత జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని కర్నాటక సీఎం కుమార స్వామి తెలిపారు. 2019 ఎన్నికల మీద ప్రస్తుతం తమ మధ్య చర్చ జరిగిందన్నారు. 1996నాటి ఘటనలు పునరావృతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడానికి అందరం కలిసి పని చేస్తామని, ఇందుకు ఏపీ సీఎంతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ, జేడీఎస్ పాతమిత్రులేనని వ్యాఖ్యానించారు.
చిత్రం..బెంగళూరులో గురువారం మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. చిత్రంలో కర్నాటక సీఎం కుమారస్వామి తదితరులు