రాష్ట్రీయం

ఆసక్తి రేపుతున్న ఆదిలాబాద్ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 8: పార్టీలను కాదని అభ్యర్థులకే ప్రాధాన్యతనిచ్చే ఆదిలాబాద్ ఓటర్ల విలక్షణ తీర్పు ఈసారి ఉత్కంఠత రేపుతోంది. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థి, అపద్ధర్మ మంత్రి జోగురామన్నకు ఈ ఎన్నికలు సవాళ్ళను రేపుతున్నాయి. నాలుగున్నరేళ్ళలో ఆశించిన అభివృద్ధి సాధించలేదని, సాగునీటి పథకాలు, పరిశ్రమల పునరుద్దరణ, రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రచార అస్త్రాలుగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసి సామాజిక ఓట్లు అభ్యర్థుల గెలుపుకు కీలకం కావడం, కుల సమీకరణలు ప్రభావితం చేసే అంశాలు కావడంతో కాంగ్రెస్, టీ ఆర్ ఎస్, బిజెపి ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అంతర్గత మంతనాలు, సమావేశాలతో ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత పేరు ఖరారైందనే ప్రచారం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. ముఖ్యంగా మహిళా ఓట్లు అధికంగా ఉండడం, సానుభూతి ఓట్లు కూడా కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి ఈసారి ఎలాగైనా టికెట్ సాధించుకునేందుకు ఢిల్లీలో మకాం వేసినా అధిష్ఠానం సుజాత వైపు మొగ్గుచూపడంతో రాంచంద్రారెడ్డి వర్గీయుల మద్దతుపై ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో జోగురామన్నకు గట్టిపోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచిన బిజెపి అభ్యర్థి పాయల శంకర్ ఈసారి హిందూ సంప్రదాయ ఓటు బ్యాంకుపైనే గురిపెట్టి వ్యూహాత్మక ప్రచారంతో దూసుకువెళ్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులను ఆదిలాబాద్‌కు రప్పించి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాలతో క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. మరోవైపు గతంలో తెలంగాణ సెంటిమెంట్, పట్టణ ఓటర్ల మద్దతుతో 14వేల చిలుకు ఆధిక్యతతో బీజేపీపై విజయం సాధించిన జోగురామన్న ఈసారి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకొని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు కెసిఆర్ పాలనలో వైఫల్యాలు, మంత్రిగా రామన్న హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని నిలదీస్తూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. సీసీ ఐ పరిశ్రమను పునరుద్దరించకపోవడం, రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం, విమానాశ్రయం, సాగునీటి పథకాలు, గిరిజన విశ్వవిద్యాలయం హామీ అటకెక్కడం లాంటి సమస్యలను ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సొంత మండలమైన జైనథ్, ఆదిలాబాద్, బేల మండలాల్లో మంత్రి రామన్నను అడ్డుకొని ప్రజలు వెనక్కిపంపిన సంఘటనలు తెరాసకు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలు, బీసీ సామాజిక కూర్పు నేపథ్యంలో గండ్రత్ సుజాతకే టికెట్ దక్కడం ఖాయమని ఆమె వర్గీయులు ధీమాతో పక్షం రోజులుగా ప్రచారం ముమ్మరం చేశారు. మహిళా అభ్యర్థిగా రంగంలో ఉంటే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా సుజాత గెలుపొందే అవకాశం ఉంటుందని కార్యకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు.రాంచంద్రారెడ్డి తుది వరకు ఆశలు పెట్టుకొని బిఫాం తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే రాంచంద్రారెడ్డి పార్టీ టికెట్ దక్కకపోతే సుజాతకు మద్దతు ఇస్తారా అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఆదిలాబాద్‌లో స్వతంత్రులకే పట్టం
ఇప్పటి వరకు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఓటర్లు పలు పర్యాయాలు స్వతంత్రులకే పట్టం కట్టి విలక్షణ తీర్పునిచ్చారు. 1952, 1957లో జరిగిన ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులు డి.శంకర్‌రావు, రంగనాథ్‌రావులు విజయం సాధించగా 1962లో స్వతంత్ర అభ్యర్థి విఠల్‌రావు, 1967లో సిపిఐ అభ్యర్థి కస్తాల రాంకిష్టు, 1972లో కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ ఆహ్మాద్ విజయం సాధించారు. 1978లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సి.రాంచంద్రారెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టగా 1983లో స్వతంత్ర అభ్యర్థి సి.వామన్ రెడ్డి, తిరిగి 1985లో స్వతంత్ర అభ్యర్థిగా సి.రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి రాంచంద్రారెడ్డి మరోసారి విజయం సాధించగా 1994లో టీడీపీ నుండి పోటీచేసిన సి.వామన్ రెడ్డి విజయం సాధించారు. 1999లో టిడిపి అభ్యర్థి పడాల భూమన్న గెలుపొందగా, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి సి.రాంచంద్రారెడ్డి నాలుగో సారి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి గెలుపొందిన జోగురామన్న 2012 ఉప ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ మూడోసారి రామన్న హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని క్యాబినెట్ మంత్రిగా ఎదగడం గమనార్హం. ఆదిలాబాద్ రాజకీయ చరిత్రలో నాలుగుసార్లు సి.రాంచంద్రారెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించగా ఈసారి జరుగుతున్న ఎన్నికలు జోగురామన్నకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఆదిలాబాద్ పట్టణ ఓట్లపై ఆశలు పెట్టుకొని బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ ప్రచారం ముమ్మరం చేశారు. గెలుపు ఓటములను నిర్దేశించే బీసీ సామాజిక ఓట్లే కీలకం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కాకా పడుతూ ప్రచారం సాగిస్తున్నాయి.

చిత్రాలు.. జోగురామన్న (టీఆర్‌ఎస్) * గండ్రత్ సుజాత (కాంగ్రెస్) * పాయల శంకర్ (బీజేపీ)