రాష్ట్రీయం

మొత్తం ఓటర్లు 2,73,18,603

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రెండవ విడత ఓటర్ల జాబితా సవరణ ప్రకారం రాష్ట్రంలో 2 కోట్ల 73 లక్షల 18వేల 603 ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ తెలిపారు. గురువారం రాత్రి వరకు 31 జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు తుది జాబితా సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో 9 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సిఈవో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్రంలో కొనసాగుతోన్న ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఓటర్ల జాబితా తెలుపు, బ్యాలెట్ పత్రాన్ని గులాబి రంగులో ముద్రించనున్నట్టు తెలిపారు. గులాబి రంగులో బ్యాలెట్ పత్రాన్ని ముద్రించడం పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఉర్దూ, మరాఠి భాష మాట్లాడే ఓటర్లు ఉండటంతో 16 సెగ్మెంట్లలో ఉర్దూలో, 3 సెగ్మెంట్లలో మారాఠిలో ముద్రించనున్నట్టు తెలిపారు. ఉర్దూలో ముద్రించే సెగ్మెంట్లు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉండగా, మరాఠిలో ముద్రించే సెగ్మెంట్లలో జుక్కల్, బోధ్, ముధోల్ ఉన్నాయని ఆయన వివరించారు. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు విధిగా మూడు పత్రికల్లో, ఒక ఛానల్‌లో తమ అఫిడవిట్లపై ప్రకటన చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఖర్చును ఎన్నికల వ్యయంగా పరిగణిస్తామన్నారు. అభ్యర్థులు మాత్రమే కాకుండా పార్టీలు కూడా విధిగా తమ అభ్యర్థుల జాబితాలో నేరచరిత్ర కలిగిన వారు ఉంటే ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సి సమర్పించాలన్నారు. ఆ ఖర్చును పార్టీల వ్యయంలో చేర్చుతామన్నారు. ప్రతికలలో ప్రచురించిన ప్రకటన క్లిపింగ్‌లను ఎన్నికలు ముగిసాక నెల రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుందన్నారు. నేర చరిత్ర లేని అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదన్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ముందుగానే ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలన్నారు. ప్రజలకు ఇచ్చే హామీలు వాటికి అయ్యే వ్యయం, ఆర్థిక వనరులపై కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సాఫీగా, సంతృప్తిగా జరుగుతోందన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.64 కోట్ల 35 లక్షల 66 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ. 5 కోట్ల 16 లక్షల విలువ చేసే మద్యం పట్డుబడిందన్నారు. రెండవ విడత ఓటర్ల జాబితాలో 17 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చగా అందులో తొలిసారి ఓటు హక్కు పొందిన 18-19 వయసు కలిగిన ఓటర్లు ఐదు లక్షల మంది ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా నుంచి 3 లక్షల 17 వేల మంది చనిపోయిన వారి పేర్లు తొలగించామన్నారు. అలాగే 20 నుంచి 25 వేల ఓటర్ల పేర్లు సాంకేతికంగా రెండేసి, మూడేసి సార్లు పునరావృతం కావడంతో వాటిని కూడా జాబితా నుంచి తొలగించడానికి ఎన్నికల కమిషన్ అనుమతించిందన్నారు. ఓటర్ల జాబితా సవరణ వల్ల మహిళా, పురుష ఓటర్లు దాదాపు సమాన సంఖ్యకు చేరువలో ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో (2014)లో 29,138 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, ఈ ఎన్నికల్లో 32,574 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతానికి కంటే 11.79 పోలింగ్ బూత్‌లు పెరగనున్నాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శాంతియుతంగానే జరుగుతోందని, అయితే 3 చోట్ల జరిగిన ఘర్షణల్లో 16 మంది గాయపడినట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఎన్నికలను సాఫీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 78,384 మందిపై బైండోవర్ చేశామన్నారు. అలాగే 14,730 మందిపై సిఆర్‌పిసి కింద కేసులు నమోదు చేశామన్నారు. తీవ్రవాద ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి పోలీసుశాఖ గట్టి భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 19వ తేదిన ముగుస్తుందన్నారు. 20వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించినట్టు రజత్‌కుమార్ వివరించారు.