రాష్ట్రీయం

11న మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 9: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈనెల 11వ తేదీన ఉదయం 11.45 గంటలకు ఉండవల్లిలో తన నివాసంలో అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించటంతో పాటు గిరిజన వర్గాల తరపున ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. మైనారిటీలలో ఎప్పటి నుంచో మంత్రిపదవిని ఆశిస్తున్న పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న శాసనమండలి చైర్మన్ ఎన్‌ఎండీ ఫరూక్‌కు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రిపదవి ఇస్తే మండలి చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే విషయమై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవటం, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, అనివార్య కారణాల నేపథ్యంలో ఇప్పటి వరకు విస్తరణలో జాప్యం జరిగింది. ఈ సమస్యలన్నీ దాదాపు పరిష్కారం కావటంతో ఇక విస్తరణకు తెరదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో పాటు 26 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహించిన కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయటంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి, దేవదాయశాఖను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ వర్గానికే ప్రాతినిధ్యం కల్పించి విస్తరణ మమ అనిపించాలని ముఖ్యమంత్రి మదిలో మాటగా చెప్తున్నారు. ముస్లిం, మైనారిటీల తరుపున వైసీపీ నుంచి వలస వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు ఫరూక్ పేర్లు తొలుత వినవచ్చాయి. వీరిలో జలీల్‌ఖాన్‌కు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. వలసలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఇకపై వాటికి స్వస్తిచెప్పాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫరూక్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఇదిలా ఉండగా ఎస్టీ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనే డిమాం డ్ కూడా లేకపోలేదు. ఇందులో భాగంగా అరకు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి చోటు ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల మావోయిస్టులు హతమార్చిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశాన్ని అధినేత పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే అరకులో ఉప ఎన్నిక నిర్వహించే వ్యవధిలేదు. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా మంత్రిపదవి కట్టబెట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనే్న అరకు నుంచి పోటీకి నిలిపితే ఎలా ఉంటుందనే విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది. కిడారి కుటుంబ సభ్యులకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించటం ద్వారా ఎస్టీ వర్గాల్లో సానుభూతి కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు ఈనెల 11వ తేదీతో తెరపడనుంది.