రాష్ట్రీయం

మంత్రుల నగరి.. హుజూర్‌నగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 12: ఒకసారి రద్ద.. తిరిగి పునరుద్ధరించబడిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. 1952 నుండి 72 వరకు కొనసాగిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియలో భాగంగా రద్దయ్యంది. 1978నుండి కోదాడ నియోజకవర్గంలో భాగమైన హుజూర్‌నగర్ తిరిగి 2009 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పునరుద్ధరించబడింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు జరుగగా రద్దుకు ముందు మూడుసార్లు కమ్యూనిస్టులు, రెండుసార్లు కాంగ్రెస్, పునరుద్ధరణ పిదప రెండుసార్లు కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. ఈ నియోజకవర్గం నుండి గెలిచిన కాంగ్రెస్ నేతలు అక్కిరాజు వాసుదేవరావు, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు మంత్రి పదవులు నిర్వహించడం నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కిరాజు వాసుదేవరావు కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు మంత్రివర్గాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సమాచార పౌరసంబంధాల మంత్రిగా హైద్రాబాద్‌లో అన్నపూర్ణ, రామకృష్ణ స్టూడియోలకు అక్కిరాజు అనుమతులిచ్చారు. యుద్ధ విమానాల పైలట్‌గా, రాష్టప్రతి భవన్ భద్రతాధికారిగా పనిచేసి రాజీవ్‌గాంధీ చొరవతో రాజకీయాల్లోకి వచ్చిన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
కమ్యూనిస్టుల నుండి కాంగ్రెస్ ఖాతాలోకి..
1952లో పూర్వ హుజూర్‌నగర్ ద్విసభ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి జయసూర్య కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎల్.ఎన్.రావుపై 37,857 ఓట్లతో గెలిచారు. మరో పీడీఎఫ్ అభ్యర్థి టి.నరసింహులు కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రా దేవిపై 30,951 ఓట్లతో గెలిచారు. జయసూర్య ఇదే ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా విజయం సాధించడంతో ఆయన రాజీనామాతో ఇదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా తెలంగాణ సాయుధ పోరాట రత్నం కమ్యూనిస్టు దిగ్గజాల్లో ఒకరైన మక్ధూం మొహినోద్దిన్ పీడీఎఫ్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జి.ఎస్.రెడ్డిపై 10,603ఓట్లతో గెలిచారు. 1957ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థి దొడ్డ నరసయ్య కాంగ్రెస్ అభ్యర్థి వి.బి.రావుపై 5,887ఓట్లతో గెలుపొందగా, 1962ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అక్కిరాజు వాసుదేవరావు సీపీఐ అభ్యర్థి డి.నరసయ్యపై 2,833ఓట్లతో గెలుపొందారు. 1967ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి అక్కిరాజు వాసుదేవరావు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన డి.నరసయ్యపై 2,888ఓట్లతో గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి కీసర జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అక్కిరాజువాసుదేవరావుపై 14,308ఓట్లతో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో హుజూర్‌నగర్ నియోజవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగైపోగా, 1978లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గం నుండి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అక్కిరాజు వాసుదేవరావు కాంగ్రెస్‌ఐ అభ్యర్థి కె.లక్ష్మణ్‌రాజుపై గెలుపొందడం విశేషం.
2009లో జరిగిన పునర్విభజన ప్రక్రియతో హుజూర్‌నగర్ నియోజకవర్గం పునరుద్ధరించబడగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహాకూటమి మద్ధతుతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకంట్ల జగదీష్‌రెడ్డిపై 29,194ఓట్లతో గెలుపొందారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉత్తమ్ పనిచేశారు. 2014ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను అధిగమించి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తల్లియైన టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకరమ్మపై 23,924ఓట్లతో గెలుపొందారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ నియోజకవర్గంలో 1994ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోగా, 1999, 2004ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా 2018ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారధ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఉత్తమ్ మరోసారి హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తుండగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారులో జాప్యం కొనసాగుతుంది.

చిత్రాలు.. మగ్ధుం మొహినోద్దీన్, అక్కిరాజు వాసుదేవరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి