రాష్ట్రీయం

రాజకీయ సన్యాసం చేస్తా......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: ‘డిసెంబర్ 11న టీఆర్‌ఎస్ పార్టీ సొంతంగా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఆ మరుసటి రోజు నుంచే రాజకీయ సన్యాసం చేస్తా...మళ్లీ కనిపించను. నా సవాల్ స్వీకరించే దమ్ము, ధైర్యం ఉత్తమ్‌కానీ ఇంకెవ్వరికైనా ఉందా?’ అని అపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. ‘నా స్థాయికి మంత్రి కావడమే ఎక్కువా. సీఎం కావాలన్న ఆలోచన, దురాశ ఏ కోశాన లేనేలేదు. మరో పదిహేనేళ్ల వరకు కూడా సీఎంగా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నా. అంతకాలం నేను మంత్రి పదవిలో ఉంటే అదృష్టంగా భావిస్తా’నన్నారు. ‘తెలంగాణకు కేసీఆర్‌లాంటి నాయకుడు సీఎంగా ఉండాల్సిన అవసరం ఉంది’ ఆయన ఉద్ఘాటించారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ గురువారం మంత్రి కేటీఆర్‌తో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో తమ నాలుగున్నరేళ్ల పాలనలో సాధించిన విజయాలను ఆయన వివరించారు. అలాగే పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని అయితే రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ తన పరిపాలనా దక్షతను చాటుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారునిగానే కాకుండా మంచి పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అంశంలో కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హుందాగా వ్యవహరించారని పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఓ సందర్భంలో తాను కలిసినప్పుడు ‘ఉద్యమకారులకు పరిపాలనా దక్షత ఉండదు.కానీ కేసీఆర్ మంచి పరిపాలనా దక్షుడిగా కూడా నిరూపించుకున్నా’రని వ్యాఖ్యానించారన్నారు. బీజేపీ తమకేమి మిత్రపక్షం కాదని, అలాగే భాగస్వామ్య పక్షం అంతకంటే కాదని కేటీఆర్ చెప్పారు. అయినప్పటికీ వారు సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన కితాబే తమ పాలనా సమర్థతకు నిదర్శనమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా నడిపించి దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దిన ఖ్యాతి తమకే దక్కిందన్నారు. తెలంగాణకు కేసీఆర్‌లాంటి నాయకుడే సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని, అటువంటి నేత ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ, దురాశ ఏ కోశాన లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మరో 15 ఏళ్ల పాటు కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని, అప్పటి వరకు తాను మంత్రిగా ఉంటే సంతోషమన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్‌లో ఉప ఎన్నికల్లో నిలబడినప్పుడు, తెలంగాణ ఉద్యమమే ప్రశ్నార్థకంగా మారడంతో అప్పుడు తనకు నెలకు నాలుగున్నర, ఐదు లక్షల జీతాన్ని వదులుకుని వచ్చానని వివరించారు. ప్రస్తుతం ఉన్న మంత్రి పదవే తన స్థాయికి ఎక్కువ అనుకుంటున్నానని, అలాంటప్పుడు సీఎం కావాలన్న ఆశే తనకు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ వంటి నేత కాకుండా మరెవ్వరైనా సీఎం కావాలనుకుంటే అంతకంటే వెర్రితనమే లేదన్నారు. పొరపాటున కూడా తనకు అటువంటి ఆశ లేదర్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలవరని, సచివాలయానికి వెళ్లరని విపక్షాలు చేసే విమర్శల్లో పసలేనివన్నారు. ప్రజలు వచ్చి తమ సమస్యలను సీఎంకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే తన దృష్టిలో ఆ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందినట్టేనన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించడం పరిపాలన దక్షుడికి ఉండే లక్షణమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు లేవని, మంచినీళ్ల కోసం జలమండలిని ముట్టడించే దృశ్యాలూ లేవని కేటీఆర్ అన్నారు. అలాగే విద్యుత్, ఎరువుల కోసం రైతన్నల ఆందోళనలు, హైదరాబాద్‌లో కర్ఫ్యూలూ లేవన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండటంతో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు తెలంగాణ దారి పట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందన్న దుష్ప్రచారాన్ని 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసి తిప్పికొట్టగలిగామన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, కోర్టు కేసుల కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య అనేది తీరదన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి కులవృత్తుల పునర్జీవం పోశామన్నారు. కోటి ఎకరాలను సస్యశ్యామం చేసే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఆయన పార్టీ ఏ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పాపాన పోలేదని కేటీఆర్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద నిరసన ప్రదర్శనలు జరక్కుండా చేసిందీ తాము కాదని, స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆ చర్య తీసుకున్నారన్నారు. నిరసనలు లేకుండా చేయాలన్నది తమ అభిమతం కాదన్నారు.