రాష్ట్రీయం

వణికిస్తున్న ‘గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/చిత్తూరు/తిరుపతి/నెల్లూరు, నవంబర్ 15: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘గజ’ తీర ప్రాంతాలను వణికిస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత తీరం దాటనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గజ తుపాను ప్రస్తుతం కరైకాల్‌కు 100 కిమీ, నాగపట్నంకు తూర్పు దిశగా 150 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పంబన్ - కడలూరు మధ్య తుపాను తీరం దాటుతుందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాధారణ వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తీరం వెంబడి ఈశాన్య దిశనుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద సూచికను, మిగిలిన అన్ని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు.
తుఫాన్‌తో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు చిత్తూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబరు 08572-240500కు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. 26 మండలాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారంతో విజయపురం, తొట్టంబేడు, బి ఎన్ కండిగ, కెవిబి పురం, సత్యవేడు, వరదయ్యపాళ్యం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తిరుపతి రూరల్, అర్బన్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, నారాయనవనం, కార్వేటినగరం, పుత్తూరు, నిండ్ర, నాగలాపురం, పిచ్చాటూరు, నగరి, ఎస్ ఆర్ పురం, గంగాధరనెల్లూరు, పాలసముద్రం, చిత్తూరు, గుడిపాల మండలాల్లోని అన్ని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. శుక్రవారం జరిగే వివిధ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తిరుపతిలో అధికారులతో కలెక్టర్ సమీక్ష
తుఫాన్‌ను ఎదుర్కోడానికి తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లాకలెక్టర్ సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం ఉండనున్న మండలాల్లో అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. గ్రామాలలో సంబంధిత విఆర్వో, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు బసచేయాలని ఆదేశించామన్నారు. ఈ మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారి, తాహశీల్దార్, ఎంపీడీఓ, విద్యుత్ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, తాగునీటి శాఖ ఏఈ, ఇరిగేషన్, ఏఈ, పీహెచ్‌సీ డాక్టర్, పశువుల డాక్టర్ తదితర అన్నిశాఖల అధికారులను శనివారం వారివారి మండల కేంద్రాల్లో 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించామనారు.
నెల్లూరు జిల్లాలో అంతంతమాత్రం
తమిళనాడు సరిహద్దున ఉన్న నెల్లూరు జిల్లాలో గజ తుఫాన్ ప్రభావం అంతంతమాత్రంగా ఉంది. జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే వర్షాలు పడుతూ మరికొన్నిచోట్ల ఎండ కాస్తోంది. వర్షాలు పడుతున్నచోట కూడా కొద్దిసేపు వర్షం తిరిగి ఎండ మళ్లీ కాసేపు వర్షం.. జిల్లాలో గత 36 గంటల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. వాతావరణం మాత్రం చల్లగా ఆహ్లాదకరంగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. తీరప్రాంతాల్లో కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, మర్రిపాడు, కలిగిరి, వింజమూరు, సీతారామపురం, వరికుంటపాడు, అనంతసాగరం, కొండాపురం మండలాల్లో చినుకు జాడ కనిపించలేదు. అయితే నెల్లూరు నగరం, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, మనుబోలు ప్రాంతాల్లో జిల్లాలోనే అత్యధికంగా 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే గూడూరు డివిజన్‌లో ఒకమోస్తరు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో గజ తుఫాన్ ప్రభావం అస్సలు లేదని అధికారులు తెలిపారు.