రాష్ట్రీయం

ఐక్య ఫ్రంట్ అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు ప్రత్యామ్నాయం అనివార్యమని ఏపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ ఏకాభిప్రాయానికి వచ్చారు. బీజేపీ యేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా జాతీయ నేతలను కలుసుకుంటున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోవమవారం కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమై జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. బీజేపీయేతర పార్టీలతో కలసి ప్రయాణించేందుకు మమత సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీలో ఈ నెల 22న ప్రత్యామ్నాయ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో నిర్వహించనున్న సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు
అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రంలో బీజేపీ అణచివేత చర్యలకు పూనుకుంటోందని, దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో పాటు గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరిగినప్పుడే చర్చించినట్లు మమత గుర్తుచేశారు. ఏపీలో సీబీఐ ప్రవేశానికి సాధారణ సమ్మతిని రద్దు చేసిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా దానిని అనుసరించటం, అనంతర పరిణామాలపై వీరిరువురూ చర్చించారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందన ప్రస్తావనకు వచ్చింది. అయితే కాంగ్రెస్‌ను కలుపుకోవటాన్ని మమత మొదటి నుంచి ఆక్షేపిస్తున్నారు. దీనిపై చంద్రబాబు తగిన వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ, పొత్తులపై తరువాత నిర్ణయం తీసుకుందామని, ముందు కేంద్ర అణచివేత చర్యలను ప్రతిఘటించాల్సి ఉందనే వాదనకు మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారని తెలిసింది. తొలివిడత సమావేశంలో అన్ని అంశాలు చర్చించుకుని కలిసొచ్చే పార్టీలతో ముందుకు సాగాలని ఈ భేటీలో నిర్ణయించారు.
చర్చలు ఫలప్రదం: చంద్రబాబు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చలు ఫలప్రదంగా సాగాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధనాలకు వ్యతిరేకంగా మమత ఇప్పటికే పోరుబాట పట్టారని, ఎన్నికల కారణంగా ఈనెల 22 కంటే ముందే సమావేశాన్ని నిర్వహించాలని భావించామని త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పార్లమెంటు సమావేశాల లోపే బీజేపీ వ్యతిరేక పక్షాలతో సమావేశమై ఏ విధంగా వ్యవహరించాలనే విషయమై కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. దేశాన్ని రక్షించటంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, సీబీఐపై తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ అధికారాల పరిధిలోకే వస్తుందని మరోసారి స్పష్టంచేశారు. సీబీఐ సంక్షోభం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేమన్నారు. రాష్ట్ర అధికారాలు హక్కుగా, రాజ్యాంగపరంగా సంక్రమించాయని వాటిని హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. మమత ఆహ్వానంపైనే కోల్‌కతా చేరుకున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ కంటే మేమంతా సీనియర్ నేతలమే అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను ఫణంగా పెట్టి నిర్వీర్యం చేయటం అప్రజాస్వామికమన్నారు. బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మమత సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ప్రజల ఆకాంక్షల మేరకే నిర్ణయం: మమత
దేశ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశమైనట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక నిరంకుశ విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. పార్లమెంటు సమావేశాలు, ఎన్నికల సందర్భంగా 22న జరిగే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
ఇలాఉంటే వరుస పర్యటనలతో చంద్రబాబు బీజేపీ యేతర ప్రత్యామ్నాయ పార్టీల ఫ్రంట్ ఏర్పాటులో మరో అడుగు ముందుకేశారు. ఓ వైపు రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మపోరాట సభలు నిర్వహిస్తూనే మరోవైపు జాతీయ నేతలతో సమావేశమై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ పార్లమెంటు సమావేశాల్లోనే బీజేపీకి షాకివ్వాలనే యోచనతో ఉన్నట్లు సమాచారం.

చిత్రం..సోమవారం కోల్‌కతాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలుకుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ