రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఉభయనాంచారులతో కలిసి మాడ వీధులలో ఊరేగారు. అనంతరం ఆలయంలోని ప్రవేశించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప వారిని బంగారు వాకిలి వద్ద వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ పురాణలలో చెప్పిన విధంగా స్థితికారుడైన శ్రీ మహా విష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళతారని, కైశిక ద్వాదశినాడు ఆయన్ను మేల్కొల్పు చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశిని ప్రతి ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు. టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడ వీధుల్లో ఊరేగిస్తారని అన్నారు. కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తాన ద్వాదశి అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును మేల్కోల్పే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా పిలుస్తారని అన్నారు. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతః కాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, వీజీఓ మనోహర్ పాల్గొన్నారు.
రేపు కార్తీక పర్వ దీపోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న కార్తీక పర్వదీపోత్సవం ఘనంగా జరుగనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ప్రతి నెలా పౌర్ణమినాడు నిర్వహించే పౌర్ణమి గరుడసేవ కూడా ఈ కారణంగా రద్దయింది. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ యోగనరసింహ స్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళ అర వద్ద 100 కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ఛత్రచామర, మంగళవాయిద్యాల నడుమ దీపాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి, సన్నిధి, వకుళామాత, బంగారుబావి, కల్యాణ మండపంతోపాటు సభేర, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, వెండి వాకిటి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరణి వద్ద నేతి జ్యోతులను ఏర్పాటు చేస్తారు.

చిత్రం..కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేకువజామున
ఉభయ దేవేరులతో కూడిన ఉగ్ర శ్రీనివాసుడిని తిరుమల మాడ వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యం