రాష్ట్రీయం

తెరాస సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజా కూటమి ఓటర్లను మెప్పించలేక, సర్వేలతో అయోమయం సృష్టిస్తోందని టీఆర్‌ఎస్ నాయకుడు, రాష్ట్ర అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం వల్ల తమకు ఎంతో మేలు జరిగిందన్నారు. మరో 4 శాతం సానుకూలత పెరిగిందని బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిలో వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని సెంచరీ కొడుతున్నామని పునరుద్ఘాటించారు. తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని, ఢిల్లీ గులాంలు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యాలన్నారు. ప్రజా కూటమి గెలిస్తే చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఆంధ్ర అప్పగించి సీఎం అవుతారేమోనని కేటీఆర్ సెటైర్ వేశారు. బీజేపీ ఒక్క సీటూ గెలవదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం మీడియాకు బోగస్ సర్వే ఇచ్చారని విమర్శించారు. టీఆర్‌ఎస్ 65 నుంచి 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని గత నెల 20వ తేదీన లగడపాటి రాజగోపాల్ తన మొబైల్‌కు మెస్సేజ్ చేయగా, వంద సీట్లలో తాము గెలుపొందుతామని తాను సమాధానం పంపించానని కేటీఆర్ చెప్పారు. గత నెల 20వ తేదీ తర్వాత రాజగోపాల్ సర్వే చేయించలేదని, ఇది కేవలం చంద్రబాబు వత్తిడి వల్లే లెక్కలు మార్చాడని ఆయన విమర్శించారు. లగడపాటి వెనుక ఇద్దరు మీడియా ప్రతినిధులు ఉన్నారన్న కేటీఆర్ ‘వారి పేర్లు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెబుతా’నని ఆయన చెప్పారు. పెప్పర్ స్ప్రేతో పార్లమెంటులో తెలంగాణ బిల్లునే ఆపలేకపోయిన రాజగోపాల్ ఇప్పుడు తమ విజయాన్ని ఎలా నిలువరించగలరని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్‌కు చిలుక జోస్యం చెప్పుకోవడానికి రెండు చిలుకలు పంపిద్దామని ఆయన నవ్వుతూ అన్నారు. అలా చెప్పాలంటే తన వద్ద బోలేడు సర్వేలు ఉన్నాయని ఆయన తెలిపారు. జోసెఫ్ గోబెల్‌కు చంద్రబాబుకు చుట్టం అవుతారని కేటీఆర్ నవ్వుతూ చెప్పగా
‘గోబెల్ ఆంధ్రనా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించడంతో అందరూ గొల్లున నవ్వారు. చంద్రబాబు, రాహుల్ టూరిస్టులని, ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించరని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఫెడరల్ ఫ్రంట్ వేగవంతం
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పెద్ద విలన్ అవుతుందన్నారు. నోట్ల రద్దుతో కేంద్రంపై వ్యతిరేకత ఏర్పడిందన్నారు. సంపూర్ణ క్రాంతి అని ప్రధాని మోదీ అన్నందుకు తాము జీఎస్‌టీకీ మద్దతునిచ్చామన్నారు. ఆ తర్వాత తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు ఉప రాష్టప్రతి పదవికి పోటీ చేసినప్పుడు మద్దతునిచ్చామని ఆయన వివరించారు. కాంగ్రెస్-టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంలో గైర్హాజర్ అయ్యామని ఆయన గుర్తుచేశారు.
కొడంగల్‌లో విజయం మాదే
కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న కొడంగల్, మధిర, నాగార్జున సాగర్‌లో నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమాగా చెప్పారు. రేవంత్‌రెడ్డి పేపర్ టైగర్ అని కేటీఆర్ కొట్టిపారేశారు. రేవంత్ అరెస్టు వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, అయితే సీఎం పర్యటనను అడ్డుకుంటానని చెప్పినందున, తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఈసీ చర్యలు తీసుకుందన్నారు. రేవంత్ అరెస్టు వ్యవహారంలో హైకోర్టు తీర్పు గురించి ప్రస్తావించగా, దానిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. వైకాపాతోకలుస్తారా? అని ప్రశ్నించగా రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. మజ్లీస్ నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. స్నేహం చేసినంత మాత్రాన వారిలోని అన్ని గుణాలు నచ్చాలని ఏమీ లేదని ఆయన దాట వేశారు. 90 నియోజకవర్గాల్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుప్రచారం నిర్వహించారని ఆయన చెప్పారు.