రాష్ట్రీయం

ఓటరు మారాజుకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: పోలింగ్ వేళయింది. 2కోట్ల 80లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని విజేతను బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం చేసే రోజు ఆసన్నమైంది. క్షణం చేజారనివ్వకుండా వారాల తరబడి జరిగిన హోరాహోరీ ప్రచార హోరు, ర్యాలీలు, బహిరంగ సభల జోరు తెలంగాణ ఎన్నికల బరిని సమర క్షేత్రంగానే మార్చింది. పోటాపోటీగా తాయిలాలు, వరాలు, హామీలు, వాగ్దానాలు.. ఇలా తెరాస, ప్రజాకూటమి, బీజేపీ నేతలు ఓటరును ఆకట్టుకునేందుకు, తమకు అనుకూలంగా పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు విశ్వప్రయత్నమే చేశారు. రెండోసారి అధికారం కోసం తెరాస, తెలంగాణ ఇచ్చింది మేమేనంటున్న కాంగ్రెస్ సారథ్యంలో ప్రజాకూటమి, మేమొస్తే బాగేబాగు అంటూ బరిలో బీజేపీ రాష్ట్రాన్ని త్రిముఖ ఎన్నికల రణక్షేత్రంగా మార్చాయి. వంద సీట్లు తమవేనన్న తెరాస, అధికారం తమకేనంటున్న ప్రజాకూటమి, సొంత బలాన్ని చూపిస్తామంటున్న బీజేపీల్లో నిజంగా ఓటరు నాడి పట్టిందెవరు? అంతిమంగా ఓటరును ప్రసన్నం చేసుకునేదెవరన్నది నేడు జరుగబోయే పోలింగ్ తీరుతెన్నుల్ని బట్టే ఉంటుంది. ప్రచారంలో అలసిన నేతలు తమ ఆశలను ఓటరు కటాక్షానికే వదిలేశారు. నేడు జరిగే పోలింగ్ జడ్జిమెంట్ డే రోజున ఎవరికి టర్నింగ్ పాయింట్ అవుతుందో వేచిచూడాల్సిందే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమ తదుపరి పాలకులు ఎవరన్నది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో తమకు రెండవ దఫా పాలకులుగా ఏ పార్టీ ఉండాలో ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పు చెప్పబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి వైపా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రంలో అధికారంలో ఉండి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ వైపా?, ఏ గట్టునుంటారో ప్రజలు నేడు నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలోని 2 కోట్ల 80 లక్షల 69 వేల మంది ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రంలో పార్టీల భవితవ్యానికి, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తుండటంతో ఇక్కడ జరిగే ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన పాలకపక్షం టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలపడుతోంది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతోన్నప్పటికీ దక్షిణ భారతంలో జరిగేది ఈ ఒక్క రాష్ట్రంలోనే. దీంతో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో జరిగే ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యుపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపి సీఎం చంద్రబాబు నాయుడు, టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణలో కనీవినీ ఎరగని రీతిలో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో ఫలితం ఏవిధంగా ఉండబోతుందన్న దానిపై రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాలు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా ఉండగా శుక్రవారం జరిగే పోలింగ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంతూరు చింతమడకలో (సిద్దిపేట జిల్లా), టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లా కోదాడలో, మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.