రాష్ట్రీయం

కౌంటింగ్‌కు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

43 ప్రాంతాల్లో నేడే కౌంటింగ్ * ప్రతి నియోజకవర్గానికి ఒక కేంద్రం.. ఒక వీవీప్యాట్ లెక్కింపు
8 గంటలకు లెక్కింపు షురూ * కేంద్రాల్లోకి మొబైల్‌పోన్ల నిషేధం * సీఇవో రజత్ కుమార్ వెల్లడి
*
హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ శాసనసభకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలవుతుందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి ఒక లెక్కింపు కేంద్రం ఉంటుందన్నారు. మొత్తం 43 ప్రాంతాల్లో లెక్కింపు జరుగుతుందన్నారు. హైదరాబాద్ జిల్లా మినహాయిస్తే ఒక్కో ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ లెక్కింపు కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయని, ఒక్కో టేబుల్‌పై ఒక ఈవీఎంను లెక్కిస్తామన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ కోసం ప్రత్యేకంగా ఒక టేబుల్ ఉంటుదని వివరించారు. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామన్నారు. ఈవీఎంల లెక్కించే ముందుకు ఫాం 17 సీ (పోలింగ్ సందర్భంగా ఈవీఎంలో పోలైన ఓట్ల వివరాలతో కూడిన ఫారం) గురించి ప్రిసైడింగ్ ఆఫీసర్ రాజకీయ పార్టీల ఏజంట్లకు వివరిస్తారు. ఒట్లలెక్కింపు మొత్తం ఏజంట్ల సమక్షంలోనే జరుగుతుందన్నారు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్య గురించి చెబుతారు. ఏజంట్ల సంతకాలు తీసుకున్న తర్వాత ఈవీఎంలు వేసిన సీల్‌ను తొలగించి ఓట్లను లెక్కిస్తారని రజత్ కుమార్ తెలిపారు. లెక్కింపు తర్వాత అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలు వెల్లడిస్తారు. ప్రతి రౌండ్‌లో 14 ఈవీఎంలను లెక్కిస్తామన్నారు. ప్రతి రౌండ్‌లో దాదాపు 14 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఎన్ని రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందో తేలుతుంది. అతితక్కువ రౌండ్లు బెల్లంపల్లిలో (15 రౌండ్లు) ఉంటాయని, అత్యధికంగా రౌండ్లు శేరిలింగంపల్లి (42) లో ఉంటాయని రజత్ కుమార్ వివరించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్, ఒక అసిస్టెంట్ సూపర్‌వైజర్, ఒక మైక్రో ఆబ్జర్వర్ ఉంటారు. ప్రతి రౌండ్‌కు సంబంధించిన ఫలితాలు ఏజంట్లు సంతృప్తి వ్యక్తం చేశాకే వెల్లడిస్తారు. నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కౌంటింగ్ పూర్తయినతర్వాత ఏదైనా ఒక వీవీప్యాట్‌లోని ఓటర్ స్లిప్పులను ఏజంట్ల సమక్షంలోనే లెక్కిస్తారు. ఈవీఎంతో వీటిని సరిచూస్తారు.
ఏజంట్లుకు నియమావళి
ఏజంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లేందుకు అనుమతించమని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఒక సారి కేంద్రంలోకి వెళ్లిన ఏజంట్ కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు బయటకు వెళ్లేందుకు అనుమతించబోమన్నారు. కౌంటింగ్ హాలులోకి సూపర్‌వైజర్లు, కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ అనుమతించిన వ్యక్తులు ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని సీఈఓ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో పొగతాగడాన్ని నిషేధించామన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతించిన మీడియా ప్రతినిధులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చని, కాని ఒకే ఈవీఎంపై ఫోకస్ ఉండకూడదన్నారు. ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత ఓట్ల వివరాలను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిశీలకుడి అనుమతితో నియోజకవర్గంలో ఎవరు గెలిచారో రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
ఓటర్ల జాబితాలో నమోదుకు మళ్లీ అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపడుతున్నామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేశారు. 2018 డిసెంబర్ 26 న ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడిస్తారు. పేర్ల నమోదు, తొలగింపునకు సంబంధించిన ఫిర్యాదులను 2018 డిసెంబర్ 26 నుండి 2019 జనవరి 25 వరకు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 11 వరకు ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తారు. 2019 ఫిబ్రవరి 18 వరకు సప్లిమెంట్ జాబితా ప్రకటిస్తారు. 2019 ఫిబ్రవరి 22 న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న సీఈవో రజత్ కుమార్