రాష్ట్రీయం

ఇద్దరు.. ముగ్గురితో థర్డ్ ఫ్రంట్ విఫల ప్రయోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: జాతీయ స్థాయిలో ఇద్దరు..ముగ్గురితో కలసి థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు విఫల ప్రయత్నమేనని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ ఆవిర్భవించనుందని తెలంగాణలో ఘన విజయం అనంతరం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రకటనలపై చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తూ అది బీజేపీకి మేలుచేసే ప్రయత్నమే అని అభిప్రాయపడ్డారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై బీజేపీ నేతలు మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణకు ఆదాయం ఎక్కువ.. అయినా నాలుగేళ్లలో జరిగిన ప్రజా సంక్షేమం తక్కువన్నారు. ఏపీలో ఆదాయం తక్కువయినప్పటికీ పేదల సంక్షేమానికి అత్యధికంగా నిధులు కేటాయించామని, అభివృద్ధి పనులు ఎక్కువ సాధించామని చెప్పారు. నదుల అనుసంధానం, నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, పెద్దఎత్తున పేదలకు గృహనిర్మాణం, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. తెలంగాణ ఫలితాలు వేరు.. మిగిలిన రాష్ట్రాల ఫలితాలు వేరన్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహం.. సెంటిమెంట్ ప్రభావం చూపాయన్నారు. బీజేపీ తరుపున రెండు సార్లు ప్రధానమంత్రి, 7 సార్లు అమిత్‌షా, ముగ్గురు ముఖ్యమంత్రులు, 13 మంది మంత్రులు ప్రచారం నిర్వహించి 118 సీట్లలో పోటీచేస్తే కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుందని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. మా రెండు కళ్లు పోయినా ఫర్వాలేదు.. మీ కన్ను మాత్రం పోవాలనే పెడధోరణితో బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సి ఉందన్నారు. నమ్మకద్రోహం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దేశ భవిష్యత్ కోసమే జాతీయ స్థాయిలో కీలక భూమిక వహిస్తున్నామని స్పష్టం
చేశారు. థర్డ్‌ఫ్రంట్ వెనుక బీజేపీ ఉందనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌తో సహా బీజేపీ యేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నామని తెలిపారు. బీజేపీపై పోరాటానికి కేసీఆర్ కలసిరాలేదు..కలసి పోటీచేద్దామంటే తిరస్కరించారని గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు బీజేపీని కోలుకోలేని దెబ్బ తీశాయన్నారు. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించటం ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. దేశంలో బీజేపీ పాలన అంతమొందించాలి.. ప్రత్యామ్నాయం రావాలనేది ప్రజల ఆకాంక్షగా చెప్పారు. సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల నియామక, శిక్షణ కార్యక్రమాలపై సమీక్షించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే బీజేపీయేతర పార్టీల ఏకీకరణకు నిదర్శనమన్నారు. ఈ కలయికకు ప్రజామోదం ఉందని తెలిపారు. తన దేశవ్యాప్త పర్యటనలకు ప్రజలు స్పందించారన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, ఏపీకి కొన్ని హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీనే ప్రధాన శత్రువుగా పరిగణిస్తామని స్పష్టంచేశారు. బీజేపీయేతర పార్టీలను ఏకంచేసి రాష్ట్రానికి న్యాయం చేసేందుకు టీడీపీ శక్తివంచనలేకుండా పోరాడుతుందని ప్రకటించారు. టీడీపీని ఇబ్బందులు పెట్టాలని మోదీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎంపీలు మాగుంట, సుజనా సంస్థలపై ఐటీ దాడులే ఇందుకు అద్దం పడుతున్నాయి.. బీజేపీ నేతలు ఏపీనే టార్గెట్ చేస్తున్నారు.. తద్వారా బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం అప్రమత్తంగా ఉండాలి.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలి.. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండరాదని దిశానిర్దేశం చేశారు. సీబీఐ, ఆర్బీఐ వ్యవస్థలను కేంద్రం పతనం చేసిందని పునరుద్ఘాటించారు. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలపడాలని ఆకాంక్షించారు. ఇకపై అధిక కాలం పార్టీకి కేటాయిస్తామని వెల్లడించారు. సభ్యత్వ నమోదుపై స్పందిస్తూ 41 రోజుల్లో 38లక్షల 50వేల సభ్యత్వ నమోదు జరిగిందని, నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలి. ప్రతి లబ్ధిదారుడ్ని పలుకరించాలి.. అందరినీ పార్టీకి చేరువ చేయాలన్నారు. ఈనెల 30న రాజమండ్రిలో నిర్వహించే జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈలోపు నియోజకవర్గ బీసీ సభలు నిర్వహించాలని, అన్ని బీసీ సంఘాలతో చర్చించి ఆదరణ- 2 పథకం పై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని కోరారు. ఇప్పటి వరకు బీసీలకు ఏం చేశాం.. ఇంకా ఏం చేయాలనే దానిపై చర్చించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలలో సాధించిన పట్టు నిలుపుకోవాలని ఉద్ఘాటించారు. గ్రామ వికాసం కార్యక్రమం 47.3 శాతం జరిగిందంటూ మిగిలిన గ్రామాల్లో ఉత్సాహంగా జరపాలన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త నిరంతరం ప్రజల్లో తిరగాలన్నారు. ఈ కారణంగానే తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన సండ్ర వీరయ్య, మచ్చా నాగేశ్వరరావు ప్రజాదరణ పొందారని ప్రశంసించారు. ఓటర్ల జాబితాపై ఇప్పటి నుండే అంతా శ్రద్ధ వహించాలన్నారు. బూత్ కమిటీల ఏర్పాటు 89 శాతం పూర్తయిందని, మిగిలిన బూత్‌లకు వెంటనే కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు 68 శాతం శిక్షణా కార్యక్రమం పూర్తయిందని నూరు శాతం జరగాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర, మండల కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.