రాష్ట్రీయం

పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 50 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి పంచాయతీరాజ్‌లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వచ్చే నెల జనవరి 10 లోగా పంచాయతీరాజ్ ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఖరారుపై ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమం అయింది. అయితే ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీంతో రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకున్నాయి. అయితే రిజర్వేషన్లు శాతం 50 శాతానికి మించకూడదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాలని సీఎం ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేసి గ్రామాల రూపురేఖలు మార్చాలన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే పచ్చదనం, పరిశ్రుభత పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 12,751 గ్రామ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంతకం చేశారు. కొత్త జోనల్ విధానం ప్రకారం కార్యదర్శుల నియామకం జరగాలని ఆదేశించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన సదస్సును ఈ నెల 27న నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సదస్సును ఎల్‌బి స్టేడియంలో నిర్వహించనుండగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి కూడా ఇక నుంచి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వనున్నట్టు సీఎం చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను
ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి వీటిని అమలు చేయాలని ఆదేశించారు. ములుగు, నారాయణపేట జిల్లాలతో పాటు కోరుట్ల రెవిన్యూ డివిజన్, నల్లగొండ జిల్లా గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లా మల్లంపల్లి కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం అదేశించారు. ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంచాల్సిన చీరలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు ఆగిపోయిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యేల ద్వారానే అందజేయాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల కోడ్ మూలంగా ఇప్పటి వరకు వీటిని కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
చిత్రం..ప్రగతిభవన్‌లో ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు. చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు