రాష్ట్రీయం

వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తకోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 17: వైకుంఠ ఏకాదశి పర్వదినమైన మంగళవారం కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశుడు కొలువుదీరి ఉన్న తిరుమల ఆలయంలోని ఆనందనిలయానికి అనుసంధానంగా ఉన్న ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనినే ముక్కోటి ఏకాదశిగా కూడా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకుమించి శ్రీవారి గర్భాలయానికి అనుసంధానంగా ఉన్న ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనానే్న వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు దక్షిణమార్గంలో బంగారువాకిలి నుంచి వెలుపలికి వచ్చి అక్కడ ఉన్న వైకుంఠ ద్వారంలో ప్రవేశిస్తారు. గర్భగుడి ప్రదక్షిణగా ఉత్తరదిశలో ఉన్న హుండీకి సమీపంలో ఉన్న ద్వారం గుండా వెలుపలికి వచ్చి స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. యేడాదిలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో రెండురోజులు మాత్రమే తెరచి ఉండే వైకుంఠ ద్వారంలో ప్రవేశించే అవకాశం భక్తులకు లభిస్తుంది. వైకుంఠ ప్రదక్షిణ చేసిన భక్తులకు పూర్వ పాపకర్మలు నశిస్తాయని, ఇష్టార్థాలన్నీ నెరవేరుతాయని పురాణ ప్రాశస్త్యం. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని ఆలయ మహద్వారం నుంచి వివిధ రకాల సుగుంధ పుష్పాలతో, విద్యుత్ దీపాలతో విశేషంగా అలంకరించారు. ముఖ్యంగా వైకుంఠ ద్వారం లోపల కూడా ఈ అలంకరణ చేశారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల 4.30 లోపు తిరుప్పావై, తోమాల, అర్చన,కొలువు లాంటి కైంకర్యాలను పూర్తిచేసి పరిమిత సంఖ్యలో వీఐపీలను అనుమతిస్తారు. అటు తరువాత సామాన్య భక్తులను స్వామిదర్శనం కోసం అనుమతిస్తారు. నిరంతరాయంగా సామాన్య భక్తులకు స్వామిదర్శనం సమయాన్ని కేటాయిస్తారు.
కాగా వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు సోమవారం సాయంత్రానికే తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నారాయణగిరి ఉద్యానవనాలు, మాడ వీధులలోని షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు నీరు, ఆహార పదార్థాల కొదవలేకుండా టీటీడీ అధికారులు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం కల్పించేవిధంగా భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి పట్టేసమయాన్ని వసతులు సౌకర్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు. టీటీడీ వైద్యవిభాగం ఆధ్వర్యంలో ప్రధమచికిత్సాకేంద్రాలను ఏర్పాటుచేశారు. సీఎంఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇక బర్డ్ డైరెక్టర్ జగదీష్ ఆదేశాల మేరకు డిప్యూటీ సివిల్ సర్జన్, అనస్తీషియా డాక్టర్ పి.శ్రీనివాస్ నేతృత్వంలో బర్డ్ సిబ్బంది భక్తులకు సేవలందించడానికి సిద్దంగా ఉన్నారు. కాగా శ్రీవారి దర్శనార్థం కుటుంబసమేతంగా ఆదివారం తిరుమలకు చేరుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనానికి తిరుమలకు విచ్చేసిన భక్తులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించారు. క్యూలైన్‌ల ఏర్పాటు, భోజన, అల్పాహారం, కాఫీ,టీ,పాలు అందిస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు చేపట్టిన ప్రణాళికను అభినందించారు. రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న క్యాంటీన్ సిబ్బందిని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, ఈఓ ఏకే సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు టీటీడీలో సీనియర్ అధికారులను వెంటబెట్టుకొని తిరుమలలో కలియదిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం సాయంత్రానికి 70,000 మంది భక్తులు తిరుమలకు వచ్చారని, రాత్రికి ఈ సంఖ్య మరో 40,000 నుంచి 50,000కు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
తిరుమలలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చలి, మంచు తీవ్రంగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా రూ.4.75 కోట్లతో జర్మన్ టెక్నాలజీతో తొలిసారిగా ఏర్పాటుచేసిస షెడ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఉత్తరద్వారాన్ని తెరచి ఉంచుతామని, 1.50లక్షల మందికి స్వామివారి దర్శనం కల్పించే ఏర్పాట్లుచేశామన్నారు. 2 రోజులు 48 గంటలు సమయం ఉండగా 40 గంటలు నిరంతరాయంగా సామాన్యభక్తులకు దర్శనంకల్పించే ఏర్పాట్లుచేశామన్నారు. తోపులాటలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు సహకరించాలన్నారు.
నేడు ఉదయం స్వర్ణరథం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై అధిరోహించి భక్తులను కటాక్షించనున్నారు. 19వ తేదీ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామిపుష్కరిణి, తీర్థముక్కోటిని తిరుమలలో జరుపనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంతగల స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన నిర్వహించే స్వర్ణరథోత్సవంలో పాల్గొనే భక్తులకు 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందని, అలాగే బుధవారం పుష్కరిణిలో జరిగే చక్రస్నానం సుమూహూర్తాన స్నానమాచరించినవారికి తిరుమల శేషగిరుల్లో ఉన్న తీర్థాల స్నాన ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.