రాష్ట్రీయం

మూడేళ్లలో లక్ష కోట్ల అప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: మూడేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం లక్షా 23వేల కోట్ల రూపాయలు అప్పులు చేయనుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు తీర్మానంపై కాంగ్రెస్ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను అప్పుల్లో ముంచెత్తే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 62వేల కోట్ల రూపాయల అప్పులు ఉండగా, ప్రభుత్వం పలు పథకాలకు అప్పులు చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు.
ఈ దశలో ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకుని విభజన జరిగినప్పుడు అప్పుల్లో మన వాటా 62వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని తొలుత అంచనా వేసినట్టు చెప్పారు. ఆడిట్ పూర్తయిన తరువాత అప్పుల్లో మన వాటా 82వేల కోట్లకు చేరినట్టు చెప్పారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వీటన్నిటికి కలిపి లక్షా 25వేల కోట్ల రూపాయల అప్పు అవసరమవుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారమే 2016-17 బడ్జెట్ ముగింపు నాటికి లక్షా 25వేల కోట్ల రూపాయల అదనపు అప్పులు అవుతాయని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటి వాటి నుంచి ప్రభుత్వానికి రాబడి అంటూ ఏమీ ఉండదని, కార్పొరేషన్లను ఏర్పాటు చేసి విడిగా అప్పులు చేయడం, ప్రభుత్వం పూచికత్తు ఇవ్వడం రాష్ట్రాన్ని ప్రమాదంలో పడేసే నిర్ణయమని అన్నారు. భవిష్యత్తు తరాలను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నా, అమలులో మాత్రం పొంతన ఉండడం లేదన్నారు. 2014-15లో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా 62వేల కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేశారని తెలిపారు. అదే విధంగా 2015-16లో లక్షా 15వేల కోట్ల బడ్జెట్‌లో 85-90వేల కోట్ల వరకు మాత్రమే వ్యయం చేసినట్టు చెప్పారు. ఇక 2016-17లో లక్షా 30వేల కోట్ల బడ్జెట్ అని ఘనంగా చెప్పుకుంటున్నా ప్లాన్ బడ్జెట్‌లో 42 నుంచి 44వేల కోట్లకు మించి వ్యయం చేయలేరని అన్నారు. ఆరు దశాబ్దాల్లో 62వేల కోట్ల అప్పులు ఉంటే కేవలం మూడేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షా 25వేల కోట్ల అప్పులు చేస్తోందని తెలిపారు. మరోవైపు అత్యంత విలువైన భూముల అమ్మడం ద్వారా 10వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు ఎడాపెడా అప్పులు చేస్తూ, విలువైన భూములు అమ్ముకోవడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటుందని ఉత్తమ్ ప్రశ్నించారు. రూ.4200 కోట్లు చెల్లిస్తే ఒకేసారి రైతులను రుణ విముక్తి చేయవచ్చునని అన్నారు. ముఖ్యమంత్రి వద్ద ప్రత్యేక అభివృద్ధి నిధి పేరుతో నాలుగువేల ఆరువందల కోట్ల రూపాయల నిధి పెట్టుకునే బదులు ఆ డబ్బును రుణమాఫీకి కేటాయించాలని కోరారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులను నామినేషన్ విధానంతో కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారని, ఇది అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఏదో జరుగుతోంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోందని అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, రైతులు అందరిలో అసంతృప్తి ఉందని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.