రాష్ట్రీయం

విసిల నియామకంలో రాజకీయాలు ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్ల నియామకంలో రాజకీయాలు ఉండరాదని, గత అనుభవాల దృష్ట్యా సమర్థులైన విద్యావేత్తలను వైస్‌చాన్సలర్లను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం రెండువర్శిటీల చట్టాన్ని సవరించేందుకు బిల్లులు తెచ్చిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. వైస్‌చాన్సలర్, చాన్సలర్‌ను ఎంపిక చేసే కమిటీలో ప్రతిపక్ష పార్టీ నేతను కూడా సభ్యుడిగా నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం శాసనసభ డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. గవర్నర్ ప్రమేయం లేకుండా, వారిని చాన్సలర్ పదవి నుంచి తప్పించడం, వైస్ చాన్సలర్ ఎంపికలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. కాగా ఈ వాకౌట్‌లో కాంగ్రెస్ సభ్యుడు మాధవరావు పాల్గొనలేదు. తొలుత ఈ బిల్లులను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఒకసారి మంత్రి జగదీశ్ రెడ్డి వర్శిటీల పరిస్ధితిని సమీక్షించారన్నారు. ఒక విసి రిటైరయ్యే రోజు 300 మందిని ఉద్యోగాల్లో నియమించినట్లు వెల్లడైందన్నారు. ఈ పరిస్థితి బాధాకరమన్నారు. అన్ని వర్శిటీలకు చాన్సలర్‌గా గవర్నర్ ఉండాలని లేదని, తాము గవర్నర్‌కు ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. చాన్సలర్‌గా హైకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జి లేదా సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జిలను నియమిస్తామన్నారు. అలాగే విసిల నియామకానికి ఏర్పాటు చేసే కమిటీ విద్యా రంగాన్ని బాగు చేసే ఉద్దేశ్యంతో అన్ని అర్హతలున్న విసిని ఎంపిక చేస్తుందన్నారు. కొంత మంది విసిలు అవినీతితో ఇష్టానుసారంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయన్నారు. కొన్ని వర్శిటీలకు చాన్సలర్‌ను నియమించడమంటే ఏకపక్షంగా వ్యవహరించడం కాదన్నారు. గవర్నర్ అంటే రాష్టమ్రంత్రివర్గమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చట్టాలను స్వీకరించడమేకాకుండా, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా సవరణ చేసుకునే అధికారం పునర్వ్యవస్థీకరణ చట్టం కల్పించిందన్నారు. గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొన్ని వర్శిటీలకు చాన్సలర్లను ప్రభుత్వమే నియమిస్తుందన్నారు. యుజిసి నుంచి నిధులు రావనేది అపోహమాత్రమే అన్నారు. ఉస్మానియా వర్శిటీకి ఒకప్పుడు వేల ఎకరాల భూమి ఉండేదని, ఇప్పుడు ఆ వర్శిటీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆస్తులు పోయాయి, విచ్చలవిడితనం పెరిగిపోతోందని, నియంత్రణ లేదని, అందుకే ప్రభుత్వం యూనివర్శిటీల విసిలను ఎంపిక చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుని సమర్థులైన విద్యావేత్తలను నియమించేందుకు ఈ బిల్లులను తెచ్చిందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఈ బిల్లులు విఘాతం కలిగిస్తాయని ఆరోపిస్తూ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.