ఆంధ్రప్రదేశ్‌

ద్రవ్య వినిమయ బిల్లు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు నిరసనల మధ్య మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించగా వైకాపా సభ్యుడు కె. గోవర్దన్‌రెడ్డి, టిడిపి పక్షాన కాల్వ శ్రీనివాస్, బిజెపి సభ్యుడు విష్ణువర్దన్ తదితరులు మాట్లాడారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలకు సమాధానం ఇచ్చిన తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపాలని యనమల కోరారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ బిల్లును సభ ముందు ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లుపై ఓటింగ్ జరగాలని, సభ్యుల డివిజన్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టాలని వైకాపా డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. వైకాపా డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. న్యాయనిపుణుల సలహాలు, చట్టసభల నియమావళి, రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత వైకాపా డిమాండ్‌ను ఆమోదించడం లేదని ఆ పార్టీ సభ్యుల నిరసనల మధ్య స్పీకర్ ప్రకటించారు. వైకాపా సభ్యులు ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగానే ద్రవ్యవినిమయ బిల్లును సభ ఆమోదం కోసం ఉంచుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించిందని వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత సభను నివధికంగా వాయిదా వేస్తున్నట్టు కోడెల తెలిపారు.
అంతకుముందు అధికార, విపక్ష, మిత్రపక్షాల సభ్యులు ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడారు. అధికార పక్షం ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేదని గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ బిల్లును ఓటింగ్‌కు పెట్టాలని డిమాండ్ చేశారు. యనమల జోక్యం చేసుకుంటూ రెవెన్యూ లోటు ఎఫ్‌ఆర్‌బిఎంకు అనుగుణంగానే ఉందని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే 20వేల కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకానికి అభ్యర్థుల వయోపరిమితిని పెంచే అంశం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. బిల్లును ఓటింగ్‌కు పెట్టాల్సిన అవసరం లేదని, బడ్జెట్‌పై, డిమాండ్లపై ఓటింగ్ అడిగేందుకు విపక్షానికి ఉన్న అవకాశాన్ని వారు వినియోగించుకోలేదన్నారు. కేవలం వైకాపా సభ్యులను కాపాడుకునేందుకే బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నారన్నారని ఆరోపించారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం లభించింది.

చిత్రం... శాసనసభలో మాట్లాడుతున్న యనమల