రాష్ట్రీయం

పంచాయతీ నామినేషన్లు లక్షా 25 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు 1,25,630 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4479 పంచాయతీ సర్పంచ్‌లు, 39,832 వార్డు సభ్యుల స్థానాలకు రిటర్నింగ్ అధికారులు ఈ నెల ఏడున నోటీస్ జారీ చేశారు. ఏడు నుండి తొమ్మిదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు కాగా, ఈ మూడు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 27,940 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 97,690 నామినేషన్లు వచ్చాయి. చాలా జిల్లాల్లో సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. ఒక స్థానానికి ఒక నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా ఎన్నికయినట్టే. అయితే ఏకగ్రీవ ఎన్నికల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించలేదు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాతనే ఏకగ్రీవ ఎన్నికల వివరాలు వెల్లడిస్తామని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
వివిధ జిల్లాల నుండి అందిన సమాచారం ప్రకారం సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా, అతితక్కువగా నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. 304 గ్రామ పంచాయతీలు ఉన్న నల్లగొండ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 2231 నామినేషన్లు వచ్చాయి. 258 పంచాయతీలు ఉన్న సంగారెడ్డి జిల్లా 1679 నామినేషన్లతో రెండోస్థానంలో, 186 పంచాయతీలు ఉన్న సిద్ధిపేట 1609 నామినేషన్లతో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే 33 గ్రామ పంచాయతీలు ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్పంచ్ స్థానాలకు 199 నామినేషన్లతో చివరిస్థానంలో నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 174 పంచాయతీలకు గాను 276 నామినేన్లతో చివరి నుండి రెండో స్థానంలో నిలిచింది. అలాగే వరంగల్ (అర్బన్) 49 పంచాయతీ స్థానాలకు గాను 199 నామినేషన్లతో చివరి నుండి మూడో స్థానంలో నిలిచింది. ఇలా ఉండగా వార్డు సభ్యుల స్థానాల్లో 2398 స్థానాలున్న సంగారెడ్డి జిల్లా 7576 నామినేషన్లతో మొదటిస్థానంలో నిలిచింది. 1712 వార్డు స్థానాలున్న సిద్ధిపేట జిల్లా 5223 నామినేషన్లతో రెండోస్థానంలో, 2274 వార్డుస్థానాలున్న మహబూబ్‌నగర్ జిల్లా 5127 నామినేషన్లతో మూడోస్థానంలో నిలిచింది. అలాగే అతితక్కువ నామినేషన్లు వచ్చిన జిల్లాల్లో మేడ్చల్ మల్కాజిగిరి 322 వార్డు స్థానాలకు గాను 1178 నామినేషన్లతో చివరి స్థానంలో ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1534 వార్డు స్థానాలకు గాను 1227
నామినేషన్లతో చివరి నుండి రెండోస్థానంలో ఉంది. భద్రాద్రిలో వార్డు సభ్యుల స్థానాలకంటే దాఖలైన నామినేషన్ల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. వరంగల్ (అర్బన్) జిల్లాలో 472 వార్డు స్థానాలు ఉండగా, 1261 నామినేషన్లతో మూడో స్థానంలో ఉంది.
తొలిదశ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. దాఖలైన నామినేషన్లపై, నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేయదలిస్తే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఫిర్యాదులను జనవరి 12 న పరిశీలించి నిర్ణయం వెల్లడిస్తారు. 13 వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ప్రకటించారు. ఆ వెంటనే పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఈ నెల 21 న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి పూర్తి చేస్తారు. సర్పంచ్ పదవికి, వార్డుల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించి, ఆ వెంటనే ఉపసర్పంచ్ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తారు.