రాష్ట్రీయం

సామాన్య భక్తుడిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 10: ప్రజా సంకల్ప యాత్ర ముగింపు నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దివ్యదర్శనంలో సామాన్య భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. 2017 నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి 14 నెలలపాటు 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో బుధవారం పాదయాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీల్లో వైకాపా ముఖ్యనేతలతో కలిసి గురువారం ఉదయం 10 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. జగన్ రాక సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వైకాపా నాయకులు సమన్వయంతో వ్యవహరించి రైల్వే స్టేషన్ వెనుకవైపు ఉన్న ప్రవేశ మార్గం గుండా బైటకు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సీ ఎం జగన్.. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రేణిగుంట వైకాపా నేతలు దారి పొడవునా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి అతిధి భవనానికి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన చేరుకున్నారు. ఈసందర్భంగా దారి పొడవునా ఇరువైపులా చేరుకుని టన్నుల కొద్ది పువ్వులతో ఆయనకు స్వాగతం పలికారు. పద్మావతి అతిధిగృహం చేరుకుని గంటపాటు విడిది చేశారు. 12.50 నిమిషాలకు పద్మావతి అతిథి భవనం నుంచి బయలుదేరి 1.15 గంటలకు అలిపిరి పాదాల వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా కొబ్బరి కాయలు కొట్టి కాలినడకన తిరుమలకు బయలు దేరారు. ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి వైకాపా నేతలతో పాటు వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు.
చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడంతో జగన్ పర్యటన జనసంద్రం మధ్య సాగింది. రేణిగుంట నుంచి అలిపిరి వరకు జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు కాలినడక దారిలో మాత్రం జగన్ వెంట వచ్చిన వారంతా భక్తులతో కలిసి గోవింద నామ స్మరణలు చేశారు. కాలినడకన గాలి గోపురం వద్ద టీటీడీ కౌంటర్లో జగన్ దివ్యదర్శనం టోకెన్ కట్టుకున్నారు. 2.20 గంటలకు కాలి నడకన బయలు దేరిన జగన్ 4.30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకుని అక్కడ నుంచి పద్మావతి అతిథిభవనం ప్రాంతంలోని శ్రీకృష్ణ అతిథిభవనం చేరుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ డిప్యూటీ ఈఓ బాలాజీ, ఓఎస్డీ ధనంజయులు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు దివ్యదర్శనం భక్తులను అనుమతించే మార్గం గుండా స్వామివారి దర్శనానికి ఆలయంలోనికి వెళ్లారు. సాంప్రదాయ దుస్తులను ధరించి క్యూలో వెడుతున్న జగన్‌ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా వారికి జగన్ ముకుళిత హస్తాలతో, చిరునవ్వుతో ప్రతి అభివాదం చేశారు. కాగా జగన్ మహాద్వారం వద్దకు చేరుకునే సమయానికి ఒక్కసారిగా కార్యకర్తలు ముందుకు రావడంతో కొద్దిపాటి తోపులాట జరిగింది. అయితే టీటీడీ భద్రతా సిబ్బంది వారిని నియంత్రించారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్ ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయనకు అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి దర్శనానంతరం జగన్మోహన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడకుండానే తిరుమలలో గోగర్భం సమీపాన ఉన్న శారదాపీఠంకు బయలుదేరి వెళ్లారు.
అక్కడ ఆయనకు మఠం స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి స్వరూపానంద స్వామి దగ్గరకు వెళ్లి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామిజీ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టువస్త్రాలు కప్పి ప్రసాదాలు అందించారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి మఠంలోనే భోజనం చేసి 9.30 నిమిషాల ప్రాంతంలో తాను బస చేసివున్న శ్రీకృష్ణ అతిథి భననం చేరుకుని బసచేశారు. కాగా శుక్రవారం ఉదయం 6గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలనుంచి కారులో బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్ తదితరులు ఉన్నారు.