రాష్ట్రీయం

నేడు చా.సో 104వ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 16: గురజాడ వారసత్వ ప్రతినిధిగా కథా రచనలో వాసికెక్కిన చాగంటి సోమయాజులు(చా.సో) జయంత్యుత్సవాలకు విజయనగరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాహిత్య రంగంలో చాసో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఏటా ఆయన జయంతి కుమార్తె చాగంటి తులసి ఉన్నత స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 17వతేదీన యువ రచయిత వేంపల్లె షరీఫ్‌కు చా.సో స్ఫూర్తి పురస్కారాన్ని అందజేయనున్నారు. పట్టణంలోని గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం సాయంత్రం ఈ పురస్కారాన్ని విశిష్ట అతిథుల చేతుల మీదుగా అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. 1995 నుంచి ప్రారంభమైన చాసో స్ఫూర్తి పురస్కారం ఇప్పటివరకు 23 మంది అందుకున్నారు. అందుకున్న వారిలో ఎం.రామ్మోహనరావు, ఆరుద్ర, పి.సత్యవతి, గంటేడ గౌరునాయుడు, బోయ జంగయ్య, కెఎన్‌వై పతంజలి, చిలుకూరి దేవపుత్ర, ముదిగంటి సుజాతరెడ్డి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కె.వరలక్ష్మి, వి.ప్రతిమ, ఎం.ఖాదిర్‌బాబు, జాజులర గౌరి, ఎస్.సలీం, ఎస్‌వి.రామిరెడ్డి, కె.పద్మ, శశిశ్రీ, ఎఎన్ జగన్నాధశర్మ, పెద్దింటి అశోక్‌కుమార్, చింతకింది శ్రీనివాసరావు, కె.వి.రమణారావు, ఎంఎం వినోదిని, గౌరీ హరదాస్ ఉన్నారు. చాసో 1915 జనవరి 17వతేదీన శ్రీకాకుళంలో జన్మించారు. హైస్కూల్ విద్యాభ్యాసం శ్రీకాకుళంలోనే సాగింది. విజయనగరం మహారాజా కళాశాలలో కళాశాల విద్యను అభ్యసించారు. విజయనగరం చిన్నపల్లివీధిలో చాసో స్వగృహం అభ్యుదయ సాహిత్యోద్యమానికి ఆటపట్టుగా నిలిచింది. 1930-40 మధ్య కాలంలో తెలుగు కవిత్యోద్యమానికి కవాటాలు తెరచింది. శ్రీరంగం నారాయణబాబు చాసో ఇంటి పక్కనే నివసించేవారు. భగత్‌సింగ్ ఆశయాలపట్ల వీరిద్దరు ఆకర్షితులై సోషలిస్టు భావాలను పెంచుకున్నారు. ప్రజలు అన్యాయాలను ఎదుర్కోవాలని తన కథలలో చెప్పారు. శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, రోణంకి, ఆరుద్రలకు వసతిగృహ అధ్యయన కేంద్రం శిక్షణ శిబిరంగా విరాజిల్లింది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం, నారాయణబాబు-రుధిర జ్యోతి, చాసో కథలు ఆవిర్భవించాయి. చాసో నాలుగు దశాబ్ధాలపాటు 50కి పైగా కథలు రాశారు. ఆయన కథలు దృశ్య సాక్ష్యాత్కారాలు. ‘గుడిసె దీర్ఘరోగి’ కథ మధ్యతరగతి మనుష్యులలో దాగి ఉండే సౌందర్యధారణకు మచ్చుతునక. నడిమంత్రపు సిరి పట్టిన మధ్య తరగతి కుటుంబీకుల మనస్తత్వాన్ని ‘వణులవారి’ కథలో చక్కగా వ్యక్తం చేశారు. చాసో పేరు వినగానే కుక్కలకంటే హీనంగా బతికే ‘కుక్కుటేశ్వరరావు’ కథ ఎవరికైనా జ్ఞప్తికి వస్తుంది. ‘లేడి కరుణాకరం, ఏలూరు వెళ్లాలి’, ఎందుకు పారేస్తారు నాన్న, బండపాటు, ఎంపు, జంక్షన్‌లో బడ్డీ, దుమ్మలగుండె, బొమ్మలపెళ్లి.. ఇలా ప్రతి కథ చాసో ప్రతిభకు సామాజిక చైతన్యానికి సారథ్యం వహిస్తాయి. చాసో ముద్ర చెరిగిపోదని ఆరుద్ర అన్నారు. నిమగ్నత, నిజాయితీ, నిరాడంబరత, మానవత్వం, చాసో ఆయుధాలు అవే కథా రచనలో ఆయన అభ్యున్నతికి సోపానాలు.