రాష్ట్రీయం

‘కోటి’ మాట తప్పను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31:‘మీ బిడ్డగా..తెలంగాణ ముఖ్యమంత్రిగా చెబుతున్నా..ఎవరేమన్నా, ఎవరు అడ్డుకున్నా మా ప్రస్థానం ఆగదు. ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించి చూపిస్తాం.మూడేళ్లలో దాదాపు 50-60 శాతం పనులు పూర్తవుతాయి. ఐదేళ్లలో వంద శాతం పూర్తవుతాయి.ప్రాజెక్టులను సందర్శిస్తాను.ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాను. బడ్జెట్‌లో ప్రాజెక్టులకు 25వేల కోట్లు కేటాయించాం. వచ్చే సంవత్సరం 30 వేల కోట్లు కేటాయించుకుందాం’అని కె.చంద్రశేఖర్ రావుగురువారం అసెంబ్లీలో తెలిపారు. ఐదేళ్ల కాలంలో భారీనీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 1956లో చెరువులు, చిన్నతరహా నీటి ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణలో 20లక్షల ఎకరాలు సాగు అయ్యేదని, ఇప్పుడు 19లక్షల ఎకరాలు సాగు అవుతోందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో వివక్షకు ఇది సాక్ష్యమని అన్నారు. వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగించామని తెలిపారు. ‘మన నిధులు మనమే వినియోగించుకుంటున్నాం. ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిసారిస్తా’మని కెసిఆర్ తెలిపారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ముప్పు తప్పడం లేదని అన్నారు. మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా నిజాం సాగర్‌లో చుక్క నీరు లేదని, పైన ఉన్న మహారాష్ట్ర ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బ్యారేజీలు నిర్మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. మహారాష్ట్ర 450 బ్యారేజీలు నిర్మించిందని, బాబ్లీ వీటిలో చివరిది అని అన్నారు. ఎగువ రాష్ట్రాలు ఇలా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కోర్టులు, సెంట్రల్ వాటర్ కమీషన్ ఆదుకోవడం లేదన్నారు. కనీసం సెంటర్ వాటర్ కమీషన్‌కు వీటి సమాచారం కూడా ఇవ్వరని ముఖ్యమంత్రి తెలిపారు.
పనిగట్టుకుని వివాదాలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశ పూర్వకంగానే తెలంగాణ ప్రాజెక్టులను వివాదంలో పడేట్టు చేశారని కెసిఆర్ తెలిపారు. అంతర్ రాష్ట్ర వివాదం ఉండేట్టు చేశారని, ఇచ్చంపల్లి కట్టగలిగే పరిస్థితి ఉన్నా అంతర్ రాష్ట్ర వివాదం వల్ల అది సాధ్యం కాలేదన్నారు. అంతర్ రాష్ట్ర వివాదం లేకపోతే పర్యావరణ, వన్య ప్రాణి సంరక్షణ అడ్డంకులు కలిగేట్టు చేశారని తెలిపారు. అందుకే ప్రాజెక్టులు కాగితాలు, ఫైళ్లలోనే పరిమితమయ్యాయన్నారు.
గోదావరిలో 954 టిఎంసిలు, కృష్ణలో 299 టిఎంసిలు నికర జలాలు, 77 టిఎంసిలు మిగులు జలాలు తెలంగాణ వాటాగా గతంలోనే తేల్చినట్టు చెప్పారు. రెండు నదుల్లో కలిపి 1330 టిఎంసిలని గత పాలకుల హయాంలోనే గుర్తించారని, తెలంగాణను సస్య శ్యామలం చేసేందుకు రాష్ట్ర హక్కును ఉపయోగించుకుంటామని అన్నారు. వీటిలో 254 టిఎంసిలు మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించినవన్నారు. భారీ ప్రాజెక్టుల కోసం 1071 టిఎంసిలు కేటాయించినట్టు చెప్పారు. ఒక లెక్క ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1 కోటి, 60 నుంచి 70వేల ఎకరాలని, మరో లెక్క ప్రకారం 1 కోటి 11లక్షల ఎకరాలు అని పేర్కొన్న ముఖ్యమంత్రి వాస్తవంగా ఎంత ఉంది అనేది లెక్క తేల్చనున్నట్టు చెప్పారు.
11వ శతాబ్దాంలోనే కాకతీయ రెడ్డిరాజులు ప్రపంచానికి వాటర్ షెడ్‌ను పరిచయం చేశారని కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో 75వేల చెరువులు ఉండేవని లక్నవరం, రామప్ప, పాకాల చెరువులు 11వ శతాబ్దాం నాటివని, నేటికీ వీటిని ఉపయోగించుకుని సాగు చేస్తున్నట్టు చెప్పారు. అసఫ్‌జాలకు బ్రిటీష్ వారితో స్నేహం ఏర్పడిన తరువాత బ్రిటీష్, ప్రాన్స్ ఇంజనీర్ల సహకారంతో ప్రపంచంలోనే తొలి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిజాం సాగర్‌ను నిర్మించారని తెలిపారు.
రేపటి తరానికి తెలంగాణ నీటిపారుదల రంగం గురించి తెలియాలనే ఉద్దేశంతోనే తాను అసెంబ్లీలో చెప్పాలనుకున్నానని, ఎవరినీ నిందించడం తన ఉద్దేశం కాదని కెసిఆర్ వివరించారు.
దుమ్ముగూడెం వల్ల ఉపయోగం లేదు
దుమ్ముగూడెం ప్రాజెక్టు వల్ల నాలుగైదు వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మాయ గా పేర్కొన్న ఆయన దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. గ్రావిటీ ద్వారా ఖమ్మం జిల్లాకు సాగర్ నుంచి నీరు లభిస్తుంటే దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మిస్తే, ఎత్తిపోతల ద్వారా ఖమ్మంకు నీరు అందుతుందని తెలిపారు. తెలంగాణకు తీవ్రంగా నష్టం కలిగించి, ఆంధ్ర కోసం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అవసరం ఉందా? లేదా? అని కెసిఆర్ ప్రశ్నించారు.
కాళేశ్వరమే శరణ్యం
మహారాష్ట్ర ఇష్టానుసారం బ్యారేజీలను నిర్మించిందని, ఇప్పటికే 450 బ్యారేజీలు కట్టిందని కెసిఆర్ అన్నారు. మహారాష్టల్రోని చెరువులు, బ్యారేజీలు, ప్రాజెక్టులు నిండిన తరువాత భారీ వర్షాలు కురిస్తే అప్పుడు నీళ్లు కిందకు వస్తాయని చెప్పారు. అలా వచ్చే అవకాశం ఏ నాలుగేళ్లకు ఒకసారి వస్తుందని చెప్పారు. అందువల్లనే మొదటి సారి శ్రీరాంసాగర్‌లో నీళ్లు లేకుండా పోయాయని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ కోసం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలి అని ఆలోచించినట్టు చెప్పారు. తెలంగాణకు ప్రయోజనం కలిగే విధంగా రీడిజైనింగ్ అవసరం అని అన్నారు. మహారాష్ట్ర అంగీకారంతో నీళ్లు తెచ్చుకోవడం ముఖ్యమా? ఎత్తు ముఖ్యమా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఏ పద్దతిని అవలంభిస్తే, తక్కువ సమయంలో తెలంగాణకు సాగునీరు లభించే అవకాశం ఉందో నిపుణులతో కలిసి చర్చించినట్టు చెప్పారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డుకోవడానికి ఆ జిల్లాకే చెందిన నాయకుడు కోర్టుకు వెళ్లారని తెలిపారు. ప్రజల్లో గందరగోళం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులు కట్టితీరుతామని, ఆకుపచ్చ హరిత తెలంగాణను సాకారం చేసి చూపిస్తానని ఉద్ఘాటించారు.
పెన్‌గంగ మీద 31 బ్యారేజీలు
పెన్‌గంగ నది మీద మహారాష్ట్ర ఇప్పటికే 31 బ్యారేజీలు నిర్మించిందని, మరో తొమ్మిది నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వీటి గురించి ఎవరు అడిగినా ‘మా లిమిట్‌లో మేమున్నాం’ అని మాత్రమే మహారాష్ట్ర సమాధానం చెబుతోందని, ఇతరత్రా ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదని కెసిఆర్ తెలిపారు. గూగుల్ మ్యాప్ ద్వారా మహాష్ట్ర కడుతున్న బ్యారేజీల వివరాలు సేకరించామన్నారు. 450 బ్యారేజీల వల్ల మహారాష్ట్ర కనీసం 13వందల టిఎంసిల నీటిని వినియోగించుకుంటుందని తెలిపారు. చివరకు కౌలాస్ నాలా అనే చిన్న ప్రాజెక్టు నెత్తిపైనా మహారాష్ట్ర బ్యారేజీలు నిర్మించిందని తెలిపారు.
గోదావరి నీళ్లు హైదరాబాద్‌కు రావడం వల్ల బతికిపోయామని, లేకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చేదని అన్నారు.
ఇక ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రలో కలిసిపోవడం వల్ల ఇందిర సాగర్ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని, అందుకే రీ డిజైన్ చేసినట్టు చెప్పారు. ఎకోజోన్ పేరుతో కినె్నర సాని ప్రాజెక్టు వివాదంగా మార్చారని అన్నారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టులోని ప్రాంతాలు ఆంధ్రలో కలిపారని పేర్కొంటూ రీ డిజైనింగ్ చేయాలా? వద్దా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు లభిస్తుందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 26లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. పుణ్యక్షేత్రం అయిన కాళేశ్వరం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ్మిడి హట్టివద్ద ప్రాజెక్టు నిర్మించినా నీళ్లు ఎక్కువగా ఉంటే బాబ్లీ తరహాలోనే పైన ప్రాజెక్టులు కట్టరనే నమ్మకం లేదని అన్నారు. అందుకే తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేస్తే, మహా రాష్టక్రు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని కొందరు విమర్శిస్తున్నారని కెసిఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయం 83వేల కోట్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రాణహిత- చేవెళ్లగా డిజైన్ చేసినప్పుడు 16 టిఎంసిలకే నీళ్లు ఇవ్వాలనేది నిర్ణయమని, ఇప్పుడు 26లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వన్నట్టు చెప్పారు.
దేవుని దయ వల్ల ప్రాజెక్టులు పూర్తి అవుతాయనే నమ్మకంతోనే ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెడుతున్నామని, మనుషుల పేర్లు పెట్టడం లేదని కెసిఆర్ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు 35వేల కోట్ల వ్యయం అవుతుందని అన్నారు. కృష్ణా నదిపై ఇక అవకాశం లేదని తెలిసిన తరువాత వైఎస్‌ఆర్ తన దృష్టిని గోదావరిపైకి మళ్లించారని, పోలవరం నిర్మించడానికి పూనుకున్నారని అన్నారు.