రాష్ట్రీయం

నిగ్గు తేలాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఈవీఎంలపై అంతర్జాతీయ నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.. త్వరలో 22 పార్టీల ప్రతినిధులతో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో ఎలక్షన్-2019 మిషన్‌పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో రుజువవుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావు లేదన్నారు. ఓటు ఎవరికి పడిందనే సంశయం ఉండరాదన్నారు. సంశయాత్మక ప్రజాస్వామ్యం చేటుదాయకమని వ్యాఖ్యానించారు. టీడీపీ పోరాటం వల్లే వీవీ ప్యాట్ రశీదులు వచ్చాయని, అయితే రశీదుపై ముద్ర తేలిగ్గా పడుతున్నందున వెంటనే కరిగిపోతోందని వివరించారు. వీవీ ప్యాట్ కూడా నూరుశాతం నియోజకవర్గాల్లో అమలు కావటం లేదని తెలిపారు. ఈవీఎంలను ప్రపంచంలోని 120 దేశాలు వినియోగించటం లేదని కేవలం 20 దేశాల్లోనే అమల్లో ఉందన్నారు. సాంకేతికతను తమ పార్టీ ప్రోత్సహిస్తుందని అయితే టెక్నాలజీ దుర్వినియోగం ప్రమాదకరమన్నారు. ఈవీఎంల పట్ల అంతా అవగాహన పెంపొందించుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను బలంగా ప్రజల్లో ప్రచారం చేయాలని పార్టీశ్రేణులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈడబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతం ఎప్పుడో కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. అయితే కేంద్రంలో బీజేపీ నేతలు ఒప్పుకోలేదని ఆరోపించారు. తాజాగా కేంద్రం ఇచ్చిన 10 శాతంలో కాపులకు ఐదు శాతం, మిగిలిన 5 శాతం ఈడబ్ల్యుఎస్ పేదలకు ఇస్తామని
ప్రకటించారు. పింఛన్లు రెట్టింపు చేయటాన్ని కేబినెట్ కూడా ఆమోదించిందని, నాలుగేళ్లలో పదిరెట్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. దీనివల్ల 54.61 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ 250 కోట్లు మందస్తు చెల్లింపునకు కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. చిన్న మొత్తాల పేదలకు ముందుగా చెల్లిస్తామని వెల్లడించారు. దీనివల్ల 6లక్షల మంది బాధితులకు సత్వర ఊరట లభిస్తుందని, మిగిలిన వారికి కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేశామని, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను మినహాయించామని పునరుద్ఘాటించారు. ప్రతి ఆటో డ్రైవర్, ట్రాక్టర్ యజమాని టీడీపీకి అండగా నిలవాలని కోరారు. మంజూరు కాకుండానే ఇల్లు కట్టుకున్న వాళ్లకు రూ 60వేలు చెల్లించాలని నిర్ణయించామని, దీనివల్ల లక్షా 26వేల మందికి రూ 756 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. చుక్కల భూములపై కలెక్టర్లకే అధికారం ఇచ్చామన్నారు. ఆర్డీవో ద్వారా సమస్యలు పరిష్కరించేలా చేశామని తెలిపారు.
చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని, రూ 50 కోట్లతో జగజ్జీవన్‌రామ్ స్మృతివనం అభివృద్ధి చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోల్‌కతా సభతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. అందుకే కూటమికి నలుగురు ప్రధానులని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ఎక్కువ నిధులిచ్చినట్టు కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ నిధులు మంజూరవుతున్నాయని, ఒక్క బుల్లెట్ ట్రైన్‌కే రూ లక్ష కోట్లు కేటాయించారని ఆక్షేపించారు. ఏపీకి ఇచ్చినవన్నీ టోల్ ఫీజులు వసూలుచేసుకునే రోడ్లే అన్నారు. రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించినట్టు బీజేపీ నేతలు ప్రగల్భాలు పలకటం దౌర్భాగ్యమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే ఏపీకి తక్కువ ఇచ్చారన్నారు. పోలవరం నిధులు నెలలో చెల్లిస్తామని ప్రకటించారు.. డీపీఆర్-2 ఆమోదంలో ఏడాది జాప్యం చేశారు.. ముందు గడ్కరీ దీనిపై సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ వల్ల అభివృద్ధి జరగటం లేదని, స్వయం కృషివల్లే సాధ్యమవుతోందని తెలిపారు. డబ్ల్యుఈఎఫ్ ఇండెక్స్‌లో 4.0తో ఏపీ 49 ర్యాంక్‌లో నిలిస్తే భారతదేశం 58 వ స్థానంలో ఉందన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అభిలషించారు. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పసుపు- కుంకుమ సభలను మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అమరావతి, విశాఖ, కడపలో మహిళా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 95 లక్షల మంది మహిళలను పేదరికం నుంచి విముక్తం చేయాలనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రతి మహిళకు రూ 10వేలు రాబడి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నాలుగు లక్షల మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశామని మిగిలిన వాళ్లకు త్వరలో ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సొంతింటి కల నిజం చేసేందుకు మొత్తం 27 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఇందులో పది లక్షలు పూర్తయ్యాయని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీనేతలకు దిశానిర్దేశం చేశారు.