రాష్ట్రీయం

విద్యుత్ రంగానికీ పోలవరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్దేశిత గడువు కంటే కనీసం 6 నెలలు ముందుగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. హరిత విద్యుత్ విప్లవంపై ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి ఇంధన శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి వరంగా మారనుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో హరిత, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. స్వచ్ఛమైన, హరిత ఇంధన ఉత్పత్తి వల్ల భవిష్యత్తులో ఇంధన చార్జీలు పెంచకుండా విద్యుత్ సరఫరా చేయగలమన్నారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం సుసాధ్యమవుతుందన్నారు. వినియోగదారులకు అత్యంత నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు సరఫరా చేసేందుకు, భవిష్యత్తులో చార్జీలు పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుండటంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థాపిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించుకుని అమలు చేయాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జీడీపీ వృద్ధికి, విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచేందుకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. రాష్ట్రంలో జల, ఇంధన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీని పునర్నిర్మించేందుకు ఎంతో కష్టపడుతున్నామన్నారు. ఫలితాలు సాధిస్తున్నామని, ఇంటికీ, పరిశ్రమకూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందుబాటు ధరల్లో అందించడంలో సఫలీకృతమయ్యామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండోవిడత సంస్కరణలతో నాలుగేళ్లలో దేశంలోనే రాష్ట్ర విద్యుత్ రంగం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గత నాలుగేళ్లలో విద్యుత్ చార్జీలు దాదాపు పెరగలేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ విద్యుత్ చార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. 18లక్షల మంది రైతులకు ఆదివారం నుంచి 9గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతుల అభివృద్ధిలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీల గృహాలు, ధోబీఘాట్లు, లాండ్రీ షాపులు, స్వర్ణకారులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల 50లక్షల మంది అదనంగా లబ్ధి పొందుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, దీనిద్వారా ఏకీకృత ఆయకట్టు అభివృద్ధి, పరిశ్రమలకు నీటి సరఫరా, మంచినీటి అవసరాలతో పాటు భారీగా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ 2014లో యూనిట్ 6.7 రూపాయలుగా ఉన్న సౌర విద్యుత్ ధర ప్రస్తుతం 2.7 రూపాయలకు పడిపోయిందన్నారు. ఈవిషయాన్ని ముందుగానే అంచనా వేశామన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతోందన్నారు. పోలవరం జల విద్యుత్‌కు సంబంధించి వివిధ అంశాలపై జలవనరుల శాఖతో చర్చిస్తున్నామన్నారు. ఈ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి రెట్టింపు అవుతుందన్నారు. ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పురోగతి వివరిస్తూ.. 5339 కోట్ల రూపాయల అంచనాతో 2023 నాటకి పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2014లో స్థాపిక సామర్థ్యం 9వేల మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18వేల మెగావాట్లకు పెంచగలిగామన్నారు. ఇందులో పునరుత్పాదక ఇంధన వాటా ప్రస్తుతం 24శాతానికి చేరిందని, దీన్ని 50శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరఫరా, పంపిణీ నష్టాలను 9.72 శాతానికి తగ్గించామన్నారు. దీన్ని 6శాతానికి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. డ్రాఫ్ట్ ట్యూబ్, పవర్ హౌస్ లేఅవుట్లు, ఇన్‌టేక్ నిర్మాణాల పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పుణేఠా, తదితరులు పాల్గొన్నారు.