రాష్ట్రీయం

సీమలోనూ ఇక కృష్ణా పరవళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: దశాబ్దాల కాలంగా చిరకాల వాంఛగా మిగిలిన రాయలసీమకు కృష్ణాజలాల తరలింపు ఎట్టకేలకు సాకారమైందని, సీమ వాసుల కలను తమ ప్రభుత్వం నిజం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిని సోమవారం ఆయన సమీక్షించారు. ప్రాజెక్ట్‌ను 66శాతం పూర్తిచేసిన అధికారులను అభినందించారు. లక్ష్యం మేరకు పనుల పూర్తికి వేగం పెంచాలని కోరారు. చిత్తూరుకు కృష్ణాజలాల చేరికతో జిల్లావాసులు సంతోషంగా ఉన్నారని, అనేక ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే నెల 15కల్లా చిత్తూరుకు నీటిని తరలిస్తామని భరోసా ఇచ్చారు. పలమనేరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరులో జలసిరికి హారతి ఇస్తామన్నారు. మదనపల్లికి ఇక రోజూ తాగునీరు అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. వేసవి దృష్ట్యా చెరువులన్నింటినీ పూర్తిస్థాయిలో నింపాలని అధికారులను ఆదేశించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు మంగళవారం నీరు విడుదల చేయాలని, పలమనేరు చిన్న చెరువును నింపాలన్నారు.
కెల్లర్ కంపెనీ నివేదిక ఆవిష్కరణ
పోలవరం ప్రాజెక్ట్‌కు 2017 నుంచి కాపర్‌డ్యామ్ కోసం జెట్ గ్రౌటింగ్ చేస్తున్న కెల్లర్ కంపెనీ రూపొందించిన నివేదికను ఈసందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దేశంలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు జెట్ గ్రౌటింగ్ టెక్నాలజీ వినియోగం ఇదే తొలిసారి అని కంపెనీ తన నివేదికలో పేర్కొంది. గ్లోబల్ స్ట్రెంత్ - లోకల్ ఫోకస్ అనే నినాదంతో పనిచేస్తున్న కెల్లర్ ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీని వినియోగిస్తోంది. నేలలో బలహీనమైన ఇసుక, రాతిపొరలు ఉంటే ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆ ప్రభావం పడకుండా కట్టడాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భూమిలో 10 నుంచి 20 మీటర్ల వరకు డ్రిల్ రిగ్ ద్వారా ద్రవాన్ని పంపడం ఈ ప్రక్రియలో ముఖ్యభాగం. పోలవరం పనులు 66శాతం పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తవ్వకం పనులు 4.48 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా, కాపర్ డ్యామ్ అప్‌స్ట్రీమ్ 1.73 సీసీ మీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ఏడాది మే నెలాఖరుకు పనులు పూర్తవుతాయని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని, నిర్దేశిత లక్ష్యం మేరకు ఎప్పుడు పూర్తిచేస్తారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తికాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మడకశిర పెండింగ్ పనులు పూర్తిచేయాలని కూడా ఆయన సూచించారు.
ప్రారంభానికి సిద్ధంగా ప్రాధాన్య ప్రాజెక్ట్‌లు
పులిచింతల, గుండ్లకమ్మ, మడకశిర బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, అడవిపల్లి లిఫ్ట్ ప్రారంభానికి సిద్ధమయ్యాయని, వంశధార ఫేజ్-2, వంశధార - నాగావళి అనుసంధానం, బాబూ జగ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1 పనులు జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం పనులు 65.91 శాతం పూర్తికాగా, హెడ్‌వర్క్స్ పనులు 55.54, మెయిన్ డ్యామ్ ప్యాకేజ్ పనులు 56.24 శాతం పూర్తయ్యాయన్నారు. తవ్వకం పనుల్లో స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, లెఫ్ట్‌ప్లాంక్ పనులు 82.30 శాతం మేర పూర్తయ్యాయి. కాంక్రీట్ పనుల్లో స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్, క్రివైసిస్ ఫిల్లింగ్ 63.81 శాతం మేర జరిగాయని, రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 62.79, డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ నూరు శాతం జరిగాయని వివరించారు.
వాటర్ బడ్జెటింగ్ ఒక మంచి కార్యక్రమమంటూ భూగర్భ జల మట్టాలపై అవగాహన పెంచటం పట్ల అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. జలచైతన్యం, రైతులకు సాధికారత కల్పించటంలో నైపుణ్యాభివృద్ధికి జలవనరుల శాఖ కృషికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు లభించడం ప్రశంసనీయమన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి జీ సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. కెల్లర్ కంపెనీ నివేదికను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తదితరులు