రాష్ట్రీయం

స్లెట్ నిర్వహణకు మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ‘స్లెట్’(స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్టు) ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘స్లెట్’ నిర్వహణ బాధ్యతలు ఆంధ్రాయూనివర్శిటీకి అప్పగించారు. యూనివర్శిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకానికి ప్రాధమిక అర్హతగా స్లెట్‌ను పరిగణిస్తారు. రానున్న రోజుల్లో స్లెట్ నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం స్టీరింగ్ కమిటీని, మోడరేషన్ కమిటీలను కూడా నియమించింది. స్టీరింగ్ కమిటీలో చైర్మన్, ఇద్దరు వైస్ ఛాన్సలర్లు, ఇద్దరు ప్రొఫెసర్ స్థాయి విద్యావేత్తలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, యు-క్యాట్ మెంబర్ సెక్రటరీ ఉంటారు. స్టీరింగ్ కమిటీకి మెంబర్ సెక్రటరీ సైతం ప్రాతినిధ్యం వహిస్తారు. మెంబర్ సెక్రటరీగా సీనియర్ ప్రొఫెసర్‌ను, చైర్మన్‌గా విద్యావేత్తను నియమిస్తారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్ మోడరేషన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి, ఇద్దరు ప్రొఫెసర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక ప్రొఫెసర్, యుక్యాట్ నామినీ, యుజిసి అధికారి ఒకరు, రాష్ట్రప్రభుత్వ యూనివర్శిటీ సీనియర్ ప్రొఫెసర్ మెంబర్ సెక్రటరీ హోదాలో ఉంటారు. ఈ క్రమంలో వెంటనే కమిటీలను నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని కోరింది. స్లెట్‌కు సంబంధించి పలు పిటీషన్లు రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలుచేస్తూ 2016 ఏప్రిల్‌లోగా తొలి స్లెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో త్వరగానే కమిటీల నియామకం పూర్తి చేసి, పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.

నన్నయ్య వర్శిటీ
విసిగా ముత్యాలనాయుడు
నాగార్జున వర్శిటీ ఇన్‌చార్జి విసిగా
ప్రొఫెసర్ వి ఎస్ ఎస్ కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 2: రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ముర్రు ముత్యాలనాయుడును ప్రభుత్వం నియమించింది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ ఎస్‌కె ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ డైరెక్టర్‌గా ముత్యాలనాయుడు వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు నాగార్జున నగర్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ అంశకాలిక వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ వి ఎస్ ఎస్ కుమార్‌ను నియమించారు. కుమార్ ప్రస్తుతం కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. పూర్తి కాలిక వైస్ ఛాన్సలర్‌ను నియమించే వరకూ కొనసాగాల్సిందిగా కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

చేనేత కార్మికులకు రూ.365 కోట్ల రుణమాఫీ వెంటనే చేయండి

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్ర రాష్ట్రంలో చేనేత కార్మికుల బకాయిలు రూ.365 కోట్లు ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రుణాలను తక్షణమే మాఫీ చేయాలని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత డి పార్ధసారథి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోటయ్య కమిటీ నివేదిక ప్రకారం కేవలం 110 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం చేనేత కార్మికుల దుస్ధితిని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గంలోని సభ్యులు ప్రజల సొమ్మును విలాసాలాకు ఖర్చుపెడుతున్నారన్నారు. దీని వల్ల సంక్షేమ రంగానికి నిధులు అందక ఉక్కిరి బిక్కిరవుతోందన్నారు. టిడిపి ప్రభుత్వం రైతులు, డ్వాక్రా మహిళలను ఇంతవరకు మోసం చేసిందన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్, రైతులు, బలహీనవర్గాల సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలను ఎగగొట్టేందుకు కసరత్తు చేయడం తప్ప, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో
కాంగ్రెస్ హవా
గుజరాత్ స్థానిక ఎన్నికల ఫలితాల తీరు
అహ్మదాబాద్, డిసెంబర్ 2: గుజరాత్ స్థానిక ఎన్నికల్లో అధికార బిజెపికి చుక్కెదురైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయం నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు సాధించింది. బిజెపి ప్రాబల్యం పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల ఫలితాలు సరికొత్త ఊతాన్నిచ్చాయి. మొత్తం 31 జిల్లా పంచాయతీల్లో 21 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో బలమైన ప్రాబల్యాన్ని కనబరిచిన బిజెపి మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 56మున్సిపాల్టీల్లో 40చోట్ల విజయం సాధించింది.

ట్రాన్స్‌కోకు టారిఫ్ సబ్సిడీని మంజూరు చేస్తూ జీవో జారీ

హైదరాబాద్, డిసెంబర్ 2: వ్యవసాయ ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం తన వాటాగా రూ.250 కోట్ల సబ్సిడీని ఆంధ్రా ట్రాన్స్‌కోకు మంజూరు చేస్తూ జీవోను బుధవారం జారీ చేసింది. ఈ ఏడాదికి మొత్తం రూ.2928.15 కోట్ల టారిఫ్ సబ్సిడీ మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో భాగంగా నవంబర్ నెల వరకు రూ.750 కోట్ల సబ్సిడీని ఇప్పటికే మంజూరు చేసింది.

టి.హబ్‌కు సత్య నాదెళ్ల

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన టి హబ్‌ను మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల సందర్శించనున్నారు. ఈ నెల 28న టి హబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్ధేశించి ఆయన ప్రసంగించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. మూడు రోజుల పాటు సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో ఉండనున్నారు.

చంద్రబాబుతో
టి.టిడిపి నేతల భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం ఎన్.చంద్రమాబునాయుడుతో బుధవారం సమావేశమయ్యారు. టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి కుమారుడి వివాహానికి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. కొత్త దంపతులను ఆశీర్వదించిన తర్వాత చంద్రబాబు ఆ ఫంక్షన్ హాల్లోనే ఒక గదిలో టిటిడిపి ముఖ్యనేతలతో సమావేశమై మంతనాలు జరిపారు. స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలు, ఇతరత్రా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రతి దానికి తన కోసం వేచి చూడకుండా మీరే సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ విజయవాడ బయలుదే వెళ్లారు.

సైన్యంలో చేరేందుకు
యువత ముందుకు రావాలి

గ్లోబల్ యూత్ మీట్ ముగింపులో వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ
విశాఖపట్నం, డిసెంబర్ 2: భారత సైన్యంలో చేరేందుకు యువత ముందుకు రావాలని తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో జరుగుతున్న 3వ గ్లోబల్ యూత్ మీట్ ముగింపు కార్యక్రమానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్యంలో చేరే యువతకు మంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు.
దేశానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారు సైన్యంలో చేరడం ఉత్తమమన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాతి అభివృద్ధికి యువత కీలక భూమిక పోషించాలన్నారు. ఇదే విషయాన్ని గత నెలలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని దేశాల్లో యువత స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. గత నాలుగు రోజులుగా ఈ సదస్సులో విద్య, ఆరోగ్యం, పర్యావరణం తదితర అనేక అంశాలపై చర్చించినట్టు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ మోనికా అరోరా మాట్లాడుతూ ‘మన గ్లోబ్‌ను మనం రక్షించుకుందాం’ అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 160 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామెరూన్ నుంచి వచ్చిన ఫెర్డినంట్ సోనియి, విశాఖ పొలాక్స్ స్కూల్ విద్యార్థిని రూపిక సదస్సులో చేసిన తీర్మానాలను చదివి విన్పించారు. ఈ కార్యక్రమంలో జిమ్-2015 చైర్మన్ ఎం భాస్కరరావుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.