రాష్ట్రీయం

‘కోడ్’ ఉల్లంఘనలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఎన్నికల కమిషన్ విధించిన ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) తు.చ తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను కొనసాగించవచ్చన్నారు. కొత్త పథకాలు మాత్రం చేపట్టవద్దన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణను ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఆదాయం, ఖర్చు, నియామకాలు, గ్రామాల్లో అభివృద్ధి తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. అటవీ భూముల సర్వే పూర్తి చేయాలన్నారు. సీజనల్ కండీషన్స్‌పై కలెక్టర్లతో చర్చిస్తూ, ప్రస్తుత ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ఉపాధి హామీ పథకం అ మలు చేయడం తదితర అంశాలపై ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని పంచాయతీరాజ్, మున్సిపల్ ఉన్నతాధికారులకు సూచించారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకోసం తీసుకోవాల్సిన చర్యలను వివిధ శాఖలు ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల సెక్రటరీలతో ఏర్పాటు చేసిన మరొక సమావేశంలో జోషి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్టప్రతి ఉత్తర్వులో చేర్చేలా కేంద్రానికి నివేదిక పంపించాల్సి ఉందని, ఈ మేరకు నివేదికను రూపొందించాలంటూ జీఏడి అధికారులను ఆదేశించారు. టీ-వెబ్ పోర్టల్ కు సంబంధించి అన్ని శాఖలు కూడా నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి అన్ని సంస్కరణలు ఈ నెల 19 వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధీనంలోని అన్ని శాఖల ప్రధాన అధికారులు తమ శాఖలో ఉన్న పోస్టుల వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించి తమకు అందించాలని జిఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా కోరారు. ప్రతి శాఖకు చెందిన పోస్టులను ఆర్థిక శాఖ రీకన్సిల్ చేస్తుందని వివరించారు.
ప్రభుత్వ శాఖలకు సంబంధించి 573 వెబ్‌సైట్స్ ఉన్నాయని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ వెబ్‌సైట్లలో ప్రభుత్వ శాఖల సమాచారం, ఆన్‌లైన్ సర్వీసులు, పథకాలు ఉండేలా చూస్తున్నామన్నారు.
జాబితా సవరణలో ఓటర్ల బాధ్యత: సీఈఓ రజత్ కుమార్
ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకుని, తమ పేరును జాబితాలో చేర్పించుకునేందుకు ప్రతి ఓటరు బాధ్యత తీసుకోవాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎవరి పేరైనా లేకపోతే సంబంధిత ప్రొఫారంలో వివరాలు నింపి అధికారులకు అందించాలని సూచించారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంకా అవకాశం ఉందని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్ల జాబితా చూసి తమ పేరు లేదని అనుకోవడం సముచితం కాదని, ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అన్న అంశాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణపై విస్తృతంగా ప్రచారం చేశామని రజత్‌కుమార్ తెలిపారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా బాధ్యతగా ఉండాలని, చివరి నిముషంలో ఎన్నికల కమిషన్‌ను విమర్శించడం సరికాదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత శాంతి, భధ్రతల పరిస్థితిపై చర్చించేందుకు గురువారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని సీఈఓ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలో పోలీసు అధికారుల పాత్ర కీలకమైందన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత మూడు రోజుల్లో 4.51 లక్షల వాల్‌రైటింగ్‌లను, కట్-ఔట్లను, పోస్టర్లను, బ్యానర్లను, జెండాలను, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మంగళవారంనాడు 90,50,400 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసకుని, నలుగురిని అరెస్ట్ చేశారని, ఈ డబ్బును ఆదాయంపన్ను శాఖకు అందించామని రజత్ కుమార్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే సారి డబ్బును పట్టుకోవడం దేశంలోనే మొదటిసారన్నారు.

చిత్రం.. జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో
మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి