రాష్ట్రీయం

ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 18: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైసీపీ భూస్థాపితం కానుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. 150కి పైగా అసెంబ్లీ సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ మాత్రం అభివృద్ధి చేయని కేసీఆర్‌కు 88 స్థానాలు దక్కితే, దేశంలోనే ఎక్కడా అమలుకాని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని చంద్రబాబు తెలిపారు. సోమవారం గుంటూరు నగరంలోని ఎల్‌ఇఎం స్కూలు మైదానంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. కోటి మంది అక్కచెల్లెళ్లు, 65 లక్షల మంది సైనికులు అండ ఉన్న తాను దేనినైనా సాధించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో నదుల అనుసంధానాన్ని పూర్తిచేసి కరవును తరిమికొట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ హత్యా రాజకీయాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో లేకుండానే బాబాయిని చంపిన వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలెవ్వరూ ఇళ్లల్లో క్షేమంగా పడుకునే పరిస్థితులు ఉండబోవని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ నాటకాలు ఆడుతూ మన చెవిలో పువ్వు పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఓ పక్క మహిళలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించేందుకు పసుపు కుంకుమను అందిస్తే వైసీపీ చెరిపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జగన్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారని తెలిపారు. అటువంటి వారితో అంటకాగుతున్న వైఎస్‌ఆర్ పార్టీకి ఇక్కడ ఎవ్వరూ ఓట్లు వేయవద్దని పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోమనమే నెంబర్ వన్ అయితే, వైసీపీ అధికారంలోకి వస్తే జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతో పారిశ్రామిక వేత్తలు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. కోడికత్తి పార్టీ కుట్ర, కుతంత్రాలకు మారుపేరని, జగన్మోహనరెడ్డి నీతికి అర్థమే తెలియని వ్యక్తి అని చంద్రబాబు వర్ణించారు. ఆనాడు వైఎస్ తనపై 25 కేసులు బనాయించినా ఏమీ చేయలేకపోయారని గుర్తుచేశారు. తాను హత్యా రాజకీయాలకు దూరంగా ఉంటానని, చిల్లర రాజకీయాల జోలికి పోనని మరోసారి స్పష్టంచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే బీహారి అయిన పీకే సైబర్ నేరాలకు పాల్పడుతూ ఫారం-7తో టీడీపీకి చెందిన లక్షలాది ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనగానే కాపలాదారుడుగా చెప్పుకునే మోదీ, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులతో దాడులకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు.
తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలను నాశనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఆయా పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్నారని తెలిపారు. నా దగ్గర పనిచేసిన వ్యక్తి నన్ను దూషించే స్థాయికి ఎదిగారా అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. ఏపీలో కేసీఆర్ దాదాగిరి చేయాలనుకుంటే ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రంలో చక్రం తిప్పాలనే భ్రమల్లో ఉన్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో మిగిలేది టిఆర్‌ఎస్, వైసీపీయేనని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోనే రాజధాని జిల్లా గుంటూరుకు ప్రత్యేక స్థానం ఉందని, అమరావతికి రాజధానిగా పెట్టుకుని ఆనాడు గౌతమీపుత్ర శాతకర్ణి పాలించారని గుర్తుచేశారు. ఉద్యమకారుల చరిత్ర మెండుగా ఉన్న గుంటూరు జిల్లాలోనే అన్న ఎన్‌టిఆర్ చదివారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 9 ప్రాంతాల్లో ప్రచారం చేసినా గుంటూరు ప్రజలు చూపించిన అభిమానం ఎవరూ చూపించలేదన్నారు. జిల్లాలోని 17 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి తనకు బహుమతిగా అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చాలా మంది నాయకులు నా తమ్ముళ్ల భుజాల మీద ఊరేగి ఆనక గుండెలపై తన్ని పోతున్నారని, అటువంటి వారికి ప్రజాక్షేత్రంలో బుద్ధిచెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లాలోని అభ్యర్థులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు.

చిత్రం.. గుంటూరు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు