రాష్ట్రీయం

దగాకోరు.. చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 18: అధికారం కోసం ఎంతకైనా దిగజారే మనస్థత్వం చంద్రబాబుది అని, ఆయనది మోసకారి ప్రభుత్వమని, ఆయనొక దగా కోరు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సోమవారం రాయలసీమ జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, అనంతపురం జిల్లా రాయదుర్గం, కడప జిల్లా రాయచోటిలో జరిగిన సభల్లో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. ‘మీ భవిష్యత్తు.. నా భరోసా’ అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా, తొలి వంద హామీల్లో రైతు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, బెల్ట్‌షాపుల రద్దు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదంటే రూ.2 వేలు భృతి.., గ్రామీణ ప్రాంతాలకు రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు, రూ.1.37 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ.. వంటివి ఏవీ నెరవేర్చలేదన్నారు. ఇదేనా ప్రజలకు మీరిచ్చే భరోసా.. అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రజల భవిష్యత్ గురించి భరోసా ఇచ్చే వాడైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేవాడా.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసేవాడా అని నిలదీశారు. కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాక్కునేవాడా.. మట్టి నుంచి ఇసుక దాకా, కరెంటు నుంచి రాజధాని భూముల దాకా.. అన్ని విధాలా అక్రమాలు జరిగేవా.. ఉచిత వైద్య సౌకర్యం ఇచ్చే 108 వాహన పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా.. పేదలకు అండగా ఉండే ఆరోగ్యశ్రీని నీరుగార్చేవాడా.. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే వాడా..అందరి ఆధార్ నంబర్లు, మహిళల బ్యాంకు వివరాలు, ఓటరు కార్డు సమాచారం వంటివి దొంగిలించి జన్మభూమి కమిటీలకు ఇచ్చేవాడా అంటూ విమర్శించారు.
తాను 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సమయంలో నవరత్నాల్లో భాగంగా రూ. 3 వేలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చానని, ఈ ప్రకటన వెలువడగానే రూ.1500 నుంచి రూ.2వేలకు పెన్షన్ పెంచేశాడన్నారు. 2014లో మహిళా సంఘాల రుణాలు రూ.14,500 కోట్లు ఉండగా, 2018 సెప్టెంబర్ నాటికి రూ.25,500 కోట్లుకు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఫలితంగా ఉపాధి, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని అన్నారు. ఇలా ఉద్యోగాలు ఎగ్గొట్టడమే రాష్ట్భ్రావృద్ధా అని జగన్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, చదువుకునే వయసు లేక అల్లాడుతున్నారని, పేదలు ఆరోగ్యశ్రీ అమలు కాక మంచాన పడి దీనంగా బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ప్రతి గ్రామం, అణువణువుగా తిరిగానని, ప్రజల కష్టాలు, కన్నీళ్లూ చూశానని, నేనున్నాను.. అని మాటిస్తున్నానని అన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.3వేల కోసం మోసపోవద్దని అక్కాచెల్లెళ్లకు పిలుపునిచ్చారు. అలాగే ఈసారి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలోకి రాగానే మహిళలకు ఏడాదికి రూ.15వేలు, రైతులకు పంట పెట్టుబడిగా రూ.12,500 ఏడాదికి ఇస్తానని. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ రాజన్న చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.75 వేలు ఇస్తానని అన్నారు. మరో 20 రోజులు ఓపిక పట్టండి.. అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. అన్నీ నెరవేరుస్తాడని చెప్పండి.. అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే మీ పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్, సివిల్ సర్వీస్ వంటి ఉద్యోగాలకు వెళ్లాలన్నా అన్న వస్తాడు అని చెప్పండి అంటూ సూచించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉన్నది లేనట్లు, లేనివి ఉన్నట్లు జిమ్మిక్కులు చేస్తారని, ఆయన చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌సీపీని ఓటు వేసి గెలిపించాలని, ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని, బెల్టు షాపులను రద్దు చేస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని ఆనాడు మహానేత వైఎస్‌ఆర్ ప్రతి ఒక్కరికీ అంతులేని భరోసా ఇచ్చి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరి గుండెళ్లో బతికే ఉన్నాడని, ఇప్పుడు అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని జగన్ ప్రకటించారు.
మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించేది వాళ్లే. విచారణ చేపట్టేది వాళ్లే అని జగన్ మండిపడ్డారు. తప్పుడు రాతలు సృషించేది చంద్రబాబే.. చివరకు నిందలు వేసేది మాపైనే అని విమర్శించారు. అంతే కాకుండా ఓట్లను తొలగించి దొంగ ఓట్లను సృషించేది చంద్రబాబేనని అన్నారు. ఇలాంటి నాయకున్ని రాబోయే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్, శాసనసభకు పోటీచేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చిత్రం.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి