రాష్ట్రీయం

మన విజయం ఏకపక్షం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 19: ‘విభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చాం.. రాష్ట్రాన్ని అనేక కష్టాలు పడి అభివృద్ధి చేసుకుంటున్నాం.. 2024కు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది.. అభివృద్ధి సగంలో ఆగిపోరాదు.. కుట్రలు, కుతంత్రాలు సమసిపోవాలి.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం.. రాష్ట్ర అభివృద్ధి కోరే అందరూ ఏకం కావాలి.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీకి ఏక పక్ష విజయం అందించండి’ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ భవిష్యత్.. నా బాధ్యత నినాదంతో అనంతపురం నగరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభలో బాబు మాట్లాడుతూ ‘65 లక్షల మంది పసుపు సైన్యం నాకుంది.. మీరు తలచుకుంటే గెలవడం అసాధ్యమా, మీరంతా రాష్ట్రంలోని 5 కోట్ల మందిని చైతన్యపర్చండి’ అని పిలుపునిచ్చారు. టీడీపీ చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పండి.. అవతలి పార్టీ (వైకాపా) డొల్లతనాన్ని తెలియజెప్పండి.. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. అంటూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసింది గానీ, జగన్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని అన్నారు. టీడీపీని స్థాపించిన నందమూరి తారక రామారావు మనందరికీ స్ఫూర్తి.. ప్రతి కార్యకర్తా కొండవీటి సింహం కావాలి.. ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా.. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం, నవ్యాంధ్ర ఆత్మగౌరవం కోసం ఎంతటి వారినైనా ఢీకొంటామన్నారు. 2014లో కాంగ్రెస్ మాదిరిగా ఈ ఎన్నికల్లో వైకాపా రాకుండా చేస్తే అది రూపుమాసిపోతుందని సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని బెస్ట్ టీమ్‌ను ఇచ్చానని, 2014ను దృష్టిలో పెట్టుకుని మంచి వారిని ఎంపిక చేశామని, సీట్లు దక్కని వారికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, తెలంగాణ నుంచి రావాల్సిన మన వాటా ఇవ్వలేదని, ఐటీ, సీబీఐ, ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, అయినా ప్రధాని నరేంద్ర మోదీ నమ్మక ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మిమ్మల్ని క్షమించరని మోదీకి శాపనార్థాలు పెట్టారు. ఇంటి విభజన జరిగితే ఆస్తులు పంచుతారు.. కానీ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పులు పంచారన్నారు. గడచిన ఐదేళ్లలో తెలంగాణలో జరగని అభివృద్ధి రాష్ట్రంలో తెచ్చామని అన్నారు. పింఛన్లు ఐదు రెట్లు పెంచాతానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాను.. ఇపుడు 10 రెట్లు పెంచానన్నారు. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా ఉంటానన్నాను.. ఉన్నాను..అని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశానని, కృష్ణా-పెన్నాతో పాటు అన్ని నదులూ అనుసంధానం చేస్తానన్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని భూములకూ నీరిచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారు.. మనం ఏం తప్పు చేశాం.. వారు పెట్టే అగచాట్లు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ఏ-1, ఏ-2గా 12 కేసుల్లో జగన్ ముద్దాయి అని అవతలి వారిపై వ్యక్తిగతంగా దాడి చేయడం ఆయన నైజం. సొంత మీడియాతో అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు..విలువలు లేని వ్యక్తులు వాళ్లు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత బాబాయి హత్య జరిగితే దానిని రాజకీయం చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆపరాధ భావం జగన్‌ను వెంటాడుతోందని, అయినా గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.
కేసుల మాఫీ కోసం జగన్ కేంద్రంతో లాలూచీ పడ్డాడడని, ఆయన పార్టీ ఎక్కడుంది అంటే మోదీ సంకలో ఉంది, ఆయన జేబులో ఉంది అని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రంపై దాడి చేస్తున్నారన్నారు. బాంచన్ నీకాళ్మొక్కుతానంటూ జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో తిష్ట వేసి ఆనందంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ పార్టీకి 22 ఎంపీ సీట్లు వస్తాయంట.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేసిన మనకెన్ని సీట్లు రావాలి అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ నా బర్త్‌డేకు గిఫ్ట్ ఇస్తానన్నారు.. నేను ఆయనకు 10 గిఫ్ట్‌లు తిరిగి ఇస్తానని అన్నారు. కేసీఆర్ ఏపీలో దొడ్డిదారిన పెత్తన చెలాయించాలనుకున్నారు.. ఏపీ ఎన్నికలతో సంబంధం లేదంటారు.. మరి డబ్బులు పంచడంలో మీకు సంబంధం.. పోలవరాన్ని అడ్డుకోవడంలో మీకు సంబంధం ఉంది.. దొంగ నాటకాలు ఆపండి అంటూ ధ్వజమెత్తారు. తెలుగువారి ఆత్మగౌరవం, నవ్యాంధ్ర ఆత్మ గౌరవం కోసం ఎలాంటి వారితోనైనా ఢీకొంటామన్నారు.
చిత్రం.. అనంతపురంలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు