రాష్ట్రీయం

హిందూపురంలో తిరుగులేని టీడీపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 19: నందమూరి వారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న నియోజకవర్గంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కుటుంబం నుంచి ఎన్నికల్లో ఎవరు పోటీచేసినా గెలిపిస్తూ వచ్చిన ఘనత పురం ఓటర్లకు దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ విజయ పరంపర అప్రతిహాతంగా సాగుతోంది. దీంతో హిందూపురంను నందమూరిపురంగా టీడీపీ శ్రేణులు చెప్పుకుంటారు. హిందూపురం నియోజకవర్గానికి 1919 నుంచే ఎన్నికలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అయితే ప్రభుత్వ రికార్డుల్లో 1952 నుండి మాత్రమే గణాంకాలు ఉన్నాయి. 1952లో హిందూపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శివశంకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత 1955లో జరిగిన ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పటివరకు హిందూపురంలో 16 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 1983 నుండి 2014 వరకు తెలుగుదేశం పార్టీ వరుస విజయాలతో చరిత్ర సృష్టించింది. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన ఎన్నికల్లో హిందూపురానికి చెందిన పామిశెట్టి రంగనాయకులు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి సేవామందిరం తిప్పేస్వామిపై 26,855 ఓట్లతో ఘనవిజయం సాధించారు. అనంతరం 1985లో ఎన్టీఆర్ కోసం పామిశెట్టి రంగనాయకులు ఈ స్థానాన్ని త్యాగం చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావు హిందూపురం, తిరుపతి, గుడివాడ నుంచి పోటీ చేసి మూడుచోట్ల విజయకేతనం ఎగురవేశారు. అయితే అంతకుమునుపు గవర్నర్ రామ్‌లాల్ ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంతో హిందూపురం ప్రజలు పెద్దఎత్తున ఉద్యమాలు చేసి అండగా నిలిచారు. దీంతో మూడుచోట్ల విజయం సాధించిన ఎన్టీఆర్ హిందూపురం ప్రజల ఆదరాభిమానాన్ని మరువక ఇక్కడి నుండే ప్రాతినిథ్యం వహించారు. 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇక్కడి నుండే పోటీ చేసి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. ఇక్కడ వరుసగా మూడుసార్లు గెలిచిన అభ్యర్థి ఎవరూ లేరు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 60,050 ఓట్లతో ఎన్టీఆర్ విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఇంత మెజార్టీని ఎవరూ అధిగమించలేకపోయారు. ఎన్టీఆర్ మృతి చెందిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ ఇక్కడి నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డిపై 58,210 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అనంతరం 1999లో సీసీ వెంకటరాముడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగ కాంగ్రెస్ అభ్యర్థి సేవా మందిరం తిప్పేస్వామిపై 38,391 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హవాలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి పామిశెట్టి రంగనాయకులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌నిశ్చల్‌పై 7,363 ఓట్లతో విజయం సాధించారు. 2009లో నాటకీయ పరిణామాల నడుమ టీడీపీకి విజయం కలిసొచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన అంబికా లక్ష్మీనారాయణను చివరి సమయంలో బరిలోకి దించడంతో రెబల్‌గా సీనియర్ నాయకుడు నవీన్‌నిశ్చల్ ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీ 8,764 ఓట్లతో విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీకి 45,506 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్‌నిశ్చల్‌కు 36,742 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు 30,768 ఓట్లు, పీఆర్‌పీ అభ్యర్థి పల్లా లక్ష్మీనారాయణకు 18,713 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బరిలో దిగడం టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనీకి లాభించింది. 2014లో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి నవీన్‌నిశ్చల్‌పై 16,196 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మరోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. వైకాపా అభ్యర్థిగా విశ్రాంత రాయలసీమ ఐజీ ఇక్బాల్ అహ్మద్ పోటీ చేస్తున్నారు.
హిందూపురం నియోజకవర్గం పరిధిలో హిందూపురం మున్సిపాలిటీతో పాటు లేపాక్షి, చిలమత్తూరు మండలాలు ఉన్నాయి. మొత్తం 2,19,012 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,11,211 మంది, మహిళలు 1,07,791 మంది ఇతరులు 10 మంది ఉన్నారు.
*
హిందూపురం నుంచి
గెలిచిన అభ్యర్థులు
*
సం. విజేత పార్టీ
*
1952 శివశంకర్‌రెడ్డి స్వతంత్ర
1955 కల్లూరు సబ్బారావు కాంగ్రెస్
1962 కే.రామకృష్ణారెడ్డి ఐఎస్‌డీ
1965 కేఎస్.రావు కాంగ్రెస్
1967 కాట్నగంటి స్వతంత్ర
1972 జీ.సోమశేఖర్ కాంగ్రెస్
1978 కే.తిప్పేస్వామి కాంగ్రెస్(ఐ)
1983 రంగనాయకులు టీడీపీ
1985 ఎన్టీ రామారావు టీడీపీ
1989 ఎన్టీ రామారావు టీడీపీ
1994 ఎన్టీ రామారావు టీడీపీ
1996 నందమూరి హరికృష్ణ టీడీపీ
1999 సీసీ.వెంకటరాముడు టీడీపీ
2004 రంగనాయకులు టీడీపీ
2009 అబ్దుల్ ఘనీ టీడీపీ
2014 నందమూరి బాలకృష్ణ టీడీపీ