రాష్ట్రీయం

అవి చెల్లని నోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులుగా బరిలోకి దింపుతోన్న కాంగ్రెస్, బీజేపీలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీకి చెల్లని నోట్లు పార్లమెంటుకు ఎలా చెల్లుతాయి’ అని ఆయన ప్రశ్నించారు. ‘చిరిగిన నోటు ఎక్కడా చెల్లదు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకుల కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధికి లాభం, బీజేపీకి ఓటేస్తే మోదీకి లాభం, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణకు లాభమని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు, అభివృద్ధి కోసం ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ సిట్ అంటే సిట్...స్టాండ్ అంటే స్టాండే’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘్ఢల్లీని శాసించాలి తప్ప యాచించవద్దు అని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారు’ అని కేటీఆర్ గుర్తు చేశారు. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అఖండ విజయాన్ని చేకూర్చినట్టుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు సీఎం కేసీఆర్ అని ప్రశసించారు. అలాంటిది 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఆయన సాధించలేనిదేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి గెలిచే 16 మంది ఎంపీలకు 116 మంది తోడవుతారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఒక్క దానికైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీలో గులాబీ సైనికులు ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఉరుక్కుంటూ రాదా? అని కేటీఆర్ అన్నారు. వీరోచితంగా పోరాటం చేస్తేగానీ తెలంగాణకు ఎయిమ్స్ రాలేదని గుర్తు చేశారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం తెగించి కొట్లాడినం, చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అంటూ కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. అన్ని పార్టీలు రైతుల గురించే మాట్లాడుతాయని, జై కిసాన్ అనే నినాదాన్ని కాంగ్రెస్, బీజేపీలు వినియోగించుకున్నాయి తప్ప వారి కోసం ఏమైనా చేసింది ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయం దండుగన్న చంద్రబాబు నాయుడు విధిలేక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధును నకలు కొట్టకతప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు పంట సాయం అందుతుందంటే ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ పథకాన్ని చివరికి బీజేపీ సర్కార్ కూడా కాపీ కొట్టకతప్పలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికే స్ఫూర్తినిచ్చాయి, వీటికి ఆర్థిక సహాయాన్ని అందించాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఎందుకు స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ ఎంపీలనే గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

చిత్రం.. తెలంగాణ భవన్‌లో ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తెరాసలో చేరిన సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్