రాష్ట్రీయం

వారంతా అవకాశవాదులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: అవకాశవాదులే పార్టీ మారుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం కే జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఉత్తమ్ విలేఖరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌ను ప్రగతి భవన్‌కు మార్చేశారని ఆయన ధ్వజమెత్తారు. మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరి, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనుండడం గురించి ప్రశ్నించగా ‘లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా మేమూ అడిగాం. ఆమె ఆమె నిరాకరించారు’అని ఆయన బదులిచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలుపొందినా సాధించేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదేళ్ళ పాటు 15 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. విభజన హామీలు సాధించలేని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మతతత్వ బీజేపీకి సహకరించడం తప్ప చేసేదీ ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓటేస్తే, మురికి కాల్వలో వేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. కేంద్రంలో ఈ దఫా కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు, విభజన హామీలన్నీ సాధిస్తామని ఆయన తెలిపారు. కొత్తగా ఐటీఐఆర్‌ను సాధిస్తామని, ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. ఎస్‌టీ, ముస్లింలకు జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఉత్తమ్ తెలిపారు. సీఎల్‌పి మాజీ నేత కే జానారెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలను మంటకలుపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలే టీఆర్‌ఎస్‌కు బుద్ది చెబుతారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని జానారెడ్డి ప్రజలను కోరారు.
లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలవకపోతే ముక్కు నేలకు రాస్తారా? అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన కుమారుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. వారికి ధైర్య ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. తాను దేనికైనా రెడీ అని అన్నారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలతో పాటు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన తెలిపారు. పార్టీలో లాభపడిన వారు, అవకాశవాదులు స్వార్థంతో టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసుల భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీకి వంత పాడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరుగుతుందని, అధికారం శాశ్వతం కాదని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి